అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రజలు చేపట్టిన నిరసనల సెగ అసెంబ్లీ సమావేశాలకు తాకకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను నిరసనకారులు అడ్డుకునే అవకాశాలుండటంతో వైసిపి  ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టింది. 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి చేరుకోడానికి ఇంతకాలం ఉపయోగించిన మార్గాన్నికాకుండా మరో మార్గాన్ని అధికారులు సిద్దం చేస్తున్నారు. సాధారణంగా ఉపయోగించే మార్గంలో నిరసనలు కొనసాగే అవకాశాలు వుండటంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్దం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు.

కృష్ణాయపాలెం చెరువు నుంచి శాసనసభకు రావడానికి వీలుగా గతంలో రోడ్డును(జడ్‌ రోడ్డు) ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రారంభోత్సవ సమయంలో ఎమ్మెల్యేలు, ఇతరులు రావటానికి వీలుగా దీన్ని నిర్మించారు. ఆ తర్వాత నుంచి దీన్ని వినియోగించడం లేదు. పైపులైన్లు ఏర్పాటు చేయడం కోసం ఈ మార్గంలో పెద్ద గుంతలు తవ్వారు. ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజులుగా వాటిని పూడ్చి వాహనాల రాకపోకలకు వీలుగా మరమ్మతులు చేస్తున్నారు. 

read more  కేంద్రం చూస్తూ ఊరుకోదు.. మూడు రాజధానులపై సుజనా చౌదరి

రాజధాని తరలింపు ప్రకటన తర్వాత ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మందడం, వెలగపూడి ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈ సమయంలో జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికపై సోమవారం కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 20న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగనుంది. 

సమావేశాలకు హాజరు కావడానికి సీఎం, మంత్రులు, అధికారులు సీడ్‌యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం మీదుగా ప్రస్తుతం అసెంబ్లీకి రావాల్సివుంది. ఉద్యమం నేపథ్యంలో ఇదే దారిలో వస్తే నిరసన ప్రదర్శనలతో రాకపోకలను అడ్డుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాసనసభకు వచ్చే కృష్ణాయపాలెం చెరువు దగ్గర నుంచి అసెంబ్లీకి వచ్చే రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరిని ఈ  మార్గంలోనే అసెంబ్లీకి చేరుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.