Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ ఎఫెక్ట్: పిల్లల్లో విపరీత ధోరణులు... ఇలా చేసి చూడండి

దాదాపు ఏడాదిన్నరగా స్కూళ్లు లేక నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న బుజ్జాయిలు.. తల్లిదండ్రుల కొత్త ఆంక్షలతో మానసికంగా కృంగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒత్తిడి ఎదుర్కోలేక పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి

covid effect On behavioral changes in kids ksp
Author
New Delhi, First Published May 14, 2021, 4:54 PM IST

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందకు ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి.

అయినప్పటికీ కోవిడ్ కంట్రోల్ కావడం లేదు. ఇప్పటికే సెకండ్‌ వేవ్‌తో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో థర్డ్‌వేవ్‌ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఫస్ట్‌ వేవ్‌లో మధ్య వయస్కులు, సెకండ్‌ వేవ్‌లో యువకులు.. థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం విషయంలో కఠినంగా వుంటున్నారు. 

దాదాపు ఏడాదిన్నరగా స్కూళ్లు లేక నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న బుజ్జాయిలు.. తల్లిదండ్రుల కొత్త ఆంక్షలతో మానసికంగా కృంగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒత్తిడి ఎదుర్కోలేక పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వారిలో మానసిక రుగ్మతలైన దుందుడుకు స్వభావం, అహింస పెరుగుతున్నాయి.

కొంతమంది చిన్నపిల్లలు తమ విషయంలో తల్లిదండ్రులు సైకాలజిస్టులను సంప్రదించటానికి కూడా ఒప్పుకోవటం లేదు. ప్రతీ చిన్న విషయానికి తీవ్రంగా స్పందించటం మొదలుపెడుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఒకరకంగా తల్లిదండ్రులకు గడ్డుకాలమంటున్నారు మానసిక నిపుణులు.

తమ పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ తల్లిదండ్రులు సైకాలజిస్టుల వద్దకు వెళ్లడం పెరిగిపోయింది. అయితే ఈ సమస్యను లోతుగా అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెబుతున్నారు.

పిల్లలు ఎక్కువగా ఆన్‌లైన్‌ క్లాసులతోనో.. టీవీ చూస్తూనో గడుపుతున్నారని.. వీటి ప్రభావం వారిపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల తల్లిదండ్రులు వీలైనంత సమయం వారితో గడపటానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఇంట్లోనే క్యారమ్స్‌, చెస్‌ వంటి ఇండోర్‌ గేమ్స్‌ ఆడించడంతో పాటు వారితో మనసువిప్పి మాట్లాడాలని చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios