క్యాన్సర్ ను నివారించడానికి ఖచ్చితమైన మార్గమేమీ లేదు. కానీ క్యాన్సర్ ప్రమాదన్ని తగ్గించడానికి కొన్ని జీవన శైలి మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్లే ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. క్యాన్సర్ కు ఎన్నో కారణాలున్నాయి. చిన్న పిల్లలు, పెద్దలు అంటూ తేడా లేకుండా ఈ రోగం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. అయితే మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్నితగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులు క్యాన్సర్ ప్రమాదాన్నే కాదు డయాబెటీస్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏయే మార్పులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆహారం
మనం ఏం తింటున్నామో కూడా ముఖ్యం. అవును కొన్ని ఆహారాలు క్యాన్సర్ కు దారితీస్తాయి. ఇంకొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఇలాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండండి.
బరువు నియంత్రణ
ఊబకాయం, అధిక బరువు గుండెపోటు నుంచి రక్తపోటు, క్యాన్సర్ వంటి ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే వయసుకు తగ్గ బరువును మెయింటైన్ చేయండి. నూనులు, కార్భ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను, తీపి పదార్థాలు మీరు బరువు పెరిగేలా చేస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మంచి పోషకాహారం లిమిట్ లో తింటే బరువు పెరిగే అవకాశం ఉండదు.
వ్యాయమం
వ్యాయామం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. శరీరం చురుగ్గా ఉంటే ఎన్నో రకాల క్యాన్సర్ల ప్రమాదం తప్పుతుంది. అందుకే ప్రతిరోజూ 30-45 నిమిషాలు ఖచ్చితంగా నడవండి. నడక మిమ్మల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆల్కహాల్
ఆల్కహాల్ కూడా ఎన్నో రోగాలకు దారితీస్తుంది. దీనిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మితిమీరి దీన్ని తాగితే బరువు పెరుగుతారు. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వస్తాయి. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల రొమ్ము, కొలొరెక్టల్, కాలేయ క్యాన్సర్ తో సహా ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. ఎంత తక్కువ ఆల్కహాల్ తాగితే మీ ఆరోగ్యానికి అంత మంచిది.
పొగాకు
పొగాకుతో ప్రయోజనాలు అసలే లేవు. నిజానికి ఈ రోజుల్లో చాలా మంది దీనికి బానిసలుగా మారిపోయారు. కానీ పొగాకు, స్మోకింగ్ ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. క్యాన్సర్ ప్రమాదాల్ని పెంచుతుంది. అందుకే ధూమపానం, పొగాకు ఉన్న ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉండండి.
విశ్రాంతి
అలసిన శరీరానికి తగిన విశ్రాంతి చాలా అవసరం. కంటినిండా నిద్రపోతేనే ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు రీఫ్రెష్ గా ఉంటుంది. విశ్రాంతి మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
