పురుషులతో పోల్చితే ఆడవాళ్లే బోలు ఎముకల వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే వీరి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అవేంటంటే..   

ఒకప్పుడు బోలు ఎముకల వ్యాధి వృద్ధులకే ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు యువకులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా 20, 30 నుంచి 40 ఏండ్ల ఆడవారే ఈ బోలు ఎముకల వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు. సాధారణంగా రుతువిరతి తర్వాతే ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడతారు. అయితే ఎముక సాంద్రత తక్కువగా ఉండటం వల్ల రుతువిరతికి ముందే ఆడవాళ్లు బోలు ఎముకల వ్యాధి బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలికంగా మందులను వాడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రుతుక్రమం ఆగిపోయిన మహిళలలకు బోలు ఎముకల వ్యాధితో పాటుగా ఎముక పగుళ్ల ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది. ఏదేమైనా ఆడవాళ్లు ఎముకల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే బోలు ఎముకల వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఇవి మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా. అవేంటంటే.. 

కాల్షియాన్ని ఎక్కువగా తీసుకోవాలి

కాల్షియం ఎముకలను, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే కాల్షియాన్ని ఎక్కువగా తీసుకోవాలి. బాదం, పాలు, పాల ఉత్పత్తులు, కాలే, బ్రోకలీ, సాల్మాన్, సార్డినెస్ చేపలు, టోఫు వంటి సోయా ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. కాకపోతే వీటిని తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించాలి. 

విటమిన్ డి

మన శరీరం కాల్షియాన్ని గ్రహించడానికి విటమిన్ డి చాలా చాలా అవసరం. ఈ విటమిన్ డి ట్రౌట్, సాల్మన్, వైట్ ఫిష్, ఇతర ఫ్యాటీ ఫిస్ లో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు పుట్టగొడుగులు, పాలు, తృణధాన్యాలు, గుడ్లు వంటి బలవర్దకమైన ఆహారాలు కూడా విటమిన్ డికి అద్బుతమైన వనరులు. ఆహారాల ద్వారే కాదు ఈ విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా కూడా అందుతుంది. వైద్యుడిని అడిగి విటమిన్ డి సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. 

వ్యాయామం

వ్యాయమం ఎముక సాంద్రతను కాపాడుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరి ఇందుకోసం ఎలాంటి వ్యాయామం చేయాలో డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి. ఒక వేళ మీకు బోలు ఎముకల వ్యాధి ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే కొత్త వ్యాయామ కార్యకలాపాల్లో పాల్గొనండి. 

అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి

శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వంటి అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. స్మోకింగ్ మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ అలవాటుంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఇది మీ ఎముకలను బలహీనపరుస్తుంది. 

ఆరోగ్యకరమైన బరువు

ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా ఆరోగ్యకరమైన బరువును మెయిన్ టైన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. బరువు తక్కువగా ఉంటే ఆస్టియో పెపనియా, బోలు ఎముకల వ్యాధి  వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇకపోతే ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఎముక పగుళ్లకు కారణమవుతుంది.