Asianet News TeluguAsianet News Telugu

కరోనాను దూరం పెట్టాలంటే.... నిపుణుడి సలహాలు ఇవే...

కరోనా వైరస్ ను దూరం పెట్టాలంటే ప్రథమంగా కావాల్సింది అవగాహన అని డాక్టర్ రామారావు అంటున్నారు. కరోనాకు దూరంగా ఉండడానికి ఏయే జాగ్రత్తలు పాటించాలో ఆయన సూచించారు.

Dr Valluri Rama Rao gives suggestions to keep away from Coronavirus
Author
Hyderabad, First Published Aug 29, 2020, 10:49 AM IST

రచయిత: డా. వల్లూరి రామారావు 

మన దేశంలో ‘కోవిడ్ 19’ తర్వాత క్రమంగా పరిస్థితులు మెరుగయ్యాయి. అయితే, ప్రజారోగ్య వ్యవస్థ మనవద్ద ఇంకా బలోపేతం కావాల్సి వుంది. అయితే, సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న ఇమ్మ్యూనిటీ బూస్టర్ల ప్రచారం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతూ పలు అపశ్రుతులకు కారణం అవుతున్నది.  వైరస్ దూకుడు గురించి నిజానికి ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వైరస్ నిర్ధారణ చేసే RT-PCR పరీక్షలు మొదటి నుంచి కూడా ఇ.ఎన్.టి. స్పెషలిస్టులు చేసి ఉంటే  బాగుండేది. ఇతరులు ఆ పరీక్షలు చేయడం వలన కొన్ని చోట్ల ఫలితాల్లో తేడాలు వచ్చాయి. కొరోనా ప్రాణనష్ట నివారణకు చెప్పే ప్రాధమిక సూత్రాలతో పాటుగా ఇప్పుడు ప్రాణ రక్షణకు చేసే ప్రత్యామ్నాయాలపై వైద్యులు, అధికార యంత్రాంగం  దృష్టి సారించింది. రోగ నిరోధక శక్తితో వైరస్ నుంచి రక్షణ పొందవచ్చా? ఈ ప్రశ్నకు జవాబుగా సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా ప్రచారమౌతున్న వ్యాపార ప్రకటనలు, ప్రజలను మరింత అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే మ్యాజిక్ మాత్ర నిజంగానే ఏదైనా ఉందా? అయితే, పోషక ఆహారం - రోగ నిరోధక శక్తి రెండు ముడిపడి ఉన్నవని  చాలాకాలంగా మనవద్ద ప్రచారంలో ఉంది. 

ఆర్ధిక స్థోమతు ఉన్నవారిలో 75 శాతం మంది పెద్దలు ముందస్తు జాగ్రత్త కోసం రోజూ ఏవో కొన్ని మల్టీ విటమిన్ మాత్రలు తీసుకుంటూ ఉంటారు. మరిప్పుడు వాటితో ఈ కోవిడ్ 19 దాడి సమయంలో రక్షణ పొందవచ్చా? ఇందుకు జవాబు - క్రమంగా పోషకాహారం తీసుకునేవారు వయోవృద్దులు, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ ఇన్ఫెక్షన్ ను ఎదుర్కోలేరనే అనుమానం ఉంది. అయితే, ఇవి గుండె జబ్బులకు, క్యాన్సర్, జ్ఞాపక శక్తి తగ్గిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధి నివారణకు మల్టీ విటమిన్ వాడడం వలన పెద్దగా ఉపయోగం లేదు. నిజానికి సమతుల ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన బరువు, ఉప్పు, చక్కర వాడకం తగ్గించడం, ఆరోగ్యకరమైన కొవ్వు (ట్రాన్స్ ఫ్యాట్) ఉపయోగించడం, వ్యాయామం ఇందుకు సరైన మార్గం. శరీరంలోకి ప్రవేశించే ఏ క్రిమియైనా, బాక్టీరియా, పరాన్నజీవి, వీటిని ఎదుర్కొనే పోలీస్ వ్యవస్థగా తెల్లరక్త కణాల్లో ఉండే న్యూట్రోఫిల్సు, లింఫోసైట్లు, పని చేస్తాయి. ప్రజలలో 70 నుంచి 90 శాతం మంది వ్యాధి బారిన పడినపుడు, హాని కలగడానికి ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో ఉండే రక్షణను ‘మంద నిరోధక శక్తి’ (Herd immunity) అంటారు. ప్లీహము (Spleen) ఎముక మజ్జ (Bone marrow) వల్ల ‘హెర్డ్ ఇమ్మ్యూనిటీ’ పెరుగుతుంది. 

