కొంతమందికి అకస్మత్తుగా కడుపు ఉబ్బరంగా, బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని ఆహారాలు ఉబ్బరాన్ని తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.  


ఉబ్బరం ఎవరికైనా రావొచ్చు. ఏదైనా తిన్న తర్వాత లేదా పీరియడ్స్ అయినప్పుడు ఉబ్బరంగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం వల్ల పొత్తికడుపులో అసౌకర్యం లేదా వాపు వస్తుంది. ఏదేమైనా ఈ సమస్య వల్ల ప్రశాంతంగా ఉండలేరు. అయితే ఈ ఉబ్బరం రుతుచక్రం, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్, గర్భం, రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల మార్పుల వల్ల కూడా వస్తుంది. అలాగే కార్బోనేటేడ్ పానీయాలు, ఉప్పుగా ఉండే ఆహారాలు, పాల ఉత్పత్తులు వంటి కొన్ని ఆహారాలు లేదా పానీయాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అంతే కాదు ప్రకోప ప్రేగు సిండ్రోమ్, తాపజనక ప్రేగు వ్యాధి వంటి అనారోగ్యం కారణంగా కూడా ఇది వస్తుంది. నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలు కడుపు ఉబ్బరాన్ని వెంటనే తగ్గేలా చేస్తాయి. అవేంటంటే.. 

అల్లం

అల్లాన్ని ఎక్కువగా టీ లేదా ప్రతి వంటల్లో ఉపయోగిస్తారు. అల్లంలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. దీనిలో జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించడానికి, ఉబ్బరం, వాయువును తగ్గించడానికి సహాయపడే సమ్మేళనం జింజెరోల్ ఉంటుంది. అందుకే ఈ సమస్య వచ్చినప్పుడు కొద్దిగా పచ్చి అల్లం ముక్కను నమలండి. సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. 

సోంపు

సోంపులో యాంటిస్పాస్మోడిక్ ప్రభావాలున్న సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించడానికి, ఉబ్బరం తగ్గించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. 

పుదీనా

 పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలపై సడలింపు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఉబ్బరం, వాయువును తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

పైనాపిల్

ఈ తీపి పండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

బొప్పాయి

బొప్పాయిలో మీకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. దీనిలో పాపైన్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి, జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్.

అరటిపండ్లు

అరటిపండు అందానికి, ఆరోగ్యానికి ఎన్నో విధాలు ఉపయోపడుతుంది. ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడానికి, ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

కీరదోసకాయ

కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఇది ఉబ్బరం, నీటి నిలుపుదలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

పుచ్చకాయ

దోసకాయ మాదిరిగానే పుచ్చకాయలో కూడా నీరు ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఉబ్బరాన్ని తగ్గించడానికి, నీరు నిల్వను తగ్గించడానికి సహాయపడుతుంది.