గుండె జబ్బుల నియంత్రణలో – వంట నూనెల పాత్ర మన దేశంలో ‘ఇండియన్ డయాబ్’ పేరుతో జరిపిన ఒక అధ్యయనంలో ‘లిపిడ్’ (క్రొవ్వులు) రకాలలో విపరీతమైన వైవిధ్యం కనిపించింది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ‘మెటబోలిక్ సిండ్రోం’ మొదలైన జబ్బులతో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది. మనం పశ్చిమ దేశాల ఆహారపు అలవాట్లను అనుసరించడం వల్ల, అది మన ఆరోగ్యం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. మనం తీసుకునే క్రొవ్వు పదార్ధాలు సరైన పాళ్ళలో తీసుకోకపోవడమే కాకుండా, శారీరక శ్రమ లేకపోవడం, జీవన శైలిలో మార్పులు వల్ల ఈ ‘లైఫ్ స్టైల్’ వ్యాధులకు ఎక్కువ మంది గురి అవుతున్నారు.

 

 

ఈ మధ్య వంటనూనెలపై సామాజిక మాధ్యమాలలో వస్తున్న అపోహల విషయంలో కూడా మనకు స్పష్టత అవసరం వుంది. పైన పేర్కొన్న అధ్యయనంలో కొందరిలో చెడు కోలేస్ట్రోల్ అధికంగా, ‘ట్రైగ్లిజరైడ్’ అనే క్రొవ్వు చాలా మంది మధుమేహ రోగులలో ఆందోళనకరంగా ఉన్నట్టుగా పరీక్షల్లో వెల్లడి అయింది. గుండెకు అండగా ఉండే మంచి కొలెస్ట్రాల్ చాలా తక్కువ స్థాయిలోఉండడం, మరీ ఆందోళన కలిగిస్తోంది. దీనిపై దృష్టి పెట్టిన వైద్యరంగం, గుండె జబ్బులను నియంత్రించే మంత్రం – మనం తినదగిన వంట నూనెలు అనే దిశలో అధ్యయనం మొదలుపెట్టింది.

ఎటువంటి వంట నూనె ఇందుకు పరిష్కారం అని పరీక్షలు చేసినప్పుడు, తినదగినది ఏదో ఒక్క నూనె మాత్రమే కాదు, వేర్వేరు నూనెలలో పలు రకాల పోషకాలు ఉన్నట్టుగా గమనించారు, మనం తీసుకునే క్రొవ్వు వంటనూనెల ద్వారా లభించేదే కాకుండా, మనకు తెలియకుండానే రోజువారి ఆహారంలోచపాతీ, అన్నం, బిస్కెట్లు, పాలు మొదలైన పదార్ధాల నుంచి కూడా 20 నుంచి 30 గ్రాముల వరకు క్రొవ్వు లభిస్తున్నాయని తెలిసింది. ఇది మన ఆహారంలో ‘ఇన్విజిబుల్ ఫాట్’ అంటే అదృశ్య క్రొవ్వు పదార్ధమన్నమాట. అదే వంట నూనెల వాడకం లెక్కకు వస్తే, రోజుకు 30 గ్రాముల క్రొవ్వు తీసుకుంటున్నాము. మనిషికి రోజుకు 2000 కిలో కాలరీల శక్తి కావలిసినపుడు, మొత్తంగా 60 గ్రాముల క్రొవ్వు వివిధ రూపాలలో మనం తీసుకుంటున్నాము.

 

 

అయితే ఈ క్రొవ్వు ఏరకంగా మనం తీసుకున్నప్పటికీ, అవసరం మించిన పరిమాణంలో తీసుకుంటే కొన్ని రకాలైన గుండె జబ్బులకి అది కారణమౌతుంది. కొన్ని సమయాలలో క్రొవ్వు తక్కువైనా కొన్ని రకాల జబ్బులు వెంటాడుతాయి. విడిగా (లూజుగా) అమ్మే నూనెల పైన మన దేశంలో ఆంక్షలు వున్నాయి. అవి మంచివి కావని తేలడం వల్లనూ, కొందరు జంతువుల క్రొవ్వు నుండి నూనెలు తీసి కల్తీ చేసి డబ్బులు చేసుకోవడం వల్లను ఈ చర్య తీసుకున్నారు. కల్తీ విషయానికి వస్తే పాలు, పెరుగు వంటి అన్ని పదార్ధాలలోనూ కల్తీ జరుగుతున్నది. 

