వారి దశాబ్దాల ఎదురుచూపులు ఈ ఒక్క నిర్ణయంతో పూర్తి: వైఎస్ జగన్

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బిల్లుపై సభలో జరిగిన చర్చలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. మండలి కోరిన సవరణలను తిరస్కరిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. 

CM YS Jagan Specch in AP Assembly on  English Medium Bill

అమరావతి: నిరుపేద కుటుంబాల పిల్లల భవిష్యత్తు మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వేసవి సెలవులు తర్వాత స్కూళ్లు తిరిగి తెరవడానికి ముందే జూన్‌ 1న ‘విద్యా కానుక’ కింద ప్రత్యేక కిట్లు అందజేస్తామని ఆయన ప్రకటించారు. అందులో విద్యార్థులకు అవసరమైనవన్నీ ఉంటాయన్నారు సీఎం.  36.10 లక్షల విద్యార్థులకు ఆ కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందుకోసం దాదాపు రూ.487 కోట్లు ఖర్చవుతాయని...అయినా నిరుపేద కుటుంబాల వారికి భారం కాకుండా ప్రభుత్వం ఆ మొత్తం భరిస్తుందని చెప్పారు.     

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బిల్లుపై సభలో జరిగిన చర్చలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. నిజానికి గత అసెంబ్లీ సెషన్‌లోనే ఈ బిల్లును ఆమోదించినప్పటికీ కొన్ని సవరణలు కోరుతూ శాసన మండలి వెనక్కి పంపించింది. దీంతో గురువారం మరోసారి బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. మండలి కోరిన సవరణలను తిరస్కరిస్తూ శాసనసభ మరోసారి ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. 

read more  మండలి ఛైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు...మంత్రులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు

దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్నారు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావాలని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో పాటు, అగ్రవర్ణాలలో ఉన్న పేద వారు కూడా ఆకాంక్షిస్తున్నారని, ప్రైవేటు స్కూళ్లలో వేలకు వేల ఫీజలు కట్టలేక, ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం వస్తే తమ బతుకులు మారుతాయని చెప్పి దశాబ్ధాల తరబడి వేచి చూస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. అయినా వారి గురించి పట్టించుకోని విధంగా వ్యవస్థ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అందుకే ఈ నిర్ణయం?

ఈ నేపథ్యంలో వారి బతుకులు మార్చడం కోసం, పేద కుటుంబాల వారు తమ పిల్లలు ఫీజు చెల్లించాల్సిన పని లేకుండా, వారూ తమ పిల్లలను బడికి పంపించి, ఇంగ్లిష్‌ మీడియంలో చదవడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు.

ఇంగ్లిష్‌ మీడియమ్‌–శాతం

''రాష్ట్రంలో 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచే ఇంగ్లిష్‌ మాట్లాడడం మొదలు పెడితే, పిల్లల భవిష్యత్తు ఇంకా మెరుగవుతుందన్నది సత్యం. ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో కేవలం 23.67 శాతం స్కూళ్లలో మాత్రమే ఇంగ్లిష్‌ మీడియం ఉంది. మొత్తం స్కూళ్లలో చూస్తే ఇంగ్లిష్‌ మీడియంలో ఉన్నవి 35 శాతం దాటలేదు. కానీ అదే ప్రైవేటు స్కూళ్లలో 98.5 శాతం పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నారు.అంటే ఒక పద్ధతి ప్రకారం ఇనేళ్లు, పేదరికంలో ఉన్న పిల్లలు తెలుగు మీడియమ్‌లోనే చదవాలి అన్న ఒక కుట్రపూరితంగా వ్యవహరించారు. ఈ పరిస్థితి మారాలి '' అని సీఎం వెల్లడించారు.
 
ఇంగ్లిష్‌పై పట్టు ఉంటే?

కంప్యూటర్‌లో మనకు కనిపించే భాష ఇంగ్లిష్‌ అన్న ముఖ్యమంత్రి, మెరుగైన జీతాలు ఎవరికైనా రావాలంటే.. ఎక్కడైనా ఇంగ్లిష్‌ చక్కగా మాట్లాడగలిగితేనే అవి వస్తాయని, ఇవాళ ఆ పరిస్థితి ఉందని అన్నారు.

అందుకే ఈ బిల్లు

ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావాలని, ఆ విధంగా పిల్లల బతుకులు మారాలని, ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాలలో పేద పిల్లల బతుకు మార్చడం కోసమే ఈ బిల్లు తీసుకువస్తున్నామని చెప్పారు.

read more  ఎమ్మెల్సీగా మంత్రి పదవి... మండలి రద్దు చర్చపై మోపిదేవి ఏమన్నారంటే

మరోసారి ఎందుకు?

అయితే ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకువచ్చామని, ‘రైట్‌ టు ఎడ్యుకేషన్‌ కాదు.. రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియమ్‌’ అన్న కార్యక్రమం చేయాలన్న ఒక ధృఢ సంకల్పంతో మొత్తం ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియమ్‌ చేయాలన్న తాపత్రయంతో కొన్నాళ్ల క్రితం అసెంబ్లీ గత సమావేశాల్లో బిల్లును తీసుకువచ్చామని సీఎం గుర్తు చేశారు. పేదలకు బాగు చేసే బిల్లు అని తెలిసినా మండలిలో అడ్డుకున్నారని, సవరణలు కోరుతూ తిరస్కరించారని తెలిపారు.     అందుకే తిరిగి ఇప్పుడు మళ్లీ బిల్లు ప్రవేశపెట్టామన్న ముఖ్యమంత్రి ఈసారి అడ్డుకోలేరని, మండలిలోనూ ఆమోదం పొందుతుందని తేల్చి చెప్పారు. 

పేదలకు న్యాయం చేసే ఈ అంశాన్ని ఆలస్యం చేయడానికి ఎందుకు పాకులాడుతున్నారో, ఎందుకంత తపిస్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. ‘ఇవాళ ఆ పేద పిల్లలకు జగన్‌ మామ తోడుగా ఉన్నాడు కాబట్టి, మళ్లీ ఇదే చట్టసభలో ఇదే బిల్లు తిరిగి ప్రవేశ పెట్టాం’ అని సీఎం చెప్పారు. 

ఇంకా ఏమేమిటి?

అమ్మ ఒడి.. ఇంగ్లిష్‌ మీడియం.. నాడు–నేడులో స్కూళ్ల మార్పు.. పిల్లలకు మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు చేసి, దానికి ‘గోరుముద్ద’ అని పేరు పెట్టామని.. ఈ విధంగా ప్రతి అడుగులో కూడా పిల్లల జీవితాల మార్పు కోసం ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

విద్యా కానుకలో భాగంగా భాగంగా జూన్‌ 12న స్కూళ్లు తెరవక ముందేఅంటే జూన్‌ 1న దాదాపు 36.10 లక్షల మంది పిల్లలకు స్కూల్‌ బ్యాగ్, పుస్తకాలు, నోట్‌బుక్‌లు, మూడు జతల యూనిఫామ్‌ (క్లాత్‌), షూస్, సాక్సులు, బెల్టుతో కూడిన కిట్‌లు ఇస్తామన్నారు.ఒక్కో కిట్‌కు దాదాపు రూ.1355 ఖర్చు చేస్తూ, విద్యా కానుకగా ఇస్తున్నామన్నారు.  ఇందు కోసం దాదాపు రూ.487 కోట్లు ఖర్చైనా ఫరవాలేదని.... ఆ భారం ఆ పిల్లల తల్లిదండ్రులపై పడకూడదన్న ఉద్దేశంతో విద్యాకానుక అమలు చేస్తున్నామని సీఎం వివరించారు.

read more  ఏపికి శాసనమండలి అవసరమా...?: అంబటి రాంబాబు వ్యాఖ్యలు

దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో ఇవన్నీ అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్ పేర్కొన్నారు. ఇలాంటివి మరిన్ని చేసే అవకాశం కల్పిస్తూ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతూ ప్రసంగం ముగించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios