పట్టణాల్లో ఉండే ఆడవారికే డయాబెటీస్ నుంచి గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!
ఆడవాళ్లు వంటింటికే పరిమితమయ్యే రోజులు ఎప్పుడో పోయాయి. విద్య, ఉద్యోగం అంటూ ప్రతి పనిలో ఆడవారు సత్తా చాటుతున్నారు. బిజీ షెడ్యూల్స్ వల్ల పట్టణాల్లో ఉండే ఆడవారు శారీరక శ్రమలో పాల్గొనడం చాలా తక్కువ. అందుకే గ్రామాల్లో ఉండే ఆడవారితో పోల్చితే పట్టణాల్లో ఉండే ఆడవారికే ఎక్కువ అనారోగ్య సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పలు సర్వేల ప్రకారం.. గ్రామాల్లో ఉండే ఆడవారితో పోలిస్తే పట్టణాల్లో నివసించే మహిళలే ఎక్కువ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఎందుకంటే వీరి శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పట్టణాల్లో ఉండే ఆడవారే అధిక బరువు, ఊబకాయం, స్థూలకాయంతో బాధపడుతున్నారట. పట్టణీకరణతో ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాలు కలిగినప్పటికీ.. తీరిక లేని పనులు,వాతావరణ కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పట్టణాలు నిరుపేదలను, అత్యంత బలహీనమైన వారిని ఎక్కువగా దెబ్బతీస్తుంది. పట్టణాల్లో నివసించే ఆడవారు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను మరువకండి
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మనల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. బ్రేక్ ఫాస్ట్ ను తినే వ్యక్తులు ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, తక్కువ కొవ్వు, కొలెస్ట్రాల్ ను తీసుకుంటారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అలాగే రోజంగా ఎనర్జిటిక్ గా ఉంటారు. తృణధాన్యాలు, రొట్టె, తక్కువ కొవ్వు పాలు, పండ్లు, పెరుగును ఉదయం పూట తీసుకోండి.
రెగ్యులర్ గా వ్యాయామం చేయండి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ బాడీ ఫిట్ గా ఉండటమే కాదు.. నిత్య యవ్వనంగా కూడా ఉంటారు. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి. కండరాలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. యు.ఎస్ లో సంవత్సరానికి 260,000 మరణాలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల సంభవిస్తాయిని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
హైడ్రేట్ గా ఉండండి
మన శరీరంలోని ప్రతి కణానికి, కణజాలానికి, అవయవానికి నీరు చాలా అవసరం. అందుకే మీరు మీ శరీరానికి అవసరమైన నీటిని తప్పకుండా తాగాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనకు రోజుకు ఎనిమిది 8 గ్లాసుల నీరు అవసరం. అయితే ఇది వైద్యపరంగా ఎన్నడూ రుజువు చేయబడలేదు. మీరు ప్రతి 2 నుంచి 4 గంటలకు ఒకసారి మూత్ర విసర్జన చేస్తే వాటర్ ను పుష్కలంగా తాగుతున్నట్టు. మూత్రం లేత రంగులో ఉంటే మంచిది.
కంటి నిండా నిద్ర పోవాలి
మన ఆరోగ్యం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కంటి నిండా నిద్రను ఖచ్చితంగా పోవాలి. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు నరాల నెట్వర్క్ లను రీసెట్ చేసేటప్పుడు, పునరుద్ధరించేటప్పుడు రోజు పని అలసటను పోగొడుతుంది. దీంతోనే మనం నిద్రలేవగానే మళ్లీ రీఫ్రెష్ గా, పూర్తి ఎనర్జిటిక్ గా పనిచేయగలుగుతాం. నిద్ర లేకపోవడం వల్ల మగత, అలసట, ఏకాగ్రత లేకపోవడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు నిద్రలేమి మీ మెదడుపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపిస్తుంది.