ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారు చాలా మందే ఉంటారు. దీనివల్ల యోనిలో దురద, మంట, యోని నొప్పి, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.
ఈస్ట్ ఇన్ఫెక్షన్ కాండిడా అల్బికాన్స్ అనే ఫంగల్ పెరుగుదల వల్ల కలిగే ఫంగల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా యోనిలో కాండిడా, బ్యాక్టీరియాతో సహా ఈస్ట్ కూడా ఉంటుంది. అయినప్పటికీ.. ఈస్ట్ ఎక్కువగా పెరిగిప్పుడు.. ఇది సంక్రమణకు దారితీస్తుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల యోని దగ్గర, లోపల దురద, చికాకు, మంట, వాల్వల్ వాపు, యోని నొప్పి, దద్దుర్లు, వాసన లేని మందపాటి తెల్లగా ఉండే ఉత్సర్గ వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని సాధారణ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు
దీనివల్ల కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా.. కానీ ఇదే నిజమంటున్నారు నిపుణులు. అవును రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారి యోనిలో ఈస్ట్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు శిలింద్రాలకు సంతానోత్పత్తికి కేంద్రంగా పనిచేస్తుంది. దీనివల్ల శిలింద్రాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. అయితే ఈ అదనపు చక్కెర జననేంద్రియ ప్రాంతంలో పీహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది ఈస్ట్ పెరిగేందుకు దారితీస్తుంది.
యాంటీ బయోటిక్స్
యాంటీ బయోటిక్స్ ఎన్నో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. లేదా నెమ్మదింపజేస్తుంది. అయినప్పటికీ యాంటీ బయోటిక్స్ వాడకం కూడా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ఒకటి ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రారంభం. చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే యాంటీ బయోటిక్స్ యోనిలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కూడా చంపగలవు. ఇది ఈస్ట్ పెరుగుదలకు కారణమవుతుంది.
పాంటీలైనర్లు
పాంటీలైనర్లు ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయని నిరూపించడానికి బలమైన ఆధారాలు ఏమీ లేవు. కానీ దీర్ఘకాలికంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ఆడవారు పాంటీ లైనర్లను వాడకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇవి తేమను అలాగే నిలుపుతాయి. అలాగే గాలిని నిరోధిస్తాయి. దీనివల్ల అక్కడ ఈస్ట్ బాగా పెరుగుతుంది.
సువాసన గల ఉత్పత్తులు
మెడికల్ న్యూస్ టుడే ప్రకారం.. యోని క్లెన్సర్లు బ్యాక్టీరియా సంక్రమణకు 3.5 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉంటే.. యూటీఐలకు 2.5 రెట్లు ఎక్కువ ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా జెల్ శానిటైజర్లు ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు 8 రెట్లు ఎక్కువ ప్రమాదంతో ముడిపడి ఉన్నాయని, అలాగే బ్యాక్టీరియా సంక్రమణకు 20 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని నివేదించింది.
అండర్ వేర్ తప్పులు
ఎక్కువ టైట్ గా, సింథటిక్ లోదుస్తులు వేడికి, తేమకు కారణమవుతాయి. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. కాటన్ లేదా సిల్క్ లోదుస్తులు ధరించాలని నిపుణులు సలహానిస్తున్నారు. ఇవి తేమ ఆవిరైపోయేలా చేస్తాయి. అలాగే మీ లోదుస్తులు వదులుగా ఉండేలా చూసుకోండి.
