గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన నిర్ణయాలతో తానే ఉలిక్కిపాటుకు గురవుతున్నాడని, తన చర్యలతో వింతపోకడలకు పోతున్నాడని టీడీపీ సీనియర్‌నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ముక్తకంఠంతో జగన్‌ తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే ఆయన మాత్రం తాననుకున్నదే జరగాలన్న ఉద్దేశంతో ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. తమ రాజధానిని కాపాడుకోవడానికి ప్రజలంతా రేయింబవళ్లు అవిశ్రాంతంగా పోరాడుతుంటే, వారిని ఓడించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముకుల్‌ రోహత్గీ అనే సుప్రీం న్యాయవాదిని తెరపైకి తీసుకొచ్చాడని వర్ల పేర్కొన్నారు. 

రాజధానిని కాపాడుకోవడానికి ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాలు హైకోర్టులో కేసులేస్తే వాటిని అడ్డుకోవడానికి రూ.5కోట్ల ప్రజాధనం వెచ్చించి మరీ రోహత్గీని నియమించారన్నారు. ప్రజా ఆందోళనను, వారి నిర్ణయాలను తొక్కిపెడుతూ ప్రజలను ఓడించడానికి అదే ప్రజలసొమ్మును ఉపయోగించడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు.

read more సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులెన్నో పాసయ్యాయి...: టిడిపి అధ్యక్షుడి వ్యాఖ్యలు 

జగన్‌ తీసుకున్నది ప్రజారంజక నిర్ణయమే అయితే ఢిల్లీ నుంచి సుప్రీం న్యాయవాదిని పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రజలపై గెలవాలన్న ఉద్దేశంతో రూ. 5కోట్ల ప్రజధనం చెల్లించి అదే ప్రజల్ని ఓడించాలని చూడటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అడ్వకేట్‌ జనరల్‌ ఉండగా రోహత్గీని నియమించడం ఏమిటన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఒకన్యాయవాదికి రూ.5కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవని... ఆయనపై జగన్‌కు ఎందుకంత ప్రేమో సమాధానం చెప్పాలన్నారు.

 సీబీఐ వేసిన కేసులపై సుప్రీంకోర్టులో జగన్న తరుపున వాదిస్తున్న వ్యక్తిగత న్యాయవాది అయిన రోహత్గీని నియమించడం ఎంత వరకు సమంజసమని వర్ల ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో సీబీఐకి వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా ముకుల్‌ రోహత్గీ వాదించాడని వర్ల తెలిపారు. భవిష్యత్‌లో తనకుచెందిన కేసుల్ని కూడా వాదించే ఒప్పందంతోనే ఇప్పుడు రూ.5కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. 

జగన్‌ తన కేసులకోసం ప్రజాధనాన్ని వాడుకుంటున్నాడని, అందుకోసమే రోహత్గీకి రూ.5కోట్లు చెల్లించేలా జీవోలు ఇచ్చాడన్నారు. ఏం జరిగినా, ఎందరు చనిపోయినా, ఎందర్ని హింసించయినా సరే తాను నెగ్గవలిసిందే అన్న దుర్భుద్ధితోనే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడన్నారు. ఒకవేళ ఈకేసులో జగన్‌ ఓడిపోతే ప్రజలు కూడా ఓడిపోయినట్టేననే విషయాన్ని ఆయన గ్రహించాలన్నారు.  

read more  వారి దశాబ్దాల ఎదురుచూపులు ఈ ఒక్క నిర్ణయంతో పూర్తి: వైఎస్ జగన్ 

శాసనమండలిలో తిష్టవేసిన 22మంది మంత్రులు, మందబలంతో ఛైర్మన్‌ను బెదిరించారని, కులం-మతంపేరుతో ఆయన్ని దూషించారని రామయ్య మండిపడ్డారు. తామనుకున్నది జరగలేదన్న అక్కసుతో విచక్షణ కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం వారికే చెల్లిందన్నారు. శాసనసభలో ప్రతిపక్షసభ్యులు వెళ్తే వారిని తప్పుపట్టిన ముఖ్యమంత్రి, సదరు సభ్యుల్ని ఎత్తిపడేయాలని చెప్పాడని, మండలిలో తన కేబినెట్‌ మంత్రులు చేసిన దానికి వారినేం చేయాలో ఆయనే చెప్పాలన్నారు. 

ముఖ్యమంత్రి వ్యవహారశైలి వర్గపోరుని పెంచేలా ఉందన్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పేవరకు రాజధాని ఉద్యమం ఆగదని వర్ల తేల్చిచెప్పారు. ప్రతి శుక్రవారం కోర్టులో ముద్దాయిగా నిలబడే వ్యక్తి రాష్ట్ర హైకోర్టు ఎక్కడుండాలో నిర్ణయించడం సిగ్గుచేటన్నారు. 51 మంది మూర్ఖులు, పిచ్చివాళ్లు, అసమర్థులు పరిపాలిస్తుంటే, 49మంది మేధావులు చూస్తూ కూర్చోవాల్సి వస్తుందన్న బెర్నార్డ్‌షా వ్యాఖ్యలకు రాష్ట్రంలోని పరిస్థితులు అద్దంపడుతున్నాయన్నారు.