అమరావతి:రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతను నివారించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది.మందులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. 

2019 జూన్ కు ముందు ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరాలో తీవ్రమైన కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దాదాపు రూ.100 కోట్లకు పైగా మందుల తయారీ కంపెనీలకు గతంలో బకాయిపడటం వల్ల నాణ్యమైన మందుల సరఫరా జరగలేదు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకోవడంతో వైద్యారోగ్య శాఖ పలు సమూల మార్పులను తీసుకువచ్చింది. 

మందుల సరఫరాదారుల్లో విశ్వాసాన్ని, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చేందుకు పాత బకాయిలన్నింటినీ చెల్లించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. అదనంగా 250 రకాల మందుల కొనుగోలుకు కొత్తగా టెండర్లు పిలిచి ఖరారు చేసింది.అనవసరమైన మందులను తొలగించే పనిలో భాగంగా అవసరమైన మందుల జాబితాను నిపుణులు పునఃపరిశీలించేలా చర్యలు తీసుకుంది. 

read more బాలకృష్ణన్ కమిటీ సిపార్సులకు జగన్ గ్రీన్ సిగ్నల్...విద్యారంగంలో సంస్కరణలు

ఆస్పత్రుల డిమాండ్ కు అనుగుణంగా అత్యవసర మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్ లలో నిల్వ ఉంచేందుకు ఆర్డర్లు ఇచ్చింది. జిల్లా కేంద్రాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ లలో 300 రకాల ముఖ్యమైన మందులు, 250 సర్జికల్ ఐటెంలను అందుబాటులో ఉంచింది. 

నవంబర్ 10కల్లా ఇవి అందుబాటులోకి వచ్చేలా రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్ సీ), ప్రాంతీయ ఆస్పత్రులు (ఏరియా ఆస్పత్రులు) , జిల్లా కేంద్ర ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. 250 మందులకు గాను టెండర్లు పూర్తి చేసి ఆర్డర్లు ఇచ్చింది. నవంబర్ 20 నుంచి ఈ మందులను సరఫరా చేస్తారు. 

read more నా కళ్లు చెవులు, కలెక్టర్లు, ఎస్పీలే... అందుకోసమే స్పందన...: జగన్

మరో రెండు నెలల్లో అదనంగా 100 మందులకు టెండర్లు ఖరారు చేస్తుంది. భవిష్యత్ లో డబ్ల్యూహెచ్‌వో/జీఎంపీ సర్టిఫైడ్ మందుల తయారీదారుల  నుంచే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో అత్యంత నాణ్యతగల మందులను సరఫరా చేసేందుకు వీలు అవుతుంది. 

మరో 165 సర్జికల్ ఐటెం లకు టెండర్లు పిలవనుంది. సర్జికల్ ఐటెం సరఫరా విషయంలో అత్యంత దయనీయంగా ఉన్న రాష్ట్రంలోని పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చక్కదిద్ది పెను మార్పులను తీసుకువచ్చారు. తద్వారా మందుల సరఫరాలో రాష్ట్రం నూతన అధ్యాయాన్ని సృష్టించింది.