అమరావతి:  రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన ఆలోచన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. కేవలం అమరావతిని మాత్రమే కాకుండా మరో రెండు నగరాలను కూడా రాజధానిగా ఏర్పాటుచేసి అభివృద్ది వికేంద్రీకరణ చేపట్టాలని భావిస్తున్నట్లు జగన్ వెల్లడించాడు. అయితే అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు మాత్రం కేవలం తమ ప్రాంతంలోని రాజధాని వుండాలని... కావాలంటే మిగతామార్గాల్లో ఇతర పట్టణాలను అభివృద్ది చేయాలని సూచిస్తున్నారు. 

ఇలా జగన్ నిర్ణయానని వ్యతిరేకంగా అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు చేపట్టిన నిరసనలకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ మద్దతు తెలిపింది.  ఈ మేరకు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యులు నాగబాబు,  ఇతర నాయకులు శుక్రవారం అమరావతి ప్రాంతంలో పర్యటించారు. 

ఈ క్రమంలో యర్రబాలెం గ్రామ రైతులు, ప్రజలు జనసేన నేతలను తమ ఆవేదనను  తెలియజేశారు. రాజధాని వస్తుందని... రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భూములు ఇస్తే ఈ విధంగా చేయడం అన్యాయమన్నారు. మహిళలయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమను ఆదుకోవాలని జనసేన నేతల ఆవేదన వ్యక్తం చేశారు.

read more  ఏపీకి మూడు రాజధానులు : నిరాహారదీక్షలూ, రాస్తారోకోలు...రోడ్లపైనే వంటావార్పులు...

ఆ తర్వాత జనసేన నాయకులు మందడం రైతులు చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని మహిళలు జనసేన నేతలకు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సీఎం జగన్, వైసిపి  ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 

''అవ్వలారా.. తాతలారా.. అక్కలారా.. చెల్లెమ్మ నేనున్నా అన్నాడు. అధికారంలోకి రాగానే మమ్మలను నడిరోడ్డు మీద నిలబెట్టారు. మీతో ఉండేందుకే ఇల్లు కట్టుకున్నా అన్న సీఎం జగన్ మమ్మల్ని నట్టేట ముంచాడు. 

మూడు పంటలు పండే పొలాలను మా రాజధాని అని భావించి ఎపి ప్రభుత్వానికి ఇచ్చాం. అయితే ఆనాడు రాజధానికి అనుకూలం అని జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆయన ప్రకటన చూసిన తర్వాతే చాలామంది రైతులు తమ భూములు ఇచ్చారు. 

ఈరోజు మా భూములు మాకు ఇస్తామంటున్నారు. అలాగయితే మేము ఎలా అప్పగించామోఅదే విధంగా మాకు‌ వెనక్కి ఇవ్వాలి.జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని ప్రాంత వాసులు కంటి మీద కునుకు లేకుండా బాధపడుతున్నారం.

read more  ఏపీకి మూడు రాజధానులు: మరోసారి జగన్‌కు మద్దతుగా గంటా ప్రకటన

అమరావతి ప్రాంతంలో అన్ని కులాల మతాల వారు ఉన్నారు. కేవలం ఒక్క కులం పేరు చెప్పి రాజధాని మార్చడం సరికాదు. మా ఆవేదన అర్థం చేసుకోవాలి. రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాలి. 

ఇంత జరుగుతున్నా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కనీసం స్పందించకపోవడం దారుణం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు, మా బాధను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం'' అంటూ జనసేన నాయకుల ఎదుట మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు.