రాత్రి తొందరగా పడుకుని.. ఉదయం తొందరగా నిద్రలేచే అలవాటు చాలా తక్కువ మందికే ఉంటుంది. కానీ ఇలా నిద్రలేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా.. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
మన ఆరోగ్యం మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం తినే ఆహారం, నిద్ర విధానాలు, చేసే పని వంటివి మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. వ్యాయామం లేకుండా, కంటినిండా నిద్ర లేకుండా, రెస్ట్ తీసుకోకుండా ఉంటే మాత్రం ఎన్నో శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ అలవాట్లు సామాజిక జీవితం, మీ పని, సంబంధాలను ప్రభావితం చేస్తాయి.
అందుకే సాధ్యమైనంత వరకు మీ అలవాట్లు బాగుండేలా చూసుకోండి. అయితే చాలా మందికి రాత్రి లేట్ గా పడుకోవడం, ఉదయం లేట్ గా లేచే అలవాట్లు ఉంటాయి. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల బరువు పెరగడం నుంచి బీపీ పెరగడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం తొందరగా నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే..
శక్తివంతంగా ఉంటారు
పొద్దున్నే నిద్రలేచే వారు చురుగ్గా పనిచేయగలుగుతారు. ఈ అలవాటు మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే సమయాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుంది కూడా. దీంతో మీకు అలసట కలిగే అవకాశమే ఉండదు.
ఒత్తిడి తగ్గుతుంది
రాత్రి తొందరగా పడుకోవడం, ఉదయాన్నే నిద్రలేవడాన్ని అలవాటు మీ జీవగడియారం సక్రమంగా పనిచేస్తుంది. ఇది నిద్ర నాణ్యతను బాగా పెంచుతుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాదు ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు. పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ నిద్రనాణ్యత మెరుగుపడితే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది మీ మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుంది.
డిప్రెషన్
ఉదయం నిద్రలేచే అలవాటు మానసిక ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. డిప్రెషన్ లేదా యాంగ్జైటీ ఉన్న వారందరికీ ఈ అలవాటు ఉపశమనం కలిగిస్తుంది. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే మందు మీ జీవనశైలిని మార్చుకోండి.
శారీరకంగా చురుగ్గా ఉంటారు
ఉదయాన్నే నిద్రలేచేవారు శారీరకంగా చురుగ్గా ఉంటారు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఒంట్లో ఎనర్జీ పెరిగే కొద్దీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీకు వ్యాయామం చేసేందుకు చాలా సమయం దొరుకుతుంది.
బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయరు
లేట్ గా నిద్రలేచే అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ ను తినరు. బ్రేక్ ఫాస్ట్ ను తినకపోతే శరీరంలో శక్తి స్థాయిలు తగ్గుతాయి. పోషకాల లోపం ఏర్పడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి బ్రేక్ ఫాస్ట్ ను తింటే ఇలాంటి సమస్యలొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
