పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం మన ఎముకలను బలంగా ఉంచుతాయి. బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షిస్తాయి. కానీ కొంతమందికి పాల అలెర్జీ ఉంటుంది. దీనివల్ల వీరు పాలను గానీ, పాల ఉత్పత్తులను గానీ తీసుకోరు. అయితే ఒక్క పాల ఉత్పత్తుల్లోనే కాదు వేరే ఆహారాల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వాటిని తిన్నా సరిపోతుంది.
కాల్షియం ఒక్క మనుషులకే కాదు ఈ భూమ్మీదున్న ప్రతి జీవికీ అవసరమే. ఎందుకంటే ఈ పోషకమే ఎముకలను బలంగా ఉంచుతుంది. దంతాలను నిర్మిస్తుంది. అంతేకాదు ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. ఒక వేళ మీ శరీరంలో కాల్షియం లోపిస్తే బోలు ఎముకల వ్యాధి, హైపోగ్లైసీమియాతో పాటుగా ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం ఉంది. అయితే కాల్షియం పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉంటుంది. కానీ కొంతమందికి పాలతో పాటుగా పాల ఉత్పత్తుల అలెర్జీ ఉంటుంది. దీనివల్ల వీరు పాలను గానీ, పాల ఉత్పత్తులను గానీ తీసుకోరు. దీనివల్ల వీరి శరీరంలో కాల్షియం లోపించే ప్రమాదం ఉంది.
మన శరీరానికి కాల్షియం ఎందుకు అవసరం?
మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో ఉండే కాల్షియంలో 99 శాతం ఎముకలు, దంతాలలోనే ఉంటుంది. ఇది ఎముకల అభివృద్ధికి, పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అవసరం.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆఫీస్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్ డేటా ప్రకారం.. పెద్దలు ప్రతిరోజూ కనీసం వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియాన్నైనా తీసుకోవాలి. అయితే వయస్సు, లింగాన్ని బట్టి దీనిలో కొద్దిగా మార్పు ఉండొచ్చు. అయితే పురుషుల కంటే మహిళలకే ఎక్కువ కాల్షియం అవసరమని నిపుణులు చెబుతున్నారు. పాలను తాగని వారు కాల్షియం కోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలంటే..
గింజలు
గింజల్లో కూడా పుష్కంగా ఉంటుంది. ముఖ్యంగా బాదం పప్పులను తింటే మీ శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. ఒక కప్పు బాదంలో 385 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందని అనేక మెడికల్ జర్నల్స్ చెబుతున్నాయి. బాదంలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. బాదంలో మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉంటాయి.
ఆకుకూరలు
కాల్షియానికి మరొక గొప్ప వనరు పాలకూర, కాలే, బచ్చలి కూర వంటి ఆకుకూరలు. ఆకుకూరలను తింటే మీ శరీరానికి 21 శాతం కాల్షియం అందుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాల్షియం మాత్రమే కాదు ఇనుము, ఫోలేట్ లు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి.
అత్తి పండ్లు
అత్తి పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం లు పుష్కలంగా ఉంటాయి. అత్తి పండ్లలో 70 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో పొటాషియం, విటమిన్ కె లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సూక్ష్మపోషకాలు చాలా అవసరం.
బీన్స్, కాయధాన్యాలు
బీన్స్, కాయధాన్యాల కూడా పోషకాల బాంఢాగారం. వీటిలో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, పొటాషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.
విత్తనాలు
విత్తనాలు కాల్షియానికి మంచి వనరులు. నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 100 గ్రాముల నువ్వులను తీసుకుంటే మీ శరీరాకి ఒక రోజుకు కావాల్సిన అవసరాలలో 97 శాతం అందుతుంది. నువ్వుల్లో మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, జింక్, సెలీనియం కూడా ఉంటాయి. కాల్షియం అధికంగా ఉండే ఇతర విత్తనాలలో గసగసాలు, సెలెరీ, చియా విత్తనాలు ఉన్నాయి.
