కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో ఇప్పటికే కొన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు. మూడు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వైరస్ లక్షణాలు గా జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు లాంటివిగా వైద్యులు సూచించారు.

ఈ లక్షణాలు కనపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అయితే.. తాజాగా మరి కొన్ని లక్షణాలు కూడా ఈ వైరస్ జాబితాలో చేరిపోయింది. కరోనా బాధితుల్లో వెన్ను నొప్పి, దద్దుర్లు, మెకాలి కింది భాగంలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. కొందరిలో డయేరియా సమస్య ఊహించినదాని కంటే ఎక్కువగా ఉందన్నారు.

ఒళ్లు నొప్పులు వంటి అసాధారణ లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొంతమందికి కేవలం కాలు కింది భాగంలో మాత్రమే నొప్పి ఉంటుందని.. అది తప్ప మరే లక్షణమూ కనపడటం లేదని చెబుతున్నారు.

కాగా.. కళ్లు ఎర్రబారడం కూడా కరోనా వైరస్ సోకిందనడానికి సంకేతమేనని కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్లోన్ సోలర్టె తెలిపారు.

ఇటీవల కంటి సమస్యతో ఓ మహిళ తమ వద్దకు వచ్చిందని.. తొలుత అది కంటిలో ఏదో సమస్య అని భావించామని చెప్పారు. అయితే.. తర్వాత తమ పరిశోధనలో ఆమెకు కరోనా సోకినట్లు తేలిందని చెప్పారు. కరోనా రోగుల్లో 10-15శాతం మందికి సెంకడరీ లక్షణంగా కండ్ల కలక, కళ్లు ఎర్రబడటం లాంటివి జరుగుతున్నాయన్నారు. ఈ సమస్యలతో వచ్చేవారికి కంటి డాక్టర్లు కోవిడ్ పరీక్షకు సిఫారసు చేయడం మంచిదని సూచిస్తున్నారు.