శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పేరుకుపోతే గుండెపోటుతో సహా ఎన్నో ప్రాణాంతక రోగాలొచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆరోగ్యకరమైన జీవన శైలి మార్పులతో కొలెస్ట్రాల్ స్థాయిలను ఇట్టే తగ్గించుకోవచ్చు.
మన శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇంకొంత మనం తినే ఆహారాల నుంచి శరీరంలోకి చేరుతుంది. ఆహార జీర్ణక్రియకు సహాయపడే హార్మోన్లు, విటమిన్ డి, రసాయనాలను ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి కొలెస్ట్రాల్ చాలా చాలా అవసరం. అయితే మన శరీరం అవసరమైన కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మన రక్తంలో లిపోప్రొటీన్లు గా ఉంటుంది. కానీ అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే కొన్ని మందులు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. కొన్ని జీవనశైలి మార్పులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
హార్ట్ హెల్తీ ఫుడ్స్ ను తినండి
సంతృప్త కొవ్వులను తగ్గించండి: రెడ్ మీట్, కొవ్వు పాల ఉత్పత్తుల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ను కూడా తగ్గించాలి. ఇవి కుకీలలో ఎక్కువగా ఉంటాయి.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు 2 ఆవు నెయ్యి, సాల్మన్ చేపలు, వాల్ నట్స్, అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి.
కరిగే ఫైబర్ ను పెంచండి: కరిగే ఫైబర్స్ మన రక్త ప్రవాహంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి.
వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. బరువు కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా వ్యాయామం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే వీలైనంత ఎక్కువగా శారీరక శ్రమను చేయండి. శారీరక శ్రమ అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది.
ధూమపానం
స్మోకింగ్ సర్వ రోగాలకు దారితీస్తుంది. దీనివల్ల ఎంతోమంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. నిజానికి ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తుంది. స్మోకింగ్ ను మానేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు ఇది మానేయడం వల్ల మంచి కొలస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయట. ఇది ధమనులను రక్షించడానికి కూడా సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన శరీర బరువు
అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం వల్ల ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. 5% నుంచి 10% వరకు బరువు తగ్గడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా తగ్గుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఆల్కహాల్
ఆల్కహాల్ ను లిమిట్ లో తాగితే కొంత వరకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకొన్ని ఆల్కహాల్ ను కొద్దిగా తాగినా ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నాయి. ఏదేమైనా ఆల్కహాల్ ను మోతాదులోనే తాగాలి. 65 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు రోజుకు ఒక గ్లాస్ ఆల్కహాల్ కంటే ఎక్కువ, 65, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులకు రోజుకు రెండు గ్లాస్ ల కంటే ఎక్కువ ఆల్కహాల్ ను తాగకూడదు. మితిమీరిన ఆల్కహాల్ ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.