మన ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా చాలా అవసరం. మెగ్నీషియం టైప్ 2 డయాబెటీస్ ను నియంత్రించడానికి, అధిక రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మన శరీరానికి మెగ్నీషియం చాలా అవసరమైన పోషకం. మీ శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మెగ్నీషియం కండరాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మెగ్నీషియం చాలా అవసరం. ఒకవేళల మీ శరీరంలో మెగ్నీషియం లోపిస్తే.. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..
- ఎప్పుడూ అలసటగా అనిపించడం ఎన్నో ఆరోగ్య సమస్యలకు సంకేతం. అయితే మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభించకపోయినా కూడా ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది.
- తలనొప్పి, వాంతులు కూడా కొన్ని కొన్ని సార్లు మెగ్నీషియం లోపాన్ని సూచిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మైగ్రేన్ సమస్య మెగ్నీషియం లోపం వల్ల కూడా వస్తుంది.
- మీ శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. ఈ లోపం డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.
- కండరాలు బలంగా ఉండేందుకు, ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా చాలా అవసరం. శరీరంలో మెగ్నీషియం సరిపడా లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అలాగే కాల్సిఫికేషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంటే దీనిలో మీ శరీర కణజాలాలలో కాల్షియం పేరుకుపోతుంది.
- శరీరంలో మెగ్నీషియం పరిమాణం తగ్గడం వల్ల రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
అయితే మీకు పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా ఉంటే శరీరంలో మెగ్నీషియం పరిమాణం తక్కువగా ఉందని మీకు మీరే నిర్ధారించుకోకండి. ఈ లక్షణాలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
మన శరీరానికి కావాల్సిన మెగ్నీషియాన్ని ప్రధానంగా ఆహారాల ద్వారే తీసుకోవాలి. అందుకే మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి. గుమ్మడి గింజలు, అరటిపండ్లు, రెడ్ రైస్, పెరుగు, నువ్వులు, గింజలు, బచ్చలికూర, అవిసె గింజలు, చిక్కుళ్ళు, డార్క్ చాక్లెట్ మొదలైన వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
