బరువు తగ్గడం నుంచి బాడీని ఫిట్ గా చేయడానికి మీరు గంటలకు గంటలు జిమ్ముల్లో కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మినీ వ్యాయామాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు కాబట్టి.
పనుల వల్ల వ్యాయామం చేయడానికి సమయం లేని వారు చాలా మందే ఉన్నారు. అయితే మీ పనులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా.. మీ శరీరంపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా కూడా వ్యాయామాన్ని చేయొచ్చు. అవేనండీ మినీ వర్కౌట్స్ ను చేయొచ్చు. ఇవి మీరు రోజులో ఎప్పుడైనా చేయగలిగే చిన్న చిన్న వ్యాయామ సెషన్లు. మినీ వర్కౌట్స్ ను కేవలం కొన్ని నిమిషాల పాటు చేసినా ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
ప్రతిరోజూ ఎంత సేపు వ్యాయామం చేయాలి?
యుఎస్ సెంటర్స్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. పెద్దలు ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు మితమైన- తీవ్రమైన ఏరోబిక్ లేదా 75 నిమిషాల తీవ్రమైన ఏరోబిక్ కార్యకలాపాలలోపాల్గొనాలి. అయినప్పటికీ ఇది ప్రతి ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే చిన్నచిన్న సెషన్ల వ్యాయామం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఇవి 5 నుంచి 10 నిమిషాల సెషన్లు. వీటిని ఎప్పుడైనా చేయొచ్చు. వీటిని రోజులో సమయం ఉన్నప్పుడల్లా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే..
బరువు తగ్గుతారు
రోజంతా మీరు చురుగ్గా ఉండటం వల్ల మీరు సులువుగా బరువు తగ్గుతారు. ఈ మినీ వ్యాయామం జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మీరు ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
కండరాల బలాన్ని పెంచుతుంది
మినీ వ్యాయామాలు బరువు తగ్గడానికి, కొవ్వును కరిగించడానికి, జీవక్రియను పెంచడం వంటి ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి బాగా సహాయపడతాయి. అంతేకాదు ఈ మినీ వ్యాయామాలు కండరాలు, బలాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
చురుగ్గా ఉంచుతుంది
వ్యాయామం చేయడానికి మీరెంత సమయాన్ని కేటాయించినా.. ఇది మీ శరీర శక్తిని, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండే మీరు రోజంతా మరింత చురుగ్గా ఉంటారు.
ఒత్తిడి తగ్గుతుంది
మినీ వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఎందుకంటే ఇవి మీ మెదడులో ఎండార్ఫిన్లు, సంతోకరమైన హార్మోన్లను రిలీజ్ చేయడానికి సహాయపడతాయి.
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది
మినీ వ్యాయామాలు బలాన్ని పెంచుతుంది. కండరాలను టోన్ చేస్తుంది. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మినీ వ్యాయామం ఎలా చేయాలి?
ఉదయం 10 నిమిషాల చిన్న వ్యాయామం చేయండి. తర్వాత మధ్యాహ్నం 10 నిమిషాలు వ్యాయామం చేసి.. సాయంత్రం ఇంకో 10 నిమిషాలు వ్యాయామం చేయండి. ఈ సమయాల్లో పుషప్స్, యోగా, ఫాస్ట్ వాకింగ్ వంటి వ్యాయామాలను చేయొచ్చు.
