ఏ1 జగన్ తో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి భేటీ... అందుకోసమేనా...: వర్ల రామయ్య

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ఏపి ముఖ్యమంత్రి జగన్ తో భేటి అవడాన్ని టిడిపి నాయకులు వర్ల రామయ్య తప్పుబట్టారు. వారిద్దరి భేటిపై సంచలన  వ్యాఖ్యలు చేశారు.

Varla Ramaiah Sensational Comments Over CM YS Jagan-justice jasti chalameshwar meeting

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దేశంలోని అందరి ముఖ్యమంత్రుల్లాంటివాడు కాదని... ఆకయనపై సీబీఐ 11, ఈడీ5 ఛార్జ్‌షీట్లు వేశాయని టీడీపీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. ఆయన వేలకోట్ల ఆస్తుల్ని ఈడీ ఇప్పటికే జప్తుచేసిందని... ఆర్థికంగా జగన్‌ చేసిన నేరం  చాలా పెద్దదని... ఆయన క్రమం తప్పకుండా హాజరుకావాలని కోర్టు స్పష్టంచేసిందని రామయ్య గుర్తుచేశారు. 

కోర్టులన్నీ ముఖ్యమంత్రి వ్యవహారశైలి గురించి చెబుతుంటే ఆయనేమో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ని కలవడాన్ని తాము తప్పుపడుతున్నామన్నారు. సుప్రీం న్యాయమూర్తులకే నీతి ప్రబోధాలు చేసి దేశ న్యాయవ్యవస్థలోనే గొప్పపేరు ప్రతిష్ఠలున్న చలమేశ్వర్‌ సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్లు మోపబడి, 11కేసుల్లో ముద్దాయిగా ఉన్నవ్యక్తిని కలవడం సభ్యసమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుందన్నారు. 

ముద్దాయిగా ఉన్న వ్యక్తిని సుప్రీం మాజీన్యాయమూర్తి కలిస్తే జగన్‌ కేసులను విచారించే న్యాయమూర్తుల మెదళ్లలో ఎటువంటి ఆలోచనలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ఏ కారణంతో సుప్రీం మాజీన్యాయమూర్తి జగన్‌ని కలిసినా వారి కలయిక సభ్యసమాజానికి  వేరే సందేశం ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 

జగన్‌ సీబీఐ కోర్టుకి, హైకోర్టుకి తిరుగుతున్న వేళ జాస్తి చలమేశ్వర్‌ కలయిక ఆయా న్యాయస్థానాలను ప్రభావితం చేయదా అని వర్ల ప్రశ్నించారు. చలమేశ్వర్‌ కలిస్తే  ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఆ కలయికను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు లేకపోలేదని వర్ల అభిప్రాయపడ్డారు. అసలు అటువంటి అవకాశం ఏ-1కు ఎందుకు కల్పించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. 

read more  భార్యాపిల్లలు అడుక్కుతింటే జగన్ ఈగో శాంతిస్తుంది...: భూముల లీజు రద్దుపై జేసి

ఏ సమస్యపై వారి మధ్య ఎటువంటి చర్చ జరిగిందో చెప్పని పక్షంలో పరోక్షంగా జగన్‌కు సాయం చేయడానికే వెళ్లారని భావించాల్సి వస్తుందన్నారు. నిన్నటి మీ కలయిక జగన్‌తో కలిసి మీరుచూపిన హావభావాలు చూసినవారెవరైనా పలువిధాలుగా ఆలోచిస్తారన్నారు. న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాక వారు న్యాయవాదులుగా కూడా పనిచేయరని అలాంటిది ఆర్థిక నేరగాడిగా దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు పొందిన వ్యక్తి ఎలా కలుస్తారని వర్ల నిలదీశారు. 

జగన్‌ గతంలో కూడా చలమేశ్వర్‌ ను కలిశాడని... అప్పుడు ఇంతలా హడావుడి చేయలేదు కానీ ఇప్పుడెందుకు అలా జరిగిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన కేసుల్లోంచి బయటపడటానికి చలమేశ్వర్‌ని కలిశాడో..లేక ప్రభుత్వానికి కోర్టుల నుంచిపడుతున్న మొట్టికాయల నుంచి తప్పించుకోవడానికి కలిశాడో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు. వారిద్దరి కలయిక ప్రజలకు ఎటువంటి తప్పుడు సంకేతాలు ఇస్తుందో  అర్థం చేసుకోవాలన్నారు. 

చలమేశ్వర్‌ అమరావతి తరలింపువల్ల నష్టపోతున్న రాష్ట్రప్రజలకు సాయం చేయడానికి జగన్‌ని కలిశారా... లేక ముఖ్యమంత్రికి సాయంచేయడానికి వెళ్లారా అనేది చెప్పాలన్నారు. జగన్‌కి సాయపడటానికే చలమేశ్వర్‌ ఆయన్ని కలిశారని, నిన్నటివరకు సుప్రీం న్యాయమూర్తిగా ఆయన అనుభవించిన హోదానే జగన్‌కు ఉపయోగపడుతుందన్నారు. వారిరువురూ ఏ అంశాలపై చర్చించారో ఇప్పటికైనా స్పష్టం చేయాలని లేకుంటే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని రామయ్య  అన్నారు. 

read more  ఇప్పటికే ఆర్టీసి, పెట్రోల్ పై బాదుడు... త్వరలో ఏపి ప్రజలపై మరో భారం: అనిత

జగన్మోహన్‌రెడ్డి ఏఏ కేసులపై, ఏఏ కోర్టులకు హాజరవు తున్నారో, ఆయా కేసుల్ని విచారించే న్యాయమూర్తులందరూ తమ మస్తిష్కాల్లో జగన్‌, చలమేశ్వర్‌ల కలయికను నిలుపుకోకుండా తక్షణమే తొలగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వర్ల తెలిపారు. నిన్నటివరకు ఉన్నతస్థానంలో కొనసాగిన చలమేశ్వర్‌ లాంటి వారు, జగన్‌ని కలవడంవల్ల ఆయన తాను పొందాలనుకున్నది పొందారని, ఒక ముద్దాయిగా ఆయన తాననుకున్నది సాధించారని రామయ్య స్పష్టంచేశారు. చలమేశ్వర్‌ ఇప్పటికైనా జగన్‌ను కలవడంపై సవివరమైన ప్రకటన చేయాలని రామయ్య డిమాండ్ చేశారు.       

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios