పచ్చి పనస పండు టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ జాక్ ఫ్రూట్ లో ఉండే పదార్థాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా నిరోధిస్తాయి.  

మన ఇళ్లలో విరివిగా దొరికే పండ్లలో జాక్ ఫ్రూట్ ఒకటి. పచ్చి పనసతో ఎన్నో రకాల వంటకాలు తయారుచేసుకుని తినేవారు చాలా మందే ఉన్నారు. ఈ పండులో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జాక్ ఫ్రూట్ లో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

టైప్-2 డయాబెటిస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రీన్ జాక్ ఫ్రూట్ టైప్ 2 డయాబెటీస్ తో పోరాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ జాక్ ఫ్రూట్ లో ఉండే పదార్థాలు బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా నివారిస్తాయి. అసలు ఈ పండును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తపోటు తగ్గుతుంది

అధిక రక్తపోటు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అయితే ఈ రక్తపోటును నియంత్రించడానికి గ్రీన్ జాక్ ఫ్రూట్ తినడం కూడా మంచిదంటున్నారు నిపుణులు. జాక్ ఫ్రూట్ లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు గ్రీన్ జాక్ ఫ్రూట్ ను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం మంచిది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

జాక్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. జాక్ ఫ్రూట్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందడానికి ఇది మంచి వనరు. 

క్యాన్సర్, గుండె జబ్బులు దూరం

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే జాక్ ఫ్రూట్ క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఎన్నో వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పనసను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఎన్నో ప్రమాదకరమైన రోగాల ముప్పు తప్పుతుంది.

జీర్ణ సమస్యలు మాయం

జీర్ణ సమస్యలకు కూడా పనస పండు ఉపయోగపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవును పనస పండును తింటే మలబద్ధకం లేదా ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఈ పండు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు పూతల నివారించడానికి సహాయపడుతుంది. అలా అని జాక్ ఫ్రూట్ ను ఎక్కువగా తినకూడదు. 

ఎముకల ఆరోగ్యం

ఎముకలు, కండరాలకు అవసరమైన మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలకు గొప్ప మూలం పనస పండు. జాక్ ఫ్రూట్ ను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.