మనం వంటలలో వాడే అన్ని నూనెలలోను వెజిటబుల్ అంటే గింజలు నుంచి నూనె తయారు చేస్తున్నారు. వీటి తయారీలొ శాస్త్రీయ పద్ధతులు అవలంబిస్తున్నారా లేదా అనే విషయంలో నిరంతర నిఘా అవసరం. ఇక రిఫైండ్ నూనెలు మంచివే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిషత్ చెప్తూ కొన్ని సూచనలు, నిబంధనలు అందజేస్తున్నారు. అంతర్జాతీయంగా ‘కోడెక్స్’ సంస్థ, మన దేశంలో FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ ఆఫ్ ఇండియా) ఈ వంట నూనెల తయారీ, పాకింగ్, నాణ్యత వంటి ప్రామాణికాలను పర్యవేక్షిస్తున్నది.

వివిధ నూనెలలో క్రొవ్వు ఆమ్లాలు సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు : కొబ్బరి నూనె, వెన్న, నెయ్యి, వనస్పతి, వీటిలో సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వేరుసెనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్ లలో ‘మోనో సాచురేటెడ్’ క్రొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. బహుళ సంతృప్త క్రొవ్వుగా చెప్పబడే ఒమేగా (PUFA) కుసుమ, పొద్దు తిరుగుడు, పత్తివిత్తనము, సోయాబీన్ మొక్కజొన్న నూనెలలో ఉన్నాయి. పామోలిన్, వేరుసెనగ, రైస్ బ్రాన్ నూనె, నువ్వుల నూనె మొదలగు
వాటిలో ... ఒమేగా (PUFA) స్థాయి నుండి తక్కువ స్థాయి వరకు ఉంటాయి. అందువలన ఏ ఒక్క నూనెలో మూడు రకాల క్రొవ్వుఆమ్లాలు కావాలి. ఏనూనె లోను క్రొవ్వు ఆమ్లాలు సరైన నిష్పత్తిలో లేవు. నూనెలు ఇతర ఆరోగ్యకర ప్రయోజన కరమైన ఫైటోకెమికల్స్ కలిగి ఉంటాయి. నువ్వుల నూనెలో ‘లిగ్ననన్స్’ మరియు ‘సెసామోల్స్’ ఉన్నవి. ఎర్ర పామాయిల్ లొ ‘బీటాకేరోటీన్స్’ ఇతర ‘కెరటనాయిడ్స్’ రైస్ బ్రాన్ ఆయిల్ లొ ‘ఒరిజినాల్’ ఉంటుంది.

 

 

సంత్రప్త క్రొవ్వును ఎక్కువగా తీసుకుంటే మొత్తం సీరం కొలెస్ట్రాల్, LDL లాంటి హానికర కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉన్నది. ఇన్స్యులిన్ నిరోధకత, రక్తం గడ్డ కట్టే సమస్య కలిగిస్తుంది. హృద్రోగాలకు, రక్తనాళాల సమస్యలకు దారి తీస్తుంది. ఏదో ఒక రకానికి పరిమితం కాకుండా, వివిధ రకాలైన నూనెలు తీసుకోవడం ద్వారానే నూనెల విషయంలో మనం ఆరోగ్యకర ఎంపికను సాధించవచ్చు. వేరుసెనగనూనె, లేదా నువ్వులు లేదా రైస్ బ్రాన్ ఆయిల్, ఆవ నూనెను ఒక ఎంపికగా నేషనల్ న్యూట్రిషన్ సంస్థ సిఫారసు చేస్తున్నది. ఏది ఏమైనా ‘సాచురేటెడ్ ఫ్యాట్’, ‘పాలీ అన్ సాచురేటెడ్’ ‘పుఫా’ మరియు ‘మోనో సాచురేటెడ్ ఫ్యాట్’ వంటి భిన్నశ్రేణుల (MUSA) మిశ్రమం యొక్క ప్రయోజనాలను మనం అర్ధం చేసుకోవాలి. ఈ మధ్య మిశ్రమ నూనెలు వాడకం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ మిశ్రమ కూరగాయల నూనె రైస్ బ్రాన్ 70% నూనె, కుసుమ నూనె 30% నిష్పత్తిలో లభిస్తుంది. 

ఆలివ్ ఆయిల్ వాడకం పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా వాడుకలో ఉన్నది ఆలివ్ ఆయిల్. అయితే హృద్రోగ నిపుణుల వివరణ కారణంగా మన దేశంలో ఇది ప్రాచుర్యం కాలేదు. దీనిలో ఒమేగా, 6 మెగా, 6 ఒమేగా, 3 క్రొవ్వు ఆమ్లాలు సరైన నిష్పత్తిలో లేకపోవడం, మనం వంటనూనెలు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద తయారు చెయ్యడం వలన దీని వాడకం ఇక్కడ ప్రాచుర్యం లోకి రాలేదు. కొబ్బరి నూనె : కేరళ రాష్ట్రంలో అధికంగా వాడకంలో ఉన్నది. ఇది చర్మ వ్యాధులకు, మరి కొన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు మంచిదని నిరూపణ అయింది. అయితే దీనిలో మీడియం చెయిన్ ఫ్యాట్ ఆమ్లాలు బరువు తగ్గడానికి ఉపయోగం ఉండదనే వాదనలు ఉన్నవి. దీనిలో 95% సంత్రుప్త క్రొవ్వు ఆమ్లాలు ఉన్నవని, అందుచేత గుండె వ్యాధుల వారి వాడకం పై అనుమానాలు ఉన్నాయి. అయితే చర్మ వ్యాధులకు సంతృప్త క్రొవ్వు తక్కువ మోతాదులో వాడవచ్చని కొందరి అభిప్రాయం. 

 

 

అయితే అనేక వ్యాపార ప్రకటనలలో అమెరికా వంటి దేశాలలో దీన్ని ప్రోత్సహించడం ఆలోచించవలసిన విషయం. మన దేశంలో అధిక ఉష్ణోగ్రతలో వంట నూనెల వాడకం వలన విటమిన్ E, బీటా కేరొటీన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్ల పై చెడు ప్రభావం వలన హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. తక్కువ ఆరోగ్యకరమైన క్రొవ్వు ఏమిటి ? సంతృప్త క్రొవ్వు : ఎర్ర మాంసం, ముదురు కోడి మాంసం, పాల ఉత్పత్తులైన వెన్న, జున్ను, ఐస్ క్రీం మొదలైనవి. ఉష్ణ మండల నూనెలైన కొబ్బరి నూనె, పామాయిల్ లలో అధికం. ఏది ఏమైనా సంతృప్త క్రొవ్వు ఉత్తమ ఎంపిక కాదు. ఆహారంలో సంతృప్తక్రొవ్వు ‘పాలీ అన్ సాచురేతేడ్’ క్రొవ్వుతో భర్తీ చేయడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ‘హైద్రోజేనేటెడ్’ కూరగాయల నూనెలు ఉన్న ఆహారాలలో ‘ట్రాన్స్ ఫ్యాట్లు’ ఉంటాయి. వేయించిన కొన్ని ఆహార పదార్ధాలు ఉదా: ‘ఫ్రెంచ్ ఫ్రై’, ‘డోనట్లు’, ‘డీప్ ఫ్రై ఫుడ్స్’, కాలిన ‘కుకీలు’, ప్రాసెస్ చేసిన చిరుతిళ్ళు, మైక్రోవేవ్ ‘పాప కారన్’ ఇవన్నీ అనారోగ్య కారకాలే ! ఇవన్నీ సంతృప్త క్రొవ్వు మాదిరిగానే LDL అనే క్రొవ్వును పెంచుతాయి. ‘ట్రాన్స్ ఫ్యాట్లు’ గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం లాంటి అనారోగ్యాలు కొనితెస్తాయి. మంచి క్రొవ్వు ఉన్న ఆహారం MUFA (మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్), PUFA (పాలీ అన్ సాచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్స్) ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రొవ్వులు కూరగాయల నుంచి తీసిన నూనెలు దీనికి ఉదాహరణ.

