సాధారణంగా పీరియడ్స్ టైంలో మొదటి రోజు మాత్రమే విపరీతమైన కడుపు నొప్పి కలుగుతుంది. అయితే కొందరికి మాత్రం రెండో రోజు కూడా నొప్పి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే ఈ కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు. 

పీరియడ్స్ ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ఆడవారికి నెలసరి సమయంలో విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. ఇంకొంతమందికి నొప్పి అంతగా ఏం ఉండదు. ఈ పీరియడ్స్ నొప్పి వల్ల రోజు వారి పనులను కూడా చేయలేరు. ఈ నొప్పితో రెండు రోజులు చిన్న చిన్న పనులను చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అయితే కొన్ని అలవాట్లు ఈ నొప్పిని మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ నొప్పి నుంచి సులువుగా బయటపడొచ్చు. 

పండ్లు, కూరగాయలను తినండి

పండ్లు, కూరగాయల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి పేగులు, జీర్ణవ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు పండ్లు, కూరగాయలు చాలా సులువుగా జీర్ణం అవుతాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. అయితే పీరియడ్స్ నొప్పికి ప్రధాన కారణం ఇన్ఫ్లమేషనే. అందుకే నెలసరి సమయంలో పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినండి. ఇవి మీ గట్ లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. ఇది మీ కడుపు కండరాలను రిలాక్స్ గా ఉంచుతుంది. పీరియడ్స్ సమయంలో ఆకు కూరలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం, క్లోరోఫిల్ ఉన్న ఆకుకూరలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. 

పాలు

పాలను తాగడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. పాలను తాగితే శరీరంలో అనవసరమైన హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల కూడా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. పీరియడ్స్ నొప్పి ఎక్కువ కాకూడదంటే పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 

కెఫిన్

కాఫీని తాగినే నొప్పి తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీ తాగడం వల్ల నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. అంతేకాదు ఒత్తిడి, చికాకు వంటి సమస్యలు కూడా కాఫీ కలిగిస్తుందని నిపుణులు చెబతున్నారు. అందుకే పీరియడ్స్ టైంలో కెఫిన్ ను తాగడం మానుకోండి. 

మూలికలు

అల్లం టీ, దాల్చిన చెక్క వాటర్, రాస్ బెర్రీ ఆకు టీ, చామంతీ టీ, పుదీనా టీ వంటి వాటిని తీసుకోండి. ఎందుకంటే ఈ మూలికల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి పీరయడ్స్ టైంలో కడుపులో మంటను తగ్గిస్తాయి. అలాగే లోపలి కండరాలు రిలాక్స్ అయ్యేందుకు సహాయపడతాయి. అందుకే పీరియడ్స్ సమయంలో ఈ డ్రింక్స్ ను తాగండి. 

ఒత్తిడిని తగ్గించుకోండి

పీరియడ్స్ సమయంలో మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఒత్తిడి లేకుండా రిలాక్స్ గా ఉండాలి. ఇందుకు శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటుగా మీకు ఇష్టమైన పని చేయండి. పాటలు, సినిమాలు వంటి వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇవి మీ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.