మీకు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నా లేకపోయినా వ్యాయామాలను రోజూ చేయాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రతి రోజూ 20 నిమిషాల పాటు  వ్యాయామం చేస్తే మీరు రోగాలతో హాస్పటల్ కు వెళ్లే అవకాశమే ఉండదు.  

వ్యాయామం మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి ఎన్నో రోగాల రిస్క్ ను తగ్గిస్తుంది. ముఖ్యంగా 40 ఏండ్లు దాటిన వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేస్తే మీ శరీరం ఫిట్ గా ఉంటుంది. అంతేకాదు హాస్పటల్ కు వెళ్లే అవకాశం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జస్ట్ రోజూ 20 నిమిషాల వ్యాయామంతో భవిష్యత్తులో ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. 

ప్రతి ఒక్కరూ లైఫ్ లో అనారోగ్యానికి గురికారని ఎవరూ హామీ ఇవ్వరు. కాకపోతే మన లైఫ్ స్టైల్ ను మార్చుకుంటే రోగాలొచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. 

జామా నెట్వర్క్ ఓపెన్ లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనంలో.. 81 నుంచి 42 సంవత్సరాల వయస్సు ఉన్న 78 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ అధ్యయనంలో రోజుకు అదనంగా 20 నిమిషాల వ్యాయామం చేస్తే మీరు రోగాలతో హాస్పటల్ కు వెళ్లే అవకాశం చాలా తగ్గుతుందని కనుగొన్నారు. హాస్పటల్ లో చేరే తక్కువ ప్రమాదం పెరిగిన శారీరక వ్యాయామంతో ముడిపడి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. రోజూ 20 నిమిషాల వ్యాయామం వల్ల పెద్దప్రేగు పాలిప్స్ ప్రమాదం 3.8 శాతం తక్కువగా, డయాబెటిస్ తో హాస్పటల్ లో చేరే అవకాశం 23 శాతం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

డయాబెటిస్, న్యుమోనియా, ఇస్కీమిక్ స్ట్రోక్, పిత్తాశయ వ్యాధి, రక్తహీనత, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (యుటిఐ), పెద్దప్రేగు పాలిప్స్, సిర థ్రోంబోఎంబోలిజం, డైవర్టిక్యులర్ డిసీజ్ వంటి సాధారణ రోగాల బారిన పడే ప్రమాదాన్ని వ్యాయామం తగ్గిస్తుందని కనుగొన్నారు.

వయసు పెరిగే కొద్దీ వ్యాయామం ముఖ్యం

మిమ్మల్ని మీరు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం.. క్రమం తప్పకుండా వ్యాయామం వల్ల కండరాల పెరుగుదల బాగుంటుంది. అలాగే వయస్సు-సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

రోగాలకు దూరంగా ఉండాలంటే ఎంత వ్యాయామం చేయాలి? 

ప్రతి వారం జాగింగ్ లేదా రన్నింగ్ వంటివి కనీసం 150 నిమిషాలైనా చేయాలి. 
వారానికి కనీసం రెండుసార్లు మీ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి.
సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడే వ్యాయామాలను చేయాలి. 

ఆరోగ్యంగా ఉండాలని వెంటనే హార్డ్ వ్యాయామాలను చేయకూడదు. ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాల నడకతో ప్రారంభించండి. ఆ తర్వాత ఈ సమయాన్ని 30 నిమిషాలకు పెంచండి. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ చేయండి. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు వైద్యులను సంప్రదించి వీలైనంత వరకు శారీరకంగా చురుకుగా ఉండాలి. దీర్ఘాయుష్షుతో జీవించాలనుకుంటే వ్యాయామానికి కొంత సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు.