ఇప్పటికే ఆర్టీసి, పెట్రోల్ పై బాదుడు... త్వరలో ఏపి ప్రజలపై మరో భారం: అనిత

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై ఇప్పటికే ఆర్టీసి ఛార్జీలు, పెట్రోల్ ధరలు పెంచి భారం మోపిన  జగన్ సర్కార్ మరింత భాారం పెంచేందుకు ప్రయత్నిస్తోందని... అతి త్వరలో మరో గుదిబండ ప్రజలపై పడనున్నట్లు టిడిపి మాజీ ఎమ్మెల్యే  వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. 

AP Government plans to increase electriicity charges...: vangalapudi anitha

గుంటూరు: రాష్ట్రంలో సంక్షేమ పధకాల అమలులో కోత విధిస్తూ మరో వైపు అన్ని రకాల ధరలు పెంచుతూ జగన్‌ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. రెండు నెలల్లో జగన్‌ ప్రభుత్వం 7 లక్షల మంది పెన్షన్లు తొలగించిందని... ఇంత భారీ ఎత్తున తొలగించడానికి గల కారణాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.  

తాను అధికారంలోకి వస్తే పెన్షన్‌ ను రూ.3వేలు చేస్తానని ఎన్నికలకు ముందు ప్రగల్బాలు పలికి మోసం చేసిన జగన్‌ ఇప్పుడు రకరకాల నిబంధనల పేరుతో అర్హతలు ఉన్నవారి పెన్షన్‌ ను తొలగిస్తూ వారి పొట్ట కొడుతున్నారన్నారు. ఇలా అకారణంగా ఫెన్షన్స్ కోల్పోయి ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు బాధపడుతున్నారని... వారి ఆవేదన జగన్ కనిపించడం లేదా అని నిలదీశారు. 

వైసీపీ కార్యకర్తలకు పెన్షన్లు ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ బడుగు, బలహీన వర్గాల పెన్షన్లు తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచితే జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో రూ.45వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు.  ఇలా రాష్ట్ర ప్రజలపై భారం మోపే విధానాలకు జగన్‌ ప్రభుత్వం తెరలేపిందన్నారు. 

పెంచిన ధరలు తగ్గించని పక్షంలో మరో పోరాటం తప్పదని అనిత హెచ్చరించారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలే పరిస్థితి నెలకొందన్నారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

read more  రోజా టార్గెట్: వంగలపూడి అనితకు చంద్రబాబు కీలక పదవి

 ఓ వైపు ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుండగా.. మరోవైపు రాష్ట్ర ఆదాయం రోజు రోజుకూ తగ్గిపోతోందన్నారు. తాను ముఖ్యమంత్రిని అయితే ధరలు పెంచబోనంటూ ప్రగల్బాలు పలికిన జగన్‌ నేడు మాట తప్పారు, మడమ కూడా తిప్పారని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని... పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పెరిగిన ధరల భారంతో సతమతమవుతున్నారని తెలిపారు.

పెట్రోల్‌, డీజిల్‌లపై వ్యాట్‌ పెంచుతూ జగన్‌ సామాన్యుల నడ్డి విరుస్తున్నారున్నారు. పెట్రోల్‌పై ఉన్న 31 శాతం వ్యాట్‌ ను 35.20 శాతానికి,  డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌ ను 27 శాతానికి పెంచారని... ఈ నిర్ణయం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటర్‌ కు రూ.2 చొప్పున పెరిగిందన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న ప్రజలపై జగన్‌ ప్రభుత్వం మరింత భారం మోపిందని అనిత మండిపడ్డారు. 

త్వరలోనే  విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలను పెంచడంతో పాటు ఇసుక మాఫియాతో వైసీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు. దశల వారీ మధ్య నిషేధం పేరుతో మద్యం ధరలు పెంచి జే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

రైతులకు అందని గిట్టుబాటు ధరలు

మరోవైపు జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.  చంద్రబాబునాయుడు హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గగా జగన్‌ హయాంలో పెరిగాయన్నారు. రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశారని.... రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. 

read more  రాజధాని కోసం రెండెకరాలు... గుండెపోటుకు గురైన అమరావతి రైతు

ధాన్యంకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ధాన్యాన్ని కొనడం లేదని తెలిపారు. ప్రైవేటు మిల్లర్ల మాయాజాలంతో క్వింటాల్‌ కు రూ.200 నుంచి రూ.500 వరకు రైతు నష్టపోతున్నారని... 75కిలోల బస్తాకు రూ.1360 ఇవ్వాల్సి ఉండగా దళారులు రూ.1150 మాత్రమే ఇస్తున్నారని అనిత తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios