వైసీపీ బాధితుల తరలింపుకు యత్నం: బాబు వస్తేనే కదులుతామంటున్న జనం
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పోలీస్ శాఖ స్పందించింది. ఆర్డీవో, అదనపు ఎస్పీ పునరావాస కేంద్రాలకు వెళ్లి.. బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు బెట్టు వీడకపోవడంతో మంగళవారం మరోసారి పోలీసులు చర్చలు జరిపారు. బాధితులను పోలీస్ భద్రత మధ్య స్వగ్రామాలకు తరలించేందుకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన గొడవలతో ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి.
రోజు రోజుకి ఇవి పెరుగుతూనే ఉన్నాయి... ఈ నేపథ్యంలో వైసీపీ నేతల నుంచి రక్షణ కోసం దుర్గి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన 70 కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలి కోలగుట్ల, దుర్గికి వెళ్లిపోయారు. దీంతో పాటు వైసీపీ బాధితుల కోసం టీడీపీ.. గుంటూరులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పోలీస్ శాఖ స్పందించింది. ఆర్డీవో, అదనపు ఎస్పీ పునరావాస కేంద్రాలకు వెళ్లి.. బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించారు.
అయినప్పటికీ టీడీపీ శ్రేణులు బెట్టు వీడకపోవడంతో మంగళవారం మరోసారి పోలీసులు చర్చలు జరిపారు. బాధితులను పోలీస్ భద్రత మధ్య స్వగ్రామాలకు తరలించేందుకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు.
అయితే తాము చంద్రబాబును కలిసిన తర్వాతే గ్రామాలకు వెళ్తామని వైసీపీ బాధితులు స్పష్టం చేశారు. అయితే బాధితులు భయపడాల్సిన పనిలేదని ఏఎస్పీ తెలిపారు. శిబిరంలో 100 మంది వరకు ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు టీడీపీ నేతలు చలో ఆత్మకూరుకు సిద్ధమవుతున్నారు. తాము చలో ఆత్మకూరు జరిపి తీరుతామని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇలాంటి దారుణమైన రాజకీయాలు చంద్రబాబుకే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు.