ఇలా బెడ్ పై వాలిన వెంటనే అలా నిద్రలోకి జారుకుంటారు కొంతమంది. కానీ ఇంకొంతమంది మాత్రం బెడ్ పై పడుకుని నిద్ర రాక అటూ ఇటూ దొర్లినా.. ఏడ అర్థరాత్రో నిద్రలోకి జారుకుంటారు. ఇలా నిద్రపోవడానికి కూడా కష్టపడుతున్నారంటే మీకు ఈ అలవాట్లు ఉన్నట్టే..
మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవాలి. నిద్ర మన శరీరం, మనస్సు విశ్రాంతి తీసుకోవడానికి, అలసట నుంచి తొందరగా బయటపడటానికి ఉపయోగపడుతుంది. కంటినిండా నిద్ర ఉంటేనే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా పనిచేయగలుగుతారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రకోసం ఎంతో కష్టపడుతున్నారు. నిద్రరాక తెల్లవార్లూ ఇబ్బంది పడుతున్నారు. ఇలా నిద్రపట్టకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
ఒత్తిడి, ఆందోళన
ఒత్తిడి, ఆందోళన వల్ల మీ మనస్సు కుదురుగా ఉండదు. వీటివల్ల రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. అందుకే మీ మైండ్ ను రిలాక్స్ చేయడానికి పడుకునే ముందు ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలను చేయండి. ఇవి మీకు హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి.
పేలవమైన నిద్ర అలవాట్లు
లేట్ గా నిద్రలేవడం, పడుకుని టీవీ చూడటం, ఫోన్లను చూడటం ఒక అలవాటైపోయింది. దీనికి తోడు పడుకునే ముందు కెఫిన్ ను తీసుకోవడం వంటి చెడు అలవాట్లు మీ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. వీటి వల్ల కూడా మీకు అస్సలు నిద్రపట్టదు.
అతిగా ఆలోచించడం
అతిగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అతి ఆలోచనలు శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. అందుకే శ్వాసపై దృష్టి పెట్టండి. ఆలోచనలకు బ్రేక్ వేస్తేనే మీరు హాయిగా నిద్రపోతారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు బ్లూ లైట్ ను రిలీజ్ చేస్తాయి. ఇవి మీ శరీర సహజ నిద్ర లయకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించండి.
చప్పుడు
ట్రాఫిక్, గురక వంటి శబ్దాలు కూడా మీకు నిద్రలేకుండా చేస్తాయి. ఇలాంటి శబ్దాన్ని నిరోధించడానికి ఇయర్ప్లగ్లు లేదా శబ్దాన్ని రద్దు చేసే హెడ్ఫోన్లను ఉపయోగించడానికి ప్రయత్నించండి.
పేలవమైన ఆహారం
పేలవమైన ఆహారం మీ నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పడుకోవడానికి ముందు అతిగా, కారంగా లేదా ఆయిలీ ఫుడ్ ను అస్సలు తినకండి. ఎందుకంటే ఇవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
వ్యాయామం లేకపోవడం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా రాత్రిళ్లు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారు. అందుకే ప్రతిరోజూ మీరు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామాన్ని చేయడానికి ప్రయత్నించండి.
అనారోగ్య సమస్యలు
స్లీప్ అప్నియా, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా నిద్ర పట్టకుండా చేస్తాయి. ఒకవేళ మీకు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నట్టు అనిపిస్తే హాస్పటల్ కు వెళ్లి చెక్ చేయించుకోండి.
