పల్నాడులో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీకి పోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ బుధవారం చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడులో ఏదో జరిగిపోతోందని టీడీపీ గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉందని అంబటి గుర్తు చేశారు. టీడీపీ బాధితుల్ని రేపు ఆత్మకూరుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు గుంటూరులో ఏర్పాటు చేసిన టీడీపీ పునరావాస కేంద్రం నుంచి వైసీపీ బాధితులను స్వగ్రామాలకు తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాతే తాము గ్రామాలకు వెళతామని బాధితులు పట్టుబడుతున్నారు. 

మరోవైపు ఈ తరహా రాజకీయాలు  చంద్రబాబుకే సాధ్యమంటూ చురకలంటించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. టీడీపీ హయాంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలపై ఎన్నో దాడులకు పాల్పడ్డారని ఆర్కే ఆరోపించారు.

నాటి దురాగతాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు బాబు ఈ ఎత్తుగడ వేశారంటూ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నెన్ని అక్రమాలకు పాల్పడ్డారో రాష్ట్రం మొత్తానికి తెలుసునన్నారు.

తెలుగుదేశం నేతలు చేస్తున్న అరాచకాలపై న్యాయం చేయాల్సిందిగా ప్రజలు పోలీస్ స్టేషన్లకి వెళ్లేందుకు కూడా భయపడ్డారని ఆర్కే చురకలంటించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి సంవత్సరంలో 30 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆళ్ల ఆరోపించారు. 

వైసీపీ బాధితుల తరలింపుకు యత్నం: బాబు వస్తేనే కదులుతామంటున్న జనం