మలబద్దకానికి ఎన్నో కారణాలున్నాయి. కారణమేదైనా ఈ సమస్య వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. చిన్న సమస్యే అయినా దీనిని ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొంతమంది మందులను కూడా వాడుతుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో దీనిని నుంచి ఉపశమనం పొందొచ్చు. అదెలాగంటే?
లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, మందులు, నీళ్లను తాగకపోవడం, శారీరక శ్రమ మొత్తమే లేకపోవడం, ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల మలబద్దకం సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను మందులు వేసుకోకుండానే చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. అది కూడా ఇంట్లో నుంచే. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరి జ్యూస్
ఉసిరి విటమిన్ సి కి గొప్ప మూలం. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతుంది. అంతేకాదు మలబద్దకాన్ని కూడా ఇట్టే తగ్గిస్తుంది. ఇందుకోసం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 30 మిల్లీ లీటర్ల ఉసిరి జ్యూస్ ను కలిపి తాగండి. ఈ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అవిసె గింజలు
ఈ చిన్న విత్తనాలు ఏం చేస్తాయని అనుకోకండి. దీనిలో మెగ్నీషియం, ప్రోటీన్లు, పొటాషియం, ఫైబర్ తో పాటుగా ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండెకు సంబంధించిన రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అవిసె గింజల్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను పోగొడుతుంది. ఇందుకోసం ఈ గింజలను గ్రైండ్ చేసి గాలి వెళ్లని డబ్బాలో వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టండి. ఒక గ్లాసు నీటిలో ఈ పౌడర్ కలిపి లేదా కప్పు పెరుగులో ఒక టీ స్పూన్ అవిసె గింజలను వేసుకుని తీసుకోండి. వీటిని సలాడ్లపై జల్లుకుని కూడా తినొచ్చు.
ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్షలు ఫైబర్ కు గొప్ప వనరు. దీనిలో సార్బిటాల్ కూడా ఉంటుంది. ఎండుద్రాక్షలు ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా మలబద్దకంతో బాధపడుతున్న వారికి మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. ఎందుకంటే ఎండుద్రాక్షలు మలబద్దకం సమస్యను చాలా తొందరగా తగ్గిస్తాయి. ఇందుకోసం ఎండుద్రాక్షల ప్యాకెట్ ను ఫ్రిజ్ లో పెట్టండి. రోజుకు రెండు సార్లూ కొన్ని కొన్ని తినండి.
కొబ్బరి నూనె లేదా నెయ్యి
రోజూ ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లేదా నెయ్యి లేదా ఎంసిటీను తీసుకుంటే మీ పేకు కదలికలు మెరుగుపడతాయి. దీంతో మలబద్దకం సమస్య పోతుంది. వీటిలో ఎంసిటీ నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో ఐసోలేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చాలా తొందరగా జీర్ణం అవుతాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిని నీటిలో లేదా సలాడ్ డ్రెస్సింగ్ గా కూడా ఉపయోగించొచ్చు.
డైటరీ ఫైబర్
డైటరీ ఫైబర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాధపడేవారికి ఇది మెడిసిన్ లా పనిచేస్తుంది. నీటిలో కరిగే ఫైబర్ మీ మలం మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక కరగని ఫైబర్ జీర్ణవ్యవస్థ గుండా మలం వేగంగా కదలడానికి సహాయపడుతుంది. కరిగే ఫైబర్స్ బార్లీ, ఓట్స్ బ్రాన్, బీన్స్, విత్తానలు, కాయలు, బఠానీలు, కాయధాన్యాలు, కొన్ని పండ్లు, కూరగాయల్లో ఉంటాయి. ఇక కరగని ఫైబర్స్ తృణధాన్యాలు, బ్రోకలీ, మొలకలు, బచ్చలికూర, గోధుమ రవ్వలో ఉంటాయి. ఫైబర్స్ ఎక్కువగా, ప్రాసెస్ చేసిన ఆహారాలను తక్కువగా తీసుకుంటే మంచిది. ఇవి మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
