స్ట్రాబెర్రీ నుంచి ఉసిరి జ్యూస్ వరకు.. ఇవి మీ శరీరంలో ఐరన్ లోపాన్ని పోగొడుతాయి..
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల మీ శరీరంలో ఐరన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దీంతో రక్తహీనత, అలసట వంటి సమస్యలు దూరమవుతాయి.

విటమిన్ సి ఒక ముఖ్యమైన పోషకం. ఇది మన శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ పోషకం మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇనుము శోషణకు సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాగా మన శరీరంలో విటమిన్ సి తగినంతగా లేకపోతే ఇనుము లోపంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇనుము లోపం రక్తహీనత, అలసట, బలహీనత, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇనుము లోపాన్ని ఎదుర్కోవటానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరెంజ్ జ్యూస్
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఇనుము శోషణను పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలతో ఒక గ్లాసు నారింజ రసం తాగడం వల్ల ఇనుము శోషణ రేటు బాగా పెరుగుతుంది. ఒక కప్పు నారింజ రసంలో సుమారుగా 124 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది.
నిమ్మకాయ నీరు
నిమ్మకాయ సిట్రస్ పండు. ఇది కూడా విటమిన్ సి కి అద్బుతమైన మూలం. ఈ పండు సహజ ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది శరీరం ఇనుమును మరింత సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఐరన్ లెవల్స్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.
ఉసిరికాయ జ్యూస్
ఉసిరి రసం కూడా విటమిన్ సి కి మంచి వనరు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇనుము శోషణకు సహాయపడుతుంది. ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలువబడే ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. ఇనుము లోపం పోతుంది.
పైనాపిల్ జ్యూస్
పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇనుము శోషణను మెరుగుపరుస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటుగా ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో ఐరన్ లెవల్స్ బాగా పెరుగుతాయి. ఒంట్లో రక్తం పెరుగుతుంది.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండు ఇనుము శోషణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోజూ గుప్పెడు స్ట్రాబెర్రీలను తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది. అలసట తగ్గిపోతుంది.