Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కి ఏమైంది : హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ ఎందుకు .. తుంటి ఎముక శస్త్రచికిత్స అంటే, దానికి ఖర్చెంత..?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు (కేసీఆర్) హైదరాబాద్ యశోదా ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తుంటి ఎముక ఆపరేషన్ (హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ) పూర్తి చేశారు. 

KCR : what is hip replacement surgery , reasons, recovery time, cost, rehabilitation ksp
Author
First Published Dec 8, 2023, 9:39 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇంకా కోలుకోలేదు. అసలేందుకు ఓడిపోయాం.. ఓడిపోయేంత తప్పు ఏం చేశాం అని కొందరు విశ్లేషించుకుంటుంటే.. మరికొందరేమో కాంగ్రెస్ ప్రభుత్వం ముణ్నాళ్ల ముచ్చేటేనని, ఆ పార్టీకి ఓటేసినందుకు బాధపడతారని జనాన్ని విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బాత్‌రూంలో జారి పడటంతో తీవ్రగాయమై ఆసుపత్రి పాలయ్యారు. ఇది బీఆర్ఎస్ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. తమకు కొండంత అండలాంటి పెద్దాయనకు వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతూ వుండటంతో తమ పార్టీ పరిస్ధితి, తమ పరిస్థితి ఏంటంటూ గుండెలు బాదుకుంటున్నారు. 

గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో కేసీఆర్ కాలుజారి పడిపోయారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పలు పరీక్షలు నిర్వహించి తుంటి ఎముక విరిగినట్లుగా గుర్తించి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్ధితిపై ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్ధితిని పర్యవేక్షించి, మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ యశోదా ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. 

శస్త్ర చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేసిన వైద్యులు కే చంద్రశేఖర్ రావుకు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ (తుంటి ఎముక మార్పిడి) నిర్వహించారు. కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయనకు గాయం కావడంతో అసలు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స అంటే ఏమిటి..? అనే దానిపై నెటిజన్లు ఇంటర్నెట్‌ను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్ధితుల్లో తుంటి మార్పిడి సర్జరీ చేయాల్సి వుంటుంది..? రోగి కోలుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది..? శస్త్ర చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది..? తదితర వివరాలు సమగ్రంగా .

అసలేంటీ తుంటి కీలు :  

మనిషి శరీరంలో కీలకమైన ఎముక ఈ తుంటి కీలు. శరీర బరువును  మోసేది తుంటి కీళ్లే. శరీరం పైభాగం కాళ్లకు అనుసంధానం చేయడంతో పాటు కాళ్లను ఏ వైపు కావాలంటే ఆ వైపునకు కదపవచ్చు. అందుకే ఈ తుంటికీలుకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా జీవితం మంచానికే అంకితం. అనుకోని ప్రమాదాల కారణంగా తుంటి కీలు విరిగితే రక్త ప్రసరణ ఆగిపోవడంతో పాటు కీలు అరుగుదల అనే దశ ప్రారంభమవుతుంది.  

తుంటి కీలు మార్పిడి చికిత్స : 

తుంటి కీలులో ఓ బంతి , సాకెట్ లాంటి నిర్మాణాలు అత్యంత కీలకమైనవి. ఒకప్పుడు తుంటి ఎముక విరిగితే మంచానికే అతుక్కొని పోవాల్సి వచ్చేది. చివరికి కాలకృత్యాలు కూడా తీర్చుకోవడం కష్టమై, బతుకు భారమై.. ఇంకెందుకీ జీవితం అన్నట్లుగా ఎంతోమంది పెద్దలు నరకయాతన అనుభవించారు. మంచంలోనే ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. ఇప్పుడు వైద్య శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందడంతో పలు రకాల సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. తుంటి కీలు విరిగిన వృద్ధులు శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు.. తర్వాత ఎవరిపై ఆధారపడకుండా సాధారణ జీవితం గడపొచ్చు. 

తుంటికీలు మార్పిడి శస్త్ర చికిత్సలో భాగంగా బంతి, సాకెట్లను మార్చడానికి ప్లాస్టిక్ గానీ , మెటల్‌తో చేసిన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అత్యంత అనుభవం, నైపుణ్యం వున్న ఆర్థపెడిక్ సర్జన్లు మాత్రమే ఈ సర్జరీ చేయగలరు. ఇందుకోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. వైద్యుని సలహా మేరకు 4 నుంచి 6 వారాల విశ్రాంతి తీసుకోవాలి. పదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సాధారణ జీవితం గడపొచ్చు. 20 ఏళ్ల తర్వాత అవసరం అనుకుంటే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు. 

అందుబాటులోకి రోబోటిక్ సర్జరీలు :

ఇక ఆర్ధోపెడిక్స్‌లోనూ ప్రస్తుతం అరుదైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మోకాలు, తుంటి కీళ్ల మార్పిడి ఇతర శస్త్రచికిత్సలకు క్యువిస్ జాయింట్ రోబోటిక్ సిస్టమ్ రోబో అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ఈ తరహా సర్జరీలు చేసే సర్జన్లు మూడు మిల్లీమీటర్ల స్థాయిలో వుండే సమస్యను గుర్తించలేరు. ఈ రోబో మాత్రం 1 మిల్లీమీటర్ సమస్యను కూడా గుర్తించగలదని నిపుణులు చెబుతున్నారు. 

తుంటి కీలు సర్జరీకి ఎంత ఖర్చవుతుంది:

తుంటి కీలు సర్జరీకి ఖర్చు కూడా అధికంగానే వుంటుంది.  భారతదేశంలో ప్రస్తుతం హిప్ రీప్లేస్‌మెంటర్ సర్జరీకి రూ.3.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని పలువురు అంటున్నారు. ఆసుపత్రి నిబంధనలు, సర్జన్ ఫీజులు, అనుబంధ చికిత్సలు ఇతరత్రా అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స దుష్ప్రభావాలు :

సాధారణంగా తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నూటికి 95 శాతం సక్సెస్ అవుతుందని వైద్యులు చెబుతున్న మాట. అయితే దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు, నష్టాలు కూడా వున్నాయి. ఇన్ఫెక్షన్, రక్తం గడ్డకట్టడం, హిప్ డిస్‌లోకేషన్, నరాల సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. అయితే ఇవి అందరిలో సంభవించకపోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios