అమరావతి: రాజధాని పేరు చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని తన అవినీతికి కేంద్రంగా మార్చుకున్నాడని వైఎస్ఆర్‌సిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. చంద్రబాబు మాత్రమే కాకుండా ఆయన అనుయాయులు అమరావతి ప్రాంతంలో చేసిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను ఇప్పటికే ప్రజల ముందు పెట్టామని అన్నారు. మీడియా ద్వారా సర్వే నెంబర్లతో సహా చంద్రబాబు, టిడిపి నేతలు కొనుగోలు చేసిన భూముల వివరాలను బహిర్గతం చేశామని అన్నారు. రేపటి నుంచి ఏ సర్వే నెంబర్ లో తెలుగుదేశం నాయకులు, వారి బినామీలతో ఎంత భూమిని కొనుగోలు చేశారో పూర్తి వివరాలను మీడియా ద్వారా ప్రజలకు వెల్లడిస్తామని అన్నారు. 

అమరావతి ప్రాంతంలో 4,070 ఎకరాల భూమిని ఇన్ సైడర్ ద్వారా కొనుగోలు చేశారని, తక్షణం ఈ భారీ భూదందాపై న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ అక్రమాలపై కేంద్రప్రభుత్వం సీబిఐ ద్వారా విచారణ జరపాలని కోరారు. 

అమరావతిలో అమాయక రైతులను చంద్రబాబు నిలువునా దగా చేశాడని కరణం దర్మశ్రీ విమర్శించారు. ఈ ప్రాంత రైతులకు మేలు చేస్తానని వారిని మోసం చేశాడని అన్నారు. చంద్రబాబు ఆయన అనుయాయుల ఇన్ సైడర్ ట్రేడింగ్ ను మా ప్రభుత్వం బయట పెట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ ను గమనించాలని కోరారు. 

రైతులకు చెందిన భూములను తన సన్నిహితులు, అనుయాయులకు, తన సొంత కోటరీకి చంద్రబాబు దారాదత్తం చేశాడని అన్నారు. టిడిపి నేతలు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, ధూళిపాళ, పయ్యావుల తదితరుల భూదందాను డాక్యుమెంట్ ఆధారాలతో సహా బయట పెట్టామని అన్నారు. ఈ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని అన్నారు. 

read more  చంద్రబాబు పాపాలే అమరావతికి శాపాలు: ఉండవల్లి శ్రీదేవి

రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారిక రహస్యాలను కాపాడతానన్న చంద్రబాబు, తాను సీఎంగా వుండి అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని విమర్శించారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానించేలా చంద్రబాబు వ్యవహరించారని అన్నారు. నలబై ఏళ్ల రాజకీయం అంటూ అధికారంలో వున్నప్పుడు ఒకలా... ఇప్పుడు మరొకలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన చేస్తున్న నాటకాలను ప్రజల ముందు నిలబెడుతున్నామని అన్నారు. 

ఇప్పటికే చంద్రబాబును యూటర్న్ పితామహుడు అని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు వుండటం వల్ల అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్థి జరుగుతాయని తెలిసి కూడా చంద్రబాబు ఇటువంటి తప్పుడు పోరాటాలను ప్రోత్సహిస్తున్నాడని ధర్మశ్రీ విమర్శించారు. చంద్రబాబు నైజంను గమనించిన ప్రజలు గత ఎన్నికల్లో ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేశారని అన్నారు. ఆ బాధతో మళ్ళీ తన రాజకీయ జీవితానికి పునాదిగా రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నాడని విమర్శించారు. 

ఈ ప్రాంత ప్రజల అమాయకత్వంను తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడని విమర్శించారు. ఈ ప్రాంత వాసులు దీనిని గమనించాలని కోరారు. ప్రతిపక్ష నేతగా  వైఎస్ జగన్ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారని అన్నారు. ఆనాడు సీబిఐ విచారణ వద్దని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గమనించాలని కోరారు. మొత్తం రాష్ట్రం అభివృద్ది చెందాలని జగన్ కోరుతున్నారని, కానీ ఒక ప్రాంతానికి మాత్రమే న్యాయం జరగాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. 

రాజకీయ లబ్ది, కుతంత్రాలు, కుళ్ళుతో చంద్రబాబు చేసిన భూదందాను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అమరావతికి రాజధాని రాకముందు వేలాది ఎకరాల భూములు ఎవరి చేతుల్లో వున్నాయి...ఇప్పుడు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయో... ఏ విధంగా 4,070 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీలో ప్రకటించారని అన్నారు. రాజకీయ బినామీలతో వేలాది ఎకరాలను ఎలా కాజేశారో రేపటి నుంచి ప్రజల ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. 

read more  అమరావతి నిరసనల సెగ... ఏపి అసెంబ్లీకి జగన్ చేరుకునే దారిదే

అధికార రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేసిన చంద్రబాబు ఈ రకంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడటం ద్వారా రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచారని అన్నారు. తన మామకు వెన్నుపోటు పొడిచినట్లు రాజ్యాంగానికి కూడా చంద్రబాబు తూట్లు పొడిచాడని విమర్శించారు. 

