క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒక పరిశోధన ప్రకారం.. వారానికి జస్ట్ 150 నిమిషాల వ్యాయామం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని కనుగొన్నారు.
శారీరక శ్రమ మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారు. బాడీ ఫిట్ గా ఉంటుంది. బీపీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అంతేకాదు ఒత్తిడి స్థాయిలు తగ్గడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది రోజూ వ్యాయామం చేయలేకపోతుంటారు. అయితే వారానికి 150 నిమిషాల వ్యాయామం చేస్తే కూడా శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. 150 నిమిషాల చురుకైన నడక ఎన్నో ప్రాణాంతక వ్యాధులను తగ్గిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. అసలు 150 నిమిషాల పాటు మితమైన తీవ్రత వ్యాయామం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్యాటీ లివర్ ను తగ్గిస్తుంది
పలు అధ్యయనాలు 150 నిమిషాల చురుకైన నడక కొవ్వు కాలెయ వ్యాధిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ పనిచేస్తుందని కనుగొన్నాయి. పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో 150 నిమిషాల మితమైన, తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామం కాలెయ కొవ్వును తగ్గిస్తుందని కనుగొన్నారు. అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను కూడా ఇది తగ్గిస్తుందని కనుగొన్నారు.
అధిక రక్తపోటును తగ్గిస్తుంది
వారంలో 150 నిమిషాల వ్యాయామం చేస్తే శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే హార్ట్ రేట్ కూడా నియంత్రణలోకి వస్తుంది. ఈ వ్యాయామం గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. అయినప్పటికీ.. ఒక వ్యక్తి ఎంత సేపు శారీరక శ్రమలో పాల్గొనాలి? ఎలా చేయాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఒత్తిడిని తగ్గిస్తుంది
వారంలో రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి, నిరాశతో వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి అవుట్ డోర్ యాక్టివిటీ లేదా స్పోర్ట్స్ వంటి టీమ్ యాక్టివిటీస్ లో పాల్గొనాలి. శారీరక శ్రమలో శరీరం కదులుతుంటే ఒత్తిడి, చికాకు తగ్గుతుంది. పలు పరిశోధనల ప్రకారం.. వారానికి 150 నిమిషాల వ్యాయామం మరణాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
వారానికి 150 నిమిషాల వ్యాయామం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందా?
చాలా మంది వ్యాయామం అంటేనే భయపడిపోతుంటారు. ఇంకొందరు ఆరోగ్యం బాలేదని వ్యాయామానికి దూరంగా ఉంటారు. అయితే అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటీస్, హెచ్ఐవీ వంటి దీర్ఘాకాలిక సమస్యలున్నవారు, క్యాన్సర్ నుంచి బయటపడేవారు కూడా కనీసం వారానికి 150 నుంచి 300 నిమిషాల మితమైన, తీవ్రత కలిగిన ఏరోబిక్ వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమస్యలున్న వారు ఒకేచోట కూర్చుంటే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది.
వారానికి 150 నిమిషాల వ్యాయామం ఎలా చేయాలి?
వారానికి 5 రోజుల పాటు 30 నిమిషాల మితమైన వ్యాయామం చేయొచ్చు. లేదా వారమంతా సమానంగా చేయొచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 150 నిమిషాల పాటు చురుకైన నడక లేదా సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి మితమైన వ్యాయామం చేయాలి. 18 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు మితమైన-తీవ్రత గల ఏరోబిక్ శారీరక శ్రమను వారానికి 300 నిమిషాల కంటే ఎక్కువ చేయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.
