Asianet News TeluguAsianet News Telugu

జగన్ డిల్లీ పర్యటన వెనకున్న రహస్యమిదే...అతడిని విడిపించడానికే...: వర్ల రామయ్య

ఎక్కడ జైలుకు వెెళ్లాల్సివస్తుందోనన్న భయం ముఖ్యమంత్రి జగన్ లో మొదలయ్యిందని... అందుకోసమే ఆయన డిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నారని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు. 

Varla Ramaiah shocking comments on AP CM YS Jagans Delhi Tour
Author
Guntur, First Published Feb 14, 2020, 5:56 PM IST

గుంటూరు: దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా వైసీపీ మాఫియా వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. పనికిమాలిన చెత్తపేపర్‌లో వచ్చిన రాతలను ఆధారంగా చేసుకొని రాష్ట్రమంత్రులు వెల్లంపల్లి, బొత్స, అవంతి, రంగనాథరాజు, పేర్నినాని వంటివారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీబీడీటీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సేషన్‌) ఇచ్చిన పత్రికా ప్రకటన అర్థంకాకపోవడంతో మంత్రులంతా ఇష్టమొచ్చినట్లు తమ నాలుకలకు పనిచెప్పారన్నారు. దేశవ్యాప్తంగా 40చోట్ల దాడులు చేశామని, 86లక్షల నగదు, 71 లక్షల విలువైన నగలు, సక్రమంగా పన్నుచెల్లించకుండా రూ.2వేలకోట్ల వరకు జరిపిన విదేశీ లావాదేవీలు గుర్తించామని సీబీడీ స్పష్టంగా పేర్కొంటే... ఆ రెండువేల కోట్లు చంద్రబాబువంటూ బుద్ధి, జ్ఞానంలేని సాక్షిపత్రిక విషపురాతలు రాసిందన్నారు.    

వైఎస్‌ హయాంలో నిమ్మగడ్డ ప్రసాద్‌కు 28వేల ఎకరాలిస్తే, అందుకు ప్రతిఫలంగా ఆయన జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో రూ.834కోట్లు పెట్టుబడి పెట్టాడన్నారు. రస్‌అల్‌ఖైమా ఫిర్యాదుతో సెర్బియాలో నిమ్మగడ్డ అరెస్టవడంతో ఎక్కడ తనబండారం బయటపడుతుందోనన్న భయం జగన్‌లో మొదలైందని వర్ల తేల్చిచెప్పారు. 

read more  వికేంద్రీకరణ బిల్లుపై క్లారిటీ లేదు... ఏం జరుగుతుందో చూద్దాం...: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

నిమ్మగడ్డను విడిపించడంకోసం తనపార్టీకి చెందిన 22మంది ఎంపీలను జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి జైశంకర్‌ వద్దకు పంపించింది నిజం కాదా అన్నారు. జగన్‌కు నిమ్మగడ్డకు మధ్యనున్న ఆర్థిక వ్యవహారాల్లోని లోగుట్టు గురించి తెలిసినంతనే కేంద్రమంత్రి, వైసీపీ ఎంపీల విజ్ఞప్తిని బుట్టదాఖలు చేయడం జరిగిందని రామయ్య తెలిపారు. 

నిమ్మగడ్డ ప్రసాద్‌ అప్రూవర్‌గా మారితే  ఎక్కడ తనదాకా వస్తుందోనన్న భయం జగన్‌లో మొదలైందని, దానితోపాటు సీబీఐ -ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన ఢిల్లీయాత్రలు చేస్తున్నాడన్నారు.  

వైసీపీ మాఫియా, సాక్షిమీడియా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. ఎన్నికల్లో ఓడినా, ప్రజల్లో చంద్రబాబుకు ఆదరణ, అభిమానం తగ్గలేదని, దాన్నిచూసి ఓర్వలేకనే అసూయాద్వేషాలతో జగన్‌ రగిలిపోతున్నాడని వర్ల మండిపడ్డారు. సూర్యుడిపై ఉమ్మేస్తే తిరిగి అది తమముఖంపైనే పడుతుందన్న నిజాన్ని జగన్‌, ఆయన మంత్రులు తెలుసుకోవాలన్నారు. 

