ప్రపంచ వ్యాప్తంగా ఏటేటా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నిజానికి ఈ డయాబెటీస్ వల్ల గుండె జబ్బుల నుంచి మానసిక అనారోగ్య సమస్యల వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తాయి.  

భారతదేశాన్ని ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా పిలుస్తారు. ఎందుకంటే దేశంలో సుమారు 80 మిలియన్ల మంది ఈ జీవక్రియ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య 2045 నాటికి 135 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. 2019 నుంచి డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య 16 % పెరిగిందని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడిఎఫ్) తన తాజా నివేదికలో వెల్లడించింది.

భారతదేశంలో 40 మిలియన్ల మంది పెద్దలకు బలహీనమైన గ్లూకోజ్ టాలరెన్స్ (ఐజిటి) ఉందని ఐడిఎఫ్ నివేదిక పేర్కొంది. అంటే వీరికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే ఇది రెండవ అత్యధిక సంఖ్య. ఇంకా మన దేశంలో డయాబెటీస్ ఉన్న సగం మందికి రోగ నిర్ధారణ చేయలేదు. అయితే డయాబెటిస్ ను గుర్తించకపోయినా, చికిత్స తీసుకోకపోయినా ఇది గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, అంధత్వం వంటి తీవ్రమైన, ప్రాణాంతక రోగాలను కలిగిస్తుంది. ఇవి జీవన నాణ్యతను తగ్గిస్తాయి. అసలు డయాబెటీస్ ఉన్నవారికి ఎలాంటి రోగాలొచ్చే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

హృదయనాళ ప్రమాదం

డయాబెటిస్ గుండెను రిస్క్ లో పడేస్తుంది. రక్తంలో ఎక్కువ చక్కెర రక్త ప్రవాహానికి సహాయపడే రక్త నాళాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది గుండెను నియంత్రించే రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. డయాబెటిస్ తో పాటు రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా గుండె ప్రమాదాన్ని పెంచుతాయి.

మూత్రపిండాల వ్యాధి

ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే మీరు మూత్రపిండాల వ్యాధుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అయితే చాలా మంది మూత్రపిండాల వ్యాధుల సంకేతాలను అస్సలు పట్టించుకోరు. దీనివల్లే వ్యాధి ముదిరి ప్రాణాలమీదికి వస్తుంది. మూత్రపిండాల వ్యాధి సాధారణంగా డయాబెటిస్ పేషెంట్లకు ఎక్కువగా వస్తుంది. 

నరాల నష్టం

డయాబెటిస్ డయాబెటిక్ న్యూరోపతి అని పిలిచే సమస్యకు దారితీస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల నరాలు దెబ్బతింటాయి. దెబ్బతినడం వల్ల ఈ నరాలు శరీర భాగాలకు సంకేతాలను పంపడం ఆపివేస్తాయి. దీంతో శరీర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. డయాబెటిక్ న్యూరోపతి అత్యంత సాధారణ ప్రభావాలలో రెటినోపతి ఒకటి .

డిప్రెషన్

డయాబెటిస్, డిప్రెషన్ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయి. అయితే డయాబెటిస్ శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనికి ఒత్తిడి, ఆందోళనలు తోడైతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. 

నోటి ఆరోగ్యం

డయాబెటిస్ నోటి నుంచి లాలాజల స్రావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల నోరు తరచుగా పొడిబారుతుంది. ఇది నోటి సూక్ష్మక్రిములకు సంతానోత్పత్తి కేంద్రంగా మారుతుంది. డయాబెటిస్ కారణంగా చిగుళ్ళు ఎర్రబడి తరచుగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. డయాబెటిస్ కారణంగా నోట్లో పుండ్లు నయం కావడానికి చాలా టైం పడుతుంది. 

లైంగిక సమస్యలు

నరాలు, రక్తనాళాలు దెబ్బతినడం వల్ల లైంగిక అవయవాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది స్పర్శ కోల్పోవడం లేదా ప్రేరేపించడానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీ, పురుషులిద్దరిలోనూ సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది.