Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ప్రభుత్వం 2019 చేసిందిదే... 2020లో ఏం చేస్తామంటే: మంత్రి పుష్ప శ్రీవాణి

ఆంధ్ర ప్రదేశ్ లో 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అతి తక్కువ కాలంలోనే ఎంతో అభివృద్ది చేసిందని మంత్రి పుష్ప శ్రీవాణి  అన్నారు. అంతేకాదు 2020లో ఇంకా ఏం చేయనుందో కూడా మంత్రి వెల్లడించారు. 

ysrcp government 2020 plannings: minister pushpa srivani
Author
Amaravathi, First Published Dec 31, 2019, 4:02 PM IST

అమరావతి: అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలోనే తమ ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజనాభివృద్ధిలో మైలురాళ్లుగా నిలిచే చారిత్రిక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. కొత్త సంవత్సరంలోనూ గిరిజన సంక్షేమానికి ఇంకా పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని వివరించారు.

మంగళవారం మంత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో 2019లో తమ ప్రభుత్వ ఆద్వర్యంలో సాధించిన రాష్ట్ర, నియోజకవర్గస్థాయి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2020 సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.

రాష్ట్ర స్థాయిలో సాధించిన ప్రగతి:

గత టీడీపీ ప్రభుత్వం విశాఖమన్యం గిరిజనుల అభీష్టానికి విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రద్దు చేసి  తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పుష్ప శ్రీవాణి తెలిపారు. విద్య, వైద్యం కోసం నానా అగచాట్లుపడే గిరిజనుల కష్టాలను కడతేర్చడం కోసం పాడేరులో గిరిజన వైద్య కళాశాల, రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల పరిధిలో ఏడు గిరిజన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయాలను ముఖ్యమంత్రి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

read more  2020 వాయిదాలతో షురూ...ఏపిలో ఆ సేవల ప్రారంభం వాయిదా

ఆయుష్ విభాగానికి చెందిన మెడికల్ పీజీ సీట్లలో ఎస్టీ రిజర్వేషన్లు పాటించకుండా గిరిజన విద్యార్థులకు ఎంతోకాలంగా అన్యాయం చేస్తున్నారనే విషయం తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సహకారంతో ఆ అన్యాయాన్ని సరిదిద్ది ఆయుష్ మెడికల్ పీజీ సీట్లలోనూ ఎస్టీ రిజర్వేషన్ పాటించేలా ఆదేశాలు ఇప్పించామని, దీంతో ఎన్నో ఏళ్లుగా ఒక్క పీజీ సీటు కూడా రాని ఎస్టీ విద్యార్థులకు ఇప్పుడు  ఏడాదికి మూడు సీట్లు తప్పనిసరిగా కేటాయించడం జరుగుతోందని చెప్పారు.  

అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉమ్మడిగా ఒక కమిషన్ ఉండగా, దానివల్ల ఎస్టీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని గుర్తించిన ముఖ్యమంత్రి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ ఉమ్మడి కమిషన్ స్థానంలో ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీని కూడా నిలబెట్టుకుంటూ ఆరు నెలల కాలంలోనే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేసారని గుర్తు చేసారు. ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్ణయాలని పుష్ప శ్రీవాణి అభివర్ణించారు. 

రాష్ట్రంలో గిరిజపాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకొనే గిరిజన సలహా మండలి( ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్- టీఏసీ)ని కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉండగా 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం మూడేళ్ల తర్వాతగానీ టీఏసీని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 

ysrcp government 2020 plannings: minister pushpa srivani

అప్పట్లో కూడా ఎస్టీ ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న శాసనసభ్యులందరూ వైసీపీకి చెందిన వారు కావడంతో చంద్రబాబు టీఏసీని పూర్తిగా పక్కన పెట్టారని, అయితే ఈ విషయంగా తమ పార్టీ నాయకులు చంద్రబాబుపై వత్తిడి తీసుకురావడంతో ఇక విధిలేక టీఏసీని ఏర్పాటు చేసినా, అందులో ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థులను కూడా సభ్యులుగా నియమించి ప్రజాస్వామ్యయుతంగా ఎంపికైన శాసనసభ్యులను అవమానించారని ధ్వజమెత్తారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు నెలల కాలంలోనే గిరిజన శాసన సభ్యులతో టీఏసీని ఏర్పాటు చేసారని, దీనికి సంబంధించిన తొలి సమావేశాన్ని కూడా ఇటీవలే నిర్వహించడం జరిగిందని వివరించారు. 

read more  సీజ్ చేసి రిలీజ్ చేశారు.. మళ్లీ సీజ్ చేశారు: ఆర్టీఏ అధికారులపై జేసీ సీరియస్

గిరిజన గురుకుల విద్యాసంస్థ ద్వారా నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్ గా ప్రమోషన్లు ఇచ్చే విషయంలో లెక్చరర్ల మధ్య విబేధాలు వచ్చి న్యాయపరమైన వివాదాలు ఏర్పడిన కారణంగా గత 12 ఏళ్ల కాలంగా జూనియర్ కళాశాలలకు పూర్తి స్థాయి ప్రిన్సిపాల్స్ లేకపోగా కేవలం ఇంచార్జీలతోనే కాలంగడిపేవారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వివాదాలకు సంబంధించిన వారందరితో మాట్లాడి, కోర్టు కేసులను ఉపసంహరింపజేసి నిబంధనల ప్రకారంగా అర్హులైన వారందరికీ ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు ఇచ్చి పారదర్శక విధానంలో వారిని ప్రిన్సిపాళ్లుగా  నియమించడం జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంలో పన్నెండేళ్ల వివాదాన్ని కేవలం మూడునెలల్లోనే పరిష్కరించగలిగామని విపులీకరించారు. 

గురుకుల విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించడానికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా నేరుగా తమకు ఫిర్యాదు చేయడానికి వీలుగా 18605991111 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రారంభించామని తెలిపారు. గురుకుల విద్యాసంస్థల్లో అత్యాధునికమైన వర్చువల్ క్లాస్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా, విద్యాసంస్థల కేంద్రీకృత పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పాటుగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసామన్నారు. 

ysrcp government 2020 plannings: minister pushpa srivani

కళాశాలల ప్రిన్సిపాళ్లు డెప్యుటేషన్లపై వచ్చి ఓఎస్డీలుగా పని చేసే విధానాన్ని, ఓఎస్డీ వ్యవస్థను రద్దు చేసామని వివరించారు. ఎప్పుడూ వివాదాలకు కారణమయ్యే గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగం బదిలీలను ఈసారి ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించగలిగామని తెలిపారు. 

అలాగే ఏజెన్సీ ఏరియాలో ఆశావర్కర్లతో సమానంగా పనిచేస్తున్న గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సి.హెచ్.డబ్ల్యు) లకు 1995 నుంచి కూడా నెలకు కేవలం రూ.400 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారని, గత ప్రభుత్వ హయాం నుంచి కూడా వారు తమ వేతనాల పెంపుకోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండాపోయిందనే విషయాన్ని తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయంగా స్పందించిన సిఎం ఐటీడీఏ సి.హెచ్.డబ్ల్యుల గౌరవ వేతనాన్ని రూ.400 నుంచి ఏకంగా రూ.4 వేలకు పెంచారని పుష్ప శ్రీవాణి గుర్తు చేసారు. 

గిరిజన ప్రాంతాల్లో పోషకాహారలోపం కారణంగా ఏర్పడుతున్న రక్తహీనతతో బాలింతలు, శిశువులు మరణిస్తున్నారనే విషయం తెలిసిన బాలింతల కోసం, అలాగే పిల్లల కోసం ప్రత్యేక పోషకాహార పథకాలను కూడా మంజూరు చేసారని తెలిపారు. రహదారులు లేని గిరిశిఖర గ్రామాల్లో నివసించే గిరిజన మహిళలను ఆఖరు నిమిషంలో ప్రసవాల కోసం తరలించడం, సకాలంలో వారు ఆస్పత్రులకు చేరుకోలేక మరణించడం జరుగుతుండటంతో ఈ మరణాలను నిరోధించడానికి ప్రయోగాత్మకంగా గర్భిణీ స్త్రీల హాస్టళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 

ysrcp government 2020 plannings: minister pushpa srivani

ఏజెన్సీ ఏరియాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకలతో గర్భిణీ స్త్రీల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కూడా తాము నిర్ణయించామని ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ఈ ఏడాదిలో గిరిజన ఆవాసాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చే కార్యక్రమాలతో పాటుగా స్వచ్ఛంధ సంస్థల భాగస్వామ్యంతో గిరిజనుల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. 

గురుకుల విద్యాసంస్థలను జిల్లాల స్థాయిలో పర్యవేక్షించే అధికారులు ప్రత్యేకంగా లేకపోగా, దీనికోసం జిల్లా సమన్వయకర్తల (డిసీఓ)ను నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

నియోజకవర్గస్థాయిలో..

కాగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కురుపాం నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ఏడాది పలు కీలక అభివృద్ధి పనులు చేపట్టామని పుష్ప శ్రీవాణి తెలిపారు. ముఖ్యంగా పదిహేనుళ్లుగా పరిష్కారంకాని బాసంగి నిర్వాసిత గ్రామాల వారి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం, కురుపాం ప్రజలు కలలుగంటున్న గుమ్మడి గడ్డ రిజర్వాయర్ నిర్మాణాన్ని రూ.28 కోట్లతో చేపట్టడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో ఆమోదముద్ర వేయించడం, నాగావళి నదిపై గత రెండేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణ ఒప్పంద గడువును పెంచడంతో పాటు 2020 జూన్ నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం వీటిలో ముఖ్యమైన కార్యక్రమాలని చెప్పారు.

 గత ఎన్నికల సమయంలో గిరిజన ఆవాసాల ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారంగానే ఇప్పటికే పలు గిరిజన గ్రామాల్లో రక్షిత తాగు నీటి పథకాలను ప్రారంభించామని, రాబోయే రెండు నెలల కాలంలో మరో 30 పథకాలను కూడా ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్ల కాలంలో తన నియోజకవర్గంలోని ఏ గ్రామంలో కూడా తాగునీటి కొరత లేకుండా చూడాలన్నది తన ఆశయమని ప్రకటించారు. 

నియోజకవర్గంలోని అధికారులందరినీ ప్రజల వద్దకే తీసుకెళ్లి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించామని, కొత్త ఏడాదిలోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. గిరిజన గురుకుల విద్యార్థులతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడం ఈ ఏడాదిలో తనకు ఎంతగానో సంతృప్తినిచ్చిన కార్యక్రమని మంత్రి శ్రీవాణి తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios