కళ్లు సున్నితమైన అవయవం. వయస్సు, ఒత్తిడి, కాలుష్యం, పేలవమైన ఆహారం మొదలైన అలవాట్ల వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతినడమే కాదు..కంటిచూపు కూడా తగ్గుతుంది. అయితే కొన్ని చిట్కాలతో కంటిచూపును పెంచొచ్చంటున్నారు నిపుణులు.

మన శరీరంలో అత్యంత సున్నితమైన అవయవం కళ్లు. కంటి చూపు లేకుంటే మన జీవితం అంధాకరమైపోతుంది. అసలు చూపు లేకుండా ఎలా బతకగలం అన్న ఊహే భయంకరంగా ఉంటుంది. కానీ కొంతమంది చేజేతులారా కంటిచూపును తగ్గించుకుంటున్నారు. కొన్ని అలవాట్లు కంటిచూపును మొత్తమే పోగొడుతాయి. కంటి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. 

ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వాటిపై శ్రద్ధ పెట్టాలి. వయస్సు, కాలుష్యం, ఒత్తిడి, పేలవమైన పోషణ వంటి కారకాలు మీ కంటి చూపును ప్రభావితం చేస్తాయి. అయితే కళ్ల వృద్ధాప్యాన్ని నివారించలేనప్పటికీ.. కంటిచూపు తగ్గకుండా చేయొచ్చు. కంటి ఆరోగ్యం బాగుండాలన్నా.. కంటి చూపు మెరుగ్గా ఉండాలన్నా ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ధూమపానం మానేయండి

స్మోకింగ్ మీ ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. క్యాన్సర్ కు దారితీస్తుంది. అంతేకాదు మీ శరీరంలో అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మీ కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కంటి ఆక్సీకరణ నష్టానికి గురి చేస్తుంది. దీనివల్ల మీ కళ్ళను ప్రభావితం చేసే కంటిశుక్లం వంటి అనేక అనారోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. అప్పుడే మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 

సమతుల్య ఆహారం

కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సమతుల్య ఆహారం సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఆకుపచ్చ కూరగాయలు, సీ ఫుడ్ తో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిచూపును పెంచే మాక్యులాకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అవసరం. ఇవి సాల్మన్ వంటి ఆహారాలలో మాత్రమే ఉంటాయి. వీటితో పాటుగా ఆకుకూరలు, కాయలు, విత్తనాలు, ప్రోటీన్లతో సహా ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినండి. అలాగే మద్యం తాగడం లేదా ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వులు తినడం మానుకోండి. ఎందుకంటే అవి మాక్యులాను దెబ్బతీస్తాయి.

చేతుల పరిశుభ్రత

స్క్రీన్ ను ఎక్కువగా యూజ్ చేసిన తర్వాత మీ చేతులతో కళ్లను అస్సలు తాకకుండదు. ఎందుకంటే స్క్రీన్ ను మనం ఎప్పుడూ క్లీన్ చేయం. దీంతో వాటిపై ఎన్నో రకాల బ్యాక్టీరియాలు. సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి. ప్రత్యేకించి మీరు కాంటాక్ట్ లెన్సులు ధరిస్తే.. బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు బాక్టీరియల్ కండ్లకలక వంటి కంటి వ్యాధులకు కారణమవుతాయి. అందుకే చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోండి. మీ కళ్లను తాకే ముందు మీ చేతులను తేలికపాటి సబ్బుతో కడగండి.

రెస్ట్

ఎక్కువసేపు స్క్రీన్లను చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవడమే కాదు దృష్టి పెట్టడంలో ఇబ్బందిని, అస్పష్టమైన కంటిచూపుకు దారితీస్తాయి. కళ్లను రక్షించడానికి వైద్యుడిని తరచుగా సంప్రదిస్తూ ఉండండి. అలాగే కళ్లను తరచుగా ఆర్పుతూ ఉండండి. స్క్రీన్ ను చూసేటప్పుడు 5 లేదా 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. 

సన్ గ్లాసెస్

అతినీలలోహిత కిరణాలు మన కళ్లను దెబ్బతీస్తాయి. అందుకే యువీబీ, యువీఏ రక్షణ చాలా ముఖ్యం. సన్ గ్లాసెస్ లేదా సన్ క్యాప్స్ ధరించడం వల్ల మీ కళ్లపై యువీ కిరణాల ప్రభావం తగ్గుతుంది.