ఆవ నూనె ఆరోగ్యకరమైన వంట నూనెగా గుర్తించబడిన నూనె ఇది. దీనిలో సంతృప్త క్రొవ్వు తక్కువగాను, ముఫా, పూఫా ఎక్కువగాను ఉన్నాయి. దీనిలో ఒమేగా 6, ఒమేగా 3 నిష్పత్తి 6:5 గా ఉంటుంది. ఇది నాన్ రిఫైండ్కోల్డ్ కంప్రెస్’ రూపంలో కూడా దొరుకుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా నిలకడగా ఉంటుంది. పొద్దుతిరుగుడు నూనెతో పోలిస్తే ఆవ నూనె వాడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం 71శాతం తగ్గినట్లు అధ్యయనాలు చెప్తున్నవి. గుండె సంబంధిత ఇతర రుగ్మతలకు కూడా ఇది మంచిది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు (NIN) ఆహారంలో అన్ని రకాల క్రొవ్వు ఆమ్లాలు సరైన కలయిక 2 లేదా 3 రకాల నూనెల మిశ్రమం మంచిదని సూచించింది . ఈ మిశ్రమాల తయారీ మొదట జపాన్ లొ, తరువాత ఆస్ట్రేలియా లొ మొదలై, మన దేశం లొ ఈ మధ్యకాలంలో రెండు నూనెల మిశ్రమ తయారీ ప్రాచుర్యం లోనికి వచ్చింది. దీనికి 2020 జనవరిలో మూడు నూనెల మిశ్రమ తయారీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇండియాలో లభిస్తున్న రెండు నూనెల మిశ్రమం (రైస్ బ్రాన్ ఆయిల్ కుసుమ నూనె) 70:30 నిష్పత్తిలో దొరుకుతుంది.

 

 

ఆరోగ్యకర జీవనానికి సమతుల ఆహారం శారీరక వ్యాయామం, ఏడుగంటల నిద్ర ఆహారంలో క్రొవ్వు శాతం, క్యాలరీలు తగ్గించుకుని, జీవన శైలి వ్యాధులను అరికట్టవచ్చు అనే ‘ప్యూర్ అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా మూడు రకాల క్రొవ్వు ఆమ్లాలు సరైన పరిమాణంలో ఉండే రెండు రకాల కూరగాయల నూనెల మిశ్రమం ప్రాముఖ్యత సంతరించుకున్నది జీవన శైలి వ్యాధులు, ముఖ్యంగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం మొదలైన అన్ని రుగ్మతలకు ఆహారంలో శాస్త్రీయ మార్పులు చేసుకోవాలి. మద్యం, పొగాకు వీటికి దూరంగా ఉండడం, చక్కర, ఉప్పు స్థాయిని తగ్గించుకోవడం, ఒత్తిడి తట్టుకోవడానికి యోగ వ్యాయామం , మంచిగాలి, శుభ్రమైన నీరు, సరిపడినంత నిద్ర అసలైన మంత్రం.

 

 

 

 

 

డా. వల్లూరి రామారావు
చీఫ్ మెడికల్ ఆఫీసర్ (రిటైర్డ్)
భారత ప్రభుత్వ హెల్త్ సర్వీస్, చెన్నై
9490877471