తమ ఆహార ఉత్పత్తులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, అనేక కంపెనీలు వ్యాపార ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే, ముంబై మురికి వాడలలో 57 శాతం మందిలో సరిపడినన్ని‘యాంటీ బాడీస్’ ఉన్నాయి. శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఎలా అనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. ‘న్యూట్రాస్యూటికల్’ లేదా ఆహార అనుబంధ పదార్ధాలు లేదా ‘డైటరీ సప్లిమెంట్లు’ రోగ నిరోధకశక్తి పెంచవని, అవి అశాస్త్రీయమైనవని    కౌన్సిల్ ఆఫ్ సైన్టిఫిక్ రీసెర్చి ఇమ్మ్యూనిటీ నిపుణులు డా. రామ్ విశ్వకర్మ అంటున్నారు. 
రోగనిరోధక శక్తిని పెంచే అసలైన మార్గాలు - సమతుల ఆహారం, వ్యాయామం, ఒత్తిడి తగ్గించే యోగాభ్యాసం, కనీసం 7 గంటల నిద్ర. విటమిన్ సి, విటమిన్ బి 12, విటమిన్ సి, జింక్ వంటివి అవసరం. కొరోనా పై వైద్యులు ఎక్కువగా దృష్టి సారించిన మందులు - విటమిన్ డి  3, విటమిన్ సి, విటమిన్ బి 12, జింక్. 

రాయవెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజి ఇమ్మ్యునాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ దేబాశిష్ దండా రాయ్  ఇలా అంటున్నారు “అసలు ఇమ్మ్యూనిటీని పెంచడం అనేది ఆహ్వానించదగినది కాదని, వైరస్ నివారణకు, ఇమ్మ్యూనిటీ పెంచడానికి ఎటువంటి  సంబంధం లేదని, ఆయుర్వేద ఔషధాలు ఇమ్మ్యూనిటీ పెంచుతాయని చెప్పడానికి ఎటువంటి అధ్యయనాలు లేవని, ఆయన అంటున్నారు. నిజమే, వాటిని అల్లోపతీ మందుల మాదిరి ముందుగా జంతువులలో, ఆ తరువాత మనుషులలో మూడు దశలలో ప్రయోగించి వాటి పని తీరును నిర్ధారించే అవకాశాలు లేవు. కొన్ని ఆయుర్వేద మందుల్లో లోహాలు (Metals ) స్టిరాయిడ్ పెద్ద పరిమాణంలో కల్తీ వలన మెదడు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయని నిరూపించబడింది. ఇమ్మ్యూనిటీ బూస్టర్లు ప్రయోజనం నిజమని నమ్మిన కేసుల్లో రోగనిరోధక వ్యవస్థ విఫలమై ‘సైటోకైన్ స్టారం’ తో మరణాలు సంభవిస్తున్నాయి. 

కరువు సందర్భాలలో విటమిన్ సి, జింకు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటి ఆహార అలవాట్లలో జింక్, విటమిన్ సి లోపం అరుదైనది అని అలబామా యూనివర్సిటీ నుంచి సుశీల్ కె నూతి  చెప్తున్నారు. కంపెనీల ప్రచారం కాకుండా నిపుణుల సూచనలతో ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. కొరోనా కొద్ధి శాతం మందిలోనే ప్రమాదకరం, 95 శాతం మందికి  ఆసుపత్రుల అవసరం లేదు. మార్కెట్లో రూ.2000 దొరికే ‘పల్స్ ఆక్సీమీటర్’ తో మనం ఇంటిలోనే వ్యాధి తీవ్రత ‘చెక్’ చేసుకోవచ్చు. ఆక్సిజన్ 93 శాతం లోపల ఉంటేనే ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం కలుగుతుంది.

