చాట్స్, స్మూతీలు, స్వీట్లలో దానిమ్మ పండును ఉపయోగిస్తారు. నిజానికి దానిమ్మ పండు మనల్ని ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆపిల్, అరటి, కివి, బొప్పాయి పండ్లనే ఎక్కువ ఆరోగ్యకరమైనవిగా భావిస్తారు. వీటినే ఎక్కువ కొంటారు. దానిమ్మను తినే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువే. నిజానికి దానిమ్మ పండులో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఈ పండు ఎన్నో రోగాల ముప్పు నుంచి మనల్ని తప్పిస్తుంది. దానిమ్మను తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు మూడు దానిమ్మ పండ్లను తింటే ధమనులకు ప్రమాదం తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అసలు రోజుకు మూడు దానిమ్మలను తింటే ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దానిమ్మలు మెదడు ఆరోగ్యానికి, ధమనులకు, రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ పండ్లు తక్కువ కేలరీలు, కొవ్వును కలిగి ఉంటాయి. కాని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి.
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మొత్తం శరీరాన్నిన ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. ఇది ప్రీ మెచ్యూర్ వృద్ధాప్యానికి దారితీసే ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ నష్టం నుంచి రక్షణ కల్పిస్తాయి. శరీరం నుంచి అదనపు కొవ్వును తొలగించడానికి సహాయపడతాయి.
ఈ పండ్లు రక్తం సన్నబడటానికి కూడా సమర్థవంతంగా పని చేస్తాయి. అలాగే రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అంతేకాదు రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.
దానిమ్మలో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రతిరోజూ జంక్ ఫుడ్ తినే అలవాటున్న వారు రోజుకు ఒక దానిమ్మ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం.. దానిమ్మ సారం ధమనులలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. మంటను, రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు, స్ట్రోక్ కు దారితీసే ధమనులలో ఫలకం ఏర్పడే అథెరోస్క్లెరోసిస్ తో పోరాడటానికి సహాయపడుతుందని కనుగొన్నారు.