జగన్‌ ముఖ్యమంత్రిగా గెలిచినంత మాత్రాన ఆయనపై ఉన్న కేసులు మాఫీ అయినట్లు కాదన్నారు రామయ్య.  ప్రజాక్షేత్రం వేరు-న్యాయస్థానాలు వేరనే విషయాన్ని జగన్‌ గ్రహించేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఆర్టికల్‌-14ప్రకారం చట్టంముందూ అందరూ సమానమైనా, జగన్‌ ముఖ్యమంత్రిననే సాకుతో ఎందుకు కోర్టులవిచారణ నుంచి మినహాయింపు కోరుతున్నాడని వర్ల ప్రశ్నించారు. 

జగన్‌ ముఖ్యమంత్రి అయినాసరే, తప్పకుండా కోర్టుకు హాజరుకావాల్సిందేనని... ఆయన ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశాడని, ఆయనపై తొలిఛార్జ్‌ షీటువేసి 8ఏళ్లయినా ఇంతవరకు విచారణ ఆరంభంకాలేదని సీబీఐ చెప్పింది వాస్తవం కాదా అని రామయ్య నిలదీశారు. గతంలో చంద్రబాబు అవినీతిపై విచారణ జరపమని సుప్రీంకోర్టుని ఆశ్రయించిన జగన్‌తల్లి విజయమ్మ, తన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకుందన్నారు. 

చంద్రబాబుని దోషిగా చూపే ప్రయత్నంలో 26 ఎంక్వైరీ కమిటీలు వేసిన వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి చివరకు భంగపాటే మిగిలిందన్నారు. తనకు శిక్షపడుతుందన్న భయంతోనే జగన్‌ కోర్టులకు గైర్హాజరవుతూ, కేసులనుంచి తప్పించుకోవడానికి ఢిల్లీయాత్రలు చేస్తున్నాడన్నారు. తనకంట్లో దూలాన్ని ఉంచుకున్న సీఎం ఎదుటివారి కంట్లోని నలకను చూసి అవహేళన చేయడం విచిత్రంగా ఉందన్నారు. 

read more  బాబుపై కాదు కేసీఆర్ పైనే ఐటీ దాడులు...ఆ ఎనిమిదిమంది మంత్రులకోసమే...: దేవినేని ఉమ

తండ్రి ముఖ్యమంత్రి కాకముందు అంబాసిడర్‌ కారులో తిరుగుతూ, రెండుగదుల ఇంట్లో నివసించిన జగన్మోహన్‌రెడ్డికి నేడు, లక్షలకోట్లు ఎక్కడినుంచి వచ్చాయని వర్ల నిలదీశారు. కేసుల నుంచి బయటపడానికి, రాష్ట్రప్రజల్ని నానాగడ్డి కరిపించడానికే జగన్‌ ముఖ్యమంత్రయ్యాడు తప్ప ప్రజలకు సేవచేయడానికి కాదన్నారు. 

దిశ పోలీస్‌స్టేషన్ ప్రారంభం సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ కోర్టుల విచారణ ఏళ్లకు ఏళ్లుగా సాగితే దోషులకు శిక్షఎలా పడుతుందని ప్రశ్నించారని... అదేసూత్రాన్ని ముఖ్యమంత్రి తన కేసులకు ఎందుకు వర్తింపచేసుకోవడం లేదని వర్ల నిగ్గదీశారు. జగన్‌కు, ఆయన విషపత్రిక సాక్షికి నీతి, నిజాయితీ, ఉంటే తక్షణమే తప్పుతెలుసుకొని  చంద్రబాబునాయుడికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని వర్ల డిమాండ్‌చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios