ఒకప్పుడు రాత్రి ఏడు గంటలకే కుటుంబంలోని అందరూ భోజనం చేసి.. పడుకోవడానికి రెడీ అయిపోయేవారు. కానీ ఇప్పుడు..ఆఫీసుల నుంచి ఇంటికి బయలు దేరే సరికే రాత్రి ఏ తొమ్మిదో, పదో అవుతుంది. ఇక భోజనానికి మరో గంట. అసలు అర్థరాత్రి 11, 12గంటలకు భోజనం చేయం ఒక ఫ్యాషన్ లా తయారైంది. దీనికితోడు.. ఏ సమయంలోనైనా నగరాల్లో సులభంగా ఫుడ్ దొరికేస్తోంది. దీంతో.. అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా.. సమయం పాడు లేకుండా ఏది పడితే అది తినేస్తున్నారు.

ఇలా రాత్రివేళలలో తినడం చాలా మందికి సరదాగానే ఉండొచ్చు. కానీ.. చాలా సమస్యలకు దారితీస్తుందనే విషయం కూడా గుర్తించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్లే వద్దన్నా పొట్ట ముందుకు తన్నుకుంటూ వస్తుంది.. తగ్గుదామన్నా తగ్గలేకుండా బరువు పెరిగిపోతుంటాం.

నిజానికి మానవ శరీరం కూడా పగలు తిని తిరగడానికి, రాత్రి పూట విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా సృష్టించబడింది. దీనికి విరుద్దంగా ప్రవర్తించి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఏ జంతువులకూ మనకు వచ్చినన్ని రోగాలు రావడం లేదంటే దానికి కారణం అవి ప్రకృతి నియమాన్ని అతిక్రమించడం లేదు.

పగలంతా తిని రాత్రి 12 గంటల పాటు తినకుండా ఉంటే ఆ సమయంలో శరీరం క్లీనింగ్‌, రిపేర్‌ అనే రెండు పనులను పూర్తి చేసుకుంటుంది. ఇలా ఏరోజుకారోజు పూర్తి చేస్తే శరీరాన్ని ఆరోగ్యం వరిస్తుంది. నాగరికత పేరుతో మనం పొట్టలో ఆహారాన్ని 20 గంటల పాటు ఉంచుతున్నాం. మిగిలిన ఆ నాలుగు గంటల సమయంలో శరీరం ఎలా శుభ్రం చేసుకోగలదు. 

రోజు రోజుకి అలా మిగిలిన వ్యర్థపదార్థాలు శరీరంలో పేరుకుపోయి రోగపదార్థాలుగా రూపాంతరం చెంది రకరకాల టాక్సిన్స్‌ను, సూక్ష్మక్రిములను విషపదార్థాలను విడుదల చేస్తుంటాయి. చెత్తనుంచి ఎప్పుడూ చెడు తప్ప మంచి పుట్టదు. అంతేకాకుండా చెడుకి త్వరగా అభివృద్ధి అయ్యే గుణముంటుంది. ఇలా ప్రతిరోజు మనం చేసే తప్పుల వల్ల శరీరంలోనే 90 శాతంకు పైగా హానికలిగించేవి పుడుతున్నాయి. 

ఈ ప్రకృతిలో అన్ని జీవులకంటే తక్కువ రోగనిరోధక శక్తి కలవాడు ఒక్కమానవుడే. కనీసం ఏది తిన్నప్పటికీ పగలే తింటే, ఆ దోషాన్ని శరీరంలో మిగలకుండా రాత్రివేళల్లో శుభ్రం చేసుకుని మనల్ని రక్షిస్తుంది. పొద్దుపోయి తినే ప్రతీ ముద్ద మనకు శక్తి నివ్వడానికి బదులుగా మనలో శక్తిని హరించి వేస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే పెందలాడే భోజన కార్యక్రమాలు ముగించుకుని పొట్టకు విశ్రాంతినివ్వాల్సిందే.