థైరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి మన శరీరానికి అయోడిన్ చాలా చాలా అవసరం. ఈ పోషకం లేకపోవడం వల్ల థైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. ఒక వేళ మీకు అయోడిన్ లోపం ఉంటే దాన్ని ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యంగా జీవించాలంటే మన శరీరానికి పోషకాలు చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అయోడిన్ కూడా మన శరీరానికి ఎంతో అవసరం. మన శరీరాలు సరిగ్గా పనిచేయడానికి అయోడిన్ ఎంతో సహాయపడుతుంది. అందులోనూ ఇది మన థైరాయిడ్ గ్రంథికి కూడా అవసరమైన ఖనిజం. అయోడిన్ లోపం థైరాయిడ్ గ్రంథిపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.
అయోడిన్ లోపం, థైరాయిడ్ మధ్య సంబంధం
అయోడిన్ థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి మన థైరాయిడ్ గ్రంథి ఉపయోగించే ఒక ముఖ్యమైన ఖనిజం. ఈ అయోడిన్ థైరాయిడ్ పెరుగుదలను నియంత్రించడానికి, దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేయడానికి, జీవక్రియను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పనులన్నీ మన శరీరంలో తగిన మొత్తంలో అయోడిన్ స్థాయిలు ఉంటేనే జరుగుతాయి. మీకు తెలుసా అయోడిన్ లోపం ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందిని పట్టిపీడిస్తోందని సర్వేలు వెళ్లడిస్తున్నాయి.
థైరాయిడ్ గ్రంథి అయోడిన్ ను నిల్వ చేస్తుంది. మన శరీరంలోని అన్ని కణాలు థైరాయిడ్ హార్మోన్ల ద్వారా ప్రభావితమవుతాయి. ఆరోగ్యకరమైన కణాల నిర్మాణానికి ఇవి చాలా అవసరం. హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం.. కణాలలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్ల జీవక్రియ థైరాయిడ్ హార్మోన్లతో సంబంధం కలిగి ఉంటాయి.
అయోడిన్ లోపం సంకేతాలు
హైపోథైరాయిడిజం రాకుండా ఉండటానికి.. ముందుగా మీరు అయోడిన్ లోపం సంకేతాలను, లక్షణాలను తెలుసుకోవాలి. అనేక పరిశోధనల ప్రకారం.. అయోడిన్ లోపం లక్షణాలు ఇలా ఉంటాయి.
మెడ ఉబ్బడం
ఊహించని విధంగా బరువు పెరగడం
అలసట
బలహీనత
మలబద్ధకం
జుట్టు రాలడం
జలుబు
హృదయ స్పందన రేటులో మార్పులు
పొడి చర్మం, పొడి జుట్టు
క్రమరహిత లేదా పీరియడ్స్ ఎక్కువ కావడం
విషయాలను గుర్తుంచుకోలేకపోవడం
ప్రెగ్నెన్సీలో సమస్యలు
అయోడిన్ లోపాన్ని పోగొట్టే చిట్కాలు
పలు అధ్యయనాల ప్రకారం.. అయోడిన్ లోపాన్ని పోగొట్టడానికి ఉత్తమ మార్గం సీఫుడ్ వంటి అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం. ఇక ప్రెగ్నెన్సీ సమస్యలను నివారించడానికి గర్భిణీ స్త్రీలు ఎంతమొత్తంలో అయోడిన్ తీసుకుంటున్నారో ట్రాక్ చేయాలని సలహానిస్తున్నారు.
అయోడిన్ ఎక్కువగా జంతు ప్రోటీన్ ఆహారాలలో ఉంటుంది. రొట్టె, తృణధాన్యాలు, పాలు వంటి బలవర్థకమైన ఆహారాల్లో కూడా అయోడిన్ ఉంటుంది. అలాగే చేపలు, జున్ను, పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు, గుడ్లు, గొడ్డు మాంసం, కాలేయం, చికెన్ లో కూడా అయోడిన్ ఉంటుంది.