‘కరోనా’ వైరస్ కాల క్రమంలో రూపం మార్చుకుని ముందుగ గుర్తించిన లక్షణాలు కనిపించకుండా కూడా మనకు సంక్రమించి తిరిగి నిష్క్రమిస్తున్న దశలో ఇందుకోసం వైద్యులు వాడమని చెబుతున్న మందులు గురించిన సంక్షిప్త సమాచారం క్రింద ఇస్తున్నాను. 

విటమిన్ సి : ఇది అందరికి తెలిసినదే, జలుబుకు ఉపయోగపడుతుందన్న అపోహ ప్రజలలో చాలా కాలంగా ఉన్నది. ఐతే ఇది జలుబు తీవ్రతను స్వల్ప స్థాయిలో మాత్రమే తగ్గించగలదని  బ్రిటిష్ జర్నళ్ళు  చెప్తున్నవి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా ఆక్సిజన్ రాడికల్సు నుంచి రక్షించే గుణం కలిగి ఉన్నది. అవి రక్తనాళాలపై చూపే చెడు ప్రభావం నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది శరీరంలో జరిగే జీవ క్రియలో ఎంజైమ్ లకు కో ఫాక్టర్ గా పని చేస్తుందని రూఢి అయింది . శ్వాస కోశ వ్యాధుల తీవ్రతను, వ్యవధిని తగ్గిస్తుందని తేలింది. ఇది ఆహారంలో ఆరంజి, జామ, కివి పండ్లలో ఎక్కువగా ఉంటుంది. దీని పళ్ళ రసంలాగా కాకుండా పండుగానే తీసుకోవడం మంచిది. కాయగూరలలో క్యాలీ ఫ్లవర్, పుదీనా, క్యాప్సికంలను కూడా తీసుకోవచ్చును. తరాలుగా వంటకాలలో వాడే కొన్ని ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నవి వాటిల్లో అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, తృణ ధాన్యాలు, చిక్కుళ్ళు, పసుపు, పచ్చని ఆకుకూరలు, ఇంద్రధనుస్సులోని అన్ని రంగుల ఆకుకూరలు ఆరోగ్యకర జీవనానికి శ్రేష్టమైనవి. విటమిన్ బి కాంప్లెక్సు గింజలు, వెజిటబుల్ ఆయిల్స్ లో లభిస్తుంది . దాల్చిన చెక్క మధుమేహ నియంత్రణకు సహాయపడుతుందని అధ్యయనాలు తేల్చాయి. అన్ని పోషకాలున్న ఆహారాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

విటమిన్ డి : సూర్యరశ్మి తగిలినప్పుడు శరీరాన్ని కప్పి ఉంచే చర్మంలో రసాయన చర్య ద్వారా విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. వసంత కాలం, శీతాకాలం చివర్లో రక్తంలో విటమిన్ డి స్థాయి తగ్గవచ్చు. అనేక క్లినికల్ ట్రయల్సు, అధ్యయనాల ప్రకారం శ్వాస కోశ వ్యాధుల నియంత్రణకు విటమిన్ డి సహాయపడుతుంది. ఇది 2009 లో వచ్చిన పాండెమిక్ ఫ్లూ లో (H 1 N 1) నిరూపించబడింది. ఈ విటమిన్ అన్ని వయసుల వారికి ప్రయోజనకారి. తరచుగా వృద్ధులు సహాయ సూక్ష్మ పోషక పదార్ధాల లోపం కలిగి ఉంటారు. అటువంటి వారికి విటమిన్ డి సహాయపడుతుంది. మన దేశం ఉష్ణ దేశం(Tropical) అయి ఉండి చాలినంతగా సూర్యరశ్మి లభించినా, మన దేశవాసులలో విటమిన్ డి సంతృప్తికరమైన స్థాయిలలో ఉండటం లేదు. దాదాపు 55 శాతం మంది విటమిన్ డి3 లోపంతో ఉన్నారు.  రోజూ మధ్యాహ్నం 12 - 2 గంటల మధ్య కనీసం ఒక గంట ఎండలో గడపాలి. ఈ విటమిన్ సాచెట్ల రూపంలోనూ, మాత్రల రూపంలోనూ దొరుకుతాయి. 60,000 యూనిట్లు విటమిన్ డి 3 ఉండే సాచెట్ ను వారానికి ఒక్క సారి వేసుకుంటే విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. 2,000 యూనిట్ల మాత్ర రోజు వారీగా వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. మాంసాహారులైతే ‘కాడ్ లివర్ ఆయిల్’, కొవ్వు చేప, బీఫ్ లివర్, శాకాహారులైతే పాలు, పుట్టగొడుగులు, ఆరెంజ్, ఫోర్టిఫైడ్ పాలు, వీటిలో విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి మారిన జీవన శైలి కొనితెచ్చిన ‘రియాక్టివ్ ఆక్సిజెన్ స్పీసీస్’ (ROS) ‘ఆక్సిజన్ ఫ్రీ రాడికల్’ దుష్పరిణామాలనుంచి రక్షిస్తుంది.  