పైకి అమరావతి అంటూ తన అవినీతిని... తన భూదందాను కాపాడుకునేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తన కుటుంబసభ్యులకు చెందిన హెరిటేజ్‌ సంస్థకు ఏకంగా 14 ఎకరాలకు పైగా కేవలం ఎకరం పదిలక్షలకే కొనుగోలు చేసిన వైనం వెనుక ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదా అని ప్రశ్నించారు. 

790 మంది తెల్లరేషన్ కార్డు దారులను అడ్డం పెట్టుకుని భూదందా చేశాడని ఆరోపించారు. అమరావతిలో ఎందుకు శాశ్వత సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలను నిర్మించలేదని ప్రశ్నించారు. అధికారం వుందని ఆనాడు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన చంద్రబాబు అక్రమాలపై కేంద్రప్రభుత్వం, న్యాయస్థానాలు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో పాల్గొన్న టిడిపి నేతలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రకమైన వారు రాజకీయాల్లో వుండే అర్హత లేదని అన్నారు. తాము చేసిన అక్రమాలపై వారంతా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా వుండి తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కు సుమారు పద్నాలుగు ఎకరాలకు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. ఆనాడు భూదందాకు పాల్పడటం... నేడు అదే అమరావతి పేరుతో జోలిపట్టి చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

చంద్రబాబు చేస్తున్న ఈ అరాచకాలకు చట్టప్రకారం శిక్ష పడకతప్పదని అన్నారు. తన నల్లధనంను వైట్ మనీగా మార్చుకునేందుకు బినామీలను ముందుకు తీసుకువచ్చి తక్కువ రేట్లకే భూములను కొనుగోలు చేసిన వైనంను బయటపెడుతున్నామని అన్నారు. తెలుగుదేశం నాయకులు యనమల, దేవినేని, పత్తిపాటి, ఆంజనేయులు తదితరులు, వారి బినామీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. 

ఇన్  సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే కనీసం రెండేళ్ల పాటు శిక్ష వుంటుందని, చంద్రబాబు, ఆయన గ్యాంగ్ జరిపిన ఈ భూదందాపై ఎన్నేళ్లు జైలుశిక్ష విధించాలో న్యాయస్థానాలు ఆలోచించాలని అన్నారు. ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ గా చెబుతున్న విశాఖపట్నంలో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడైనా భూములు కొనుగోలు చేసినట్లు నిరూపించగలరా అని సవాల్ చేశారు. చంద్రబాబు లాగా ఎక్కడా మా పార్టీ నేతలు ఆ ప్రాంతంలో భూదందాకు పాల్పడలేదని స్పష్టం చేశారు.  

రాజధాని ప్రాంత రైతులకు చంద్రబాబు ఆనాడు రంగుల కలలు చూపించారని అన్నారు. అమరావతిని స్వర్గథామంలా మారుస్తున్నట్లు గ్రాఫిక్స్ చూపించారని అన్నారు. రైతులను అడ్డం పట్టుకుని చంద్రబాబు చేసిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై రైతులు ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పదమూడు జిల్లాలు అభివృద్థి చెందాలమని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే అభివృద్ది చెందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

చంద్రబాబు చేసిన అక్రమాలపై ఈ ప్రాంత ప్రజలు కళ్లు తెరిచి... చంద్రబాబు అవినీతిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైపవర్ కమిటీ కూడా అమరావతి ప్రాంత రైతుల పట్ల సానుకూల వైఖరితో వుందని అన్నారు. ఈ ప్రాంతానికి ఎక్కడా అన్యాయం జరగకూడదని కోరుకుంటోందని అన్నారు. 

చంద్రబాబు మోసాలకు ప్రజలు విసిగిపోయారని, వంచన, మోసం, దగా, వెన్నుపోటు అలవాటుగా మార్చుకున్న చంద్రబాబును ప్రజాక్షేత్రంలో ఆధారాలతో ప్రజల ముందు వుంచుతామని అన్నారు. సిఐడి ఇప్పటికే అ అక్రమాలను గుర్తించిందని అన్నారు. రేపటి నుంచి ఒక్కో సర్వే నెంబర్ లో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారో పూర్తి వివరాలతో ప్రజల ముందుకు తీసుకువస్తామని దర్మశ్రీ  వెల్లడించారు.