శరీర పరిశుభ్రతకు స్నానం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండటం కోసం రోజుకు ఒక్కసారైనా స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది మరీ ఎక్కువ వేడిగా ఉండే నీటితోనే స్నానం చేస్తారు. దీనివల్ల జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలే కాదు చర్మం ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.  

స్నానంతోనే మన ఒంటికి, జుట్టుకు అంటుకున్న క్రిమి కీటకాలు, దుమ్ము ధూళి వదిలిపోతుంది. ఈ సంగతి పక్కన స్నానం చేయడంలో తప్పులు చేస్తే జుట్టు దెబ్బతింటుంది. చర్మం చిరాకు పెడుతుంది. డ్రైగా మారుతుంది. ఇంతకీ స్నానం చేయడంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

వేడి నీటిని ఉపయోగించడం

చలికాలంలో చాలా మంది వేడి నీటితోనే స్నానం చేస్తుంటారు. ఇది ఒక సాధారణ అలవాటు కూడా. కానీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లు జుట్టుకు, చర్మానికి మంచివి కావు. వేడి నీటితో జుట్టును వాష్ చేస్తే నెత్తిమీద పిహెచ్ విలువ దెబ్బతింటుంది. జుట్టు క్యూటికల్ కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ జుట్టును ఎప్పుడూ కూడా గది ఉష్ణోగ్రత ఉన్న నీటితోనే వాష్ చేయండి. కష్టం అనిపిస్తే గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. 

శరీరానికి చాలా వేడి నీటిని ఉపయోగించకూడదు

వాస్తవానికి చలికాలంలో చల్లనీటితో స్నానం చేయకపోవడమే మంచిది. అలా అని చాలా వేడిగా ఉండే నీటితో కూడా స్నానం చేయకూడదు. చాలా వేడి నీటితో స్నానం చేసినా.. ఎక్కువసేపు స్నానం చేసినా చర్మం సహజ నూనెలను కోల్పోతుంది. వేడినీటితో మీ జుట్టు ఒకటే కాదు మీ చర్మం కూడా ప్రభావితమవుతుంది.

జుట్టును గట్టిగా రుద్దడం

చాలా మంది తలలో ఉన్న మురికి పోవాలని షాంపూ అప్లై చేసి గట్టిగా రుద్దుతుంటారు. దీనివల్ల మీ జుట్టు తెగిపోవడం, గరుకుగా మారడం జరుగుంది. అందుకే జుట్టును గట్టిగా రుద్దకండి. షాంపూను పెట్టి మీ చేతివేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేసి కడిగేయండి. 

ముందు మీ ముఖాన్ని కడగడం

చాలా మంది స్నానం లో ముందు ముఖాన్ని కడిగి ఆ తర్వాత జుట్టుకు షాంపూ పెట్టడం, ఒంటికి సబ్బు పెట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల ముఖంపై దురద, చికాకు కలుగుతుంది. ముఖంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోవడానికి కూడా దారితీస్తాయి. ఇవి మొటిమలకు కారణమవుతాయి. ఈ సమస్యలేమీ రాకూడదంటే ముందు జుట్టును, ఒంటిని కడిగిన తర్వాతే ముఖాన్ని కడగండి. 

తిన్న తర్వాత స్నానం చేయడం

తిన్న వెంటనే స్నానం చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు కడుపు వైపు మంచి స్థాయిలో రక్త ప్రవాహం అవసరం. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల చర్మానికి రక్త ప్రవాహాన్ని మళ్లిస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

కొంతమంది కఠినమైన వ్యాయామం తర్వాత నేరుగా బాత్ రూం కి వెళ్తారు. దీనికి కారణం చెమట పట్టడమే. కానీ వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. చెమట పూర్తిగా ఆగిన తర్వాతే స్నానం చేయండి. వ్యాయామం చేసినప్పుడు పట్టిన చెమటను, బ్యాక్టీరియాను తొలగించడానికి వ్యాయామం తర్వాత స్నానం చేయడం చాలా ముఖ్యం.