జింకు: ఇది మన శరీరం తయారు చేసుకోలేని లోహ ధాతువు. చర్మం యొక్క సమగ్రతకు, రోగనిరోధక వ్యవస్థలో పాల్గొనే నయోట్రోఫిల్స్ మరియు కిల్లర్ కణాల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహిస్తూ రోగనిరోధక శక్తికి ఇది తోడ్పడుతుంది. ‘కోవిద్ 19’ వలన వచ్చే జలుబు కోసం జింకును గురించిన వందలాది అధ్యయనాలు ఉన్నాయి. 

హార్డ్ ఇమ్యునిటీ : అనగా మంద నిరోధక శక్తి. ఇది రెండు విధాలుగా వస్తుంది, మొదటిది ప్రజలు ఒకే సారి పెద్ద సంఖ్యలో వ్యాధిగ్రస్తులు అయినప్పుడు, రెండవది వ్యాక్సిన్ల ద్వారా. ఉదాహరణ: పోలియో, ఆటలమ్మ, గవద బిళ్ళలు.

కరోనా కాలంలో చాలామంది ఇతర వ్యాధులతో బాధ పడేవారు ఉంటారు మధుమేహ రోగులు, కచ్చితమైన మోతాదులోనే అయినా పాలిష్ చేసిన అన్నం తీసుకోకూడదు. ఇది ఇన్స్యులిన్ ప్రతికూల ప్రభావం చూపించి ఇన్ఫెక్షన్లు పెంచే అవకాశం ఉన్నది. వీటిలో రాగి జావ , కంది పప్పు, పెసరపప్పు చేర్చుకోవడం మంచిది. 

మాంసాహారంలో చికెన్, లీన్ మాంసం, పాలు, గుడ్లు, కొవ్వు చేపలు తీసుకుని ఇతర వైద్య సలహాలు యధావిధిగా అనుసరించాలి. 
నిద్ర : అతినిద్ర మంచిది కాదు. నిద్రలేమి కూడా ప్రమాదం. నిద్ర అనేది రోజూ రాత్రి 6-7 గంటలు ఆరోగ్యానికి మంచిది. నిద్రా భంగమయ్యే రోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి 11 గంటల లోపు నిద్రకు ఉపక్రమించి ఉదయానే పెందలకడ లేస్తే,  కొన్ని రసాయన చర్యల వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. 

స్నేహ బంధం: పది మందిలో కాలం గడపగలిగిన వారికి మంచిని పంచుకునే వారికి, దీర్ఘ కాలిక వ్యాధులకు స్నేహబంధం ఒక వ్యాక్సిన్ లాంటిది. గణాంకాలు చూసి భయపడకుండా ప్రణాళికా బద్ధంగా నియమాలు పాటించడం అవసరం. కోవిడ్  సమసిపోయినా, ఈర్ష్యా ద్వేషాలు, హింస పెరిగే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. 

రచయిత: చీఫ్ మెడికల్ ఆఫీసర్ (రిటైర్డ్)
సెంట్రల్ హెల్త్ సర్వీస్ 

Follow Us:
Download App:
  • android
  • ios