బీపీ ఎక్కువగా ఉంటేనే ప్రమాదకరమని చాలా మంది అనుకుంటారు. నిజానికి బీపీ ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా డేంజరే. ఈ రెండూ మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.
తక్కువ రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. అయినప్పటికీ.. దీనిని చాలా మంది పట్టించుకోరు. అయితే మనలో చాలా మందికి ఈ సమస్య ఉన్నా.. ఈ సమస్యను మాత్రం గుర్తించరు. దీనిని మైకం, అనారోగ్యంగా భావిస్తారు. కానీ దీన్ని వీలైనంత తొందరగా గుర్తించాలి. ఎందుకంటే తక్కువ రక్తపోటు ఎన్నో అంతర్లీన ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. తక్కువ రక్తపోటుకు కొన్ని సాధారణ కారణాలు, దానిని నయం చేయడానికి కొన్ని చిట్కాలు మీ కోసం..!
తక్కువ రక్తపోటుకు కారణాలు
నిర్జలీకరణం: శరీరంలో తగినన్ని ద్రవాలు లేనప్పుడు రక్త పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల రక్త నాళాల ద్వారా రక్తాన్ని పంప్ చేయడానికి గుండె కష్టపడుతుంది. ఫలితంగా రక్తపోటు బాగా తగ్గుతుంది.
గర్భధారణ: గర్భధారణ సమయంలో రక్తపోటు తగ్గడం సర్వ సాధారణం.
గుండె సమస్యలు: గుండె సమస్యలు శరీరంలో రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తాయి. దీంతో రక్తపోటు బాగా తగ్గుతుంది. గుండె సరిగ్గా పనిచేయకపోతే శరీర అవసరాలను తీర్చడానికి తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోవచ్చు. ఇది రక్తపోటు తగ్గడానికి దారితీస్తుంది.
పోషకాల లోపం: విటమిన్ బి -12, ఇనుము వంటి కొన్ని పోషకాలు తక్కువగా ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. ఇది కూడా తక్కువ రక్తపోటుకు దారితీస్తుంది.
తక్కువ రక్తపోటును నయం చేసే చిట్కాలు
ఉప్పు తీసుకోవడాన్నిన పెంచండి: ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి మితమైన ఉప్పు అవసరం. పండ్లు, కూరగాయల నుంచి పొందిన సహజ ఉప్పుతో పాటు మీ రోజువారీ ఆహారంలో కనీసం ఒక టీస్పూన్ అదనపు ఉప్పును చేర్చాలని నిపుణులు చెబుతున్నారు.
ద్రవాలను ఎక్కువగా తాగాలి: మీ శరీరంలో ద్రవాలను నిల్వ ఉంచడానికి, నిర్జలీకరణాన్ని నివారించడానికి ప్రతిరోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగండి.
కెఫిన్ : కెఫిన్ మీ రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుంది. మీ రక్తపోటు అకస్మత్తుగా తగ్గినప్పుడు ఇది సహాయపడుతుంది.
తులసి : తులసి ఆకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. యూజెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి.
