వర్క్ ఫ్రం హోం మనకు మంచి చేసినా.. దీనివల్ల ఎంతో మంది స్ట్రగుల్ అవుతున్నారు. వర్క్ ఫ్రం హోం కోవిడ్ నుంచి మనల్ని సేఫ్ గా ఉంచినా.. మానసికంగా క్రుంగదీస్తుందని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

పని ఒత్తిడి లేదా ఇతర ఒత్తిడి మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల లేని పోని రోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా పనితో వచ్చే 'టెన్షన్' రాత్రిపూట చాలా మంది వ్యక్తులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ పని ఒత్తిడి వల్ల కంటినిండా నిద్రపోయేవారు చాలా తక్కువగానే ఉన్నారట. అవును వర్క్ టెన్షన్ ఉండేవారు రాత్రిళ్లు సరిగ్గా పడుకోరట. 

సాధారణంగా ఏ రకమైన ఒత్తిడి నుంచైనా మొదటగా ప్రభావితమయ్యేది నిద్ర. పని నుంచి వచ్చే 'టెన్షన్' నిద్రను రెండు విధాలుగా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకటి పనిభారం. అంటే పనిలో కష్టపడాలి లేదా పని గంటల తర్వాత కూడా పని చేయాల్సి ఉంటుంది.

కోవిడ్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కు మారడం ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చగా.. మరో వర్గానికి ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే చాలా కంపెనీలు సమయాన్ని పట్టించుకోకుండా కార్మికులను నియమించుకుంటున్నాయి. ఇవన్నీ కార్మికులను మానసికంగా కుంగదీస్తున్నాయి. అలాగే వారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి.

ఇక రెండోది.. పని నుంచి వచ్చే ఒత్తిడి. దీనిలో ఉద్యోగం కోల్పోతామనే అభద్రత ఉంటుంది. ఇది వ్యక్తుల నిద్రను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల ఆందోళన కారణంగా నిద్ర సరిగ్గా పట్టదు. అలాగే ఉలిక్కిపడి నిద్రలో లేస్తారు. దీనివల్ల హార్ట్ రేట్ పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివన్నీ ఇలాంటి సందర్భాల్లోనే జరుగుతాయి.

వయోజనులు రోజుకు ఏడెనిమిది గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు నిద్ర నాణ్యత కూడా ముఖ్యమే. నిద్రలో ఎన్నో దశలు ఉంటాయి. గాఢంగా నిద్రపోతేనే మీ మెదడు 'రిఫ్రెష్' అవుతుంది. జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి. 

కంటినిండా నిద్రపోకపోతే మెమోరీ పవర్ తగ్గిపోతుంది. అలసట, ఒత్తిడి స్థాయిలు పెరిగిపోతాయి. బరువు కూడా విపరీతంగా పెరిగిపోతారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వర్క్ టెన్షన్ తగ్గించుకోండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.