గుంటూరు: అత్యున్నత స్థానాల్లో ఉండే కొందరు తామేమిటో, తమ పరిస్థితి ఏమిటో మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

''ఏ2 విజయసాయి రెడ్డి వ్యవస్థలను శాసిస్తాడా?  అతనెవరు..?  కోర్టు కస్టడీలో ఉండి, కండిషన్ బెయిల్ పై ఉన్నవ్యక్తి వ్యవస్థలను బెదిరిస్తాడా? అన్యాక్రాంతంగా సంపాదించిన సొమ్ముతో, కబ్జాచేసిన పొలాలను చూసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతాడా? ఒక్క క్షణంకూడా బయట ఉండే అర్హత విజయసాయికి లేదు. విజయసాయి వెనక ఎంతనేర చరిత్ర ఉందో అందరూ తెలుసుకోవాలి. రాష్ట్రాన్ని లూఠీచేసిన వ్యక్తి సాధారణ ఎంపీలా ఎగిరెగిరి పడతాడా?'' అని మండిపడ్డాడు.  

''షరతులతో కూడిన బెయిల్ పై తిరుగుతూ రాజ్యాంగబద్ద  సంస్థలను బెదిరిస్తారా? అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాననేది తెలుసుకోకుండా మామూలు ఎంపీలా విర్రవీగుతూ చట్టాలకు, వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడతాడా? ఏ2 విజయసాయి గురించి ప్రజలకు తెలియచేయడానికే విలేకరుల ముందుకొచ్చా. కోర్టులో జీ హుజూర్ అని నిలబడాల్సిన వ్యక్తి స్టేట్ ఎన్నికల కమిషనర్ ని భయపెట్టాలని చూస్తాడా? బెయిల్ నిబంధనలు ధిక్కరించినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలి'' అని సూచించారు. 

''ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి వ్యవస్థలను భయపెట్టాడు.  ఏ2 విజయసాయి బెయిల్ ని సీబీఐ కోర్టు తక్షణమే రద్దుచేయాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని భయపెట్టినందుకు ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏ1 కూడా తన పరిస్థితి తాను తెలుసుకోవాలి. ముఖ్యమంత్రయ్యాను కాబట్టి, నాపై ఏమీ లేవనుకుంటే జగన్ కు కుదరదు. ఆయనకూడా కండిషన్ బెయిల్ పైనే ఉన్నారు'' అని గుర్తుచేశారు.

read more  స్థానికసంస్థల వాయిదా... మాజీ ఎన్నికల కమీషనర్ తో జగన్ మంతనాలు

''2012జూన్ 2న జగన్ ని సీబీఐ అరెస్ట్ చేస్తే 2013 సెప్టెంబర్ 24 కండిషన్స్ తో కూడిన బెయిల్ పై బయటకు విడుదలయ్యాడు. 15 నెలలకు పైగా ఆయన కస్టడీలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి వ్యవస్థలను బెదిరిస్తాడా? ముఖ్యమంత్రి నేనా..రమేశ్ కుమారా అని ఎలా అంటాడు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమారే సుప్రీం. ఆమాత్రం కూడా ముఖ్యమంత్రికి తెలియదా?'' అని ఎద్దేవా చేశారు. 

''ఎన్నికల నిర్వహణ ముగిసేవరకు ముఖ్యమంత్రిని సంప్రదించాల్సిన అవసరం ఈసీకి లేదు. ఇంత చిన్న విషయం కూడా చెప్పని సలహాదారులను చుట్టూ పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎన్నికల కమిషనర్ ని ఎలా ప్రశ్నిస్తాడు? ఆయన తన సలహాదారులకి ఇచ్చేమొత్తంలో సగం తనకు ఇవ్వాలి. తప్పుచేసిన అధికారుల్ని శిక్షించే, బదిలీచేసే హక్కు ఈసీకి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ -243లో ఈ విషయం స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి ఒక్కసారి ఆ ఆర్టికల్ ని చదివితే మంచిది'' అని సూచించారు. 

''కరోనా వైరస్ ప్రభావం దృష్య్టా ఎన్నికలు వాయిదా వేసిన ఈసీకి కులం అంటగడతారా? జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక వర్గనాయకుడా? రెండు కులాలు తన్నుకు చావాలని జగన్ అనుకుంటున్నాడా? ఎన్నికల కమిషనర్ ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి. రెండుకులాల మధ్య వైషమ్యం రేకెత్తేలా ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఆయనపై చట్టప్రకారం డీజీపీ చర్యలు తీసుకోవాలి'' అని రామయ్య కోరారు. 

''ఎవరినీ బెదిరించేహక్కు ముఖ్యమంత్రికి లేదు. సీబీఐ న్యాయస్థానం ఏ1-ఏ2 ల బెయిల్ ని తక్షణమే రద్దు చేయాలి. రెండుకులాల మధ్యన వైషమ్యం రేకెత్తేలా మాట్లాడిన ముఖ్యమంత్రిపై డీజీపీ ఏం చర్యలు తీసుకుంటాడు? 153 సెక్షన్, క్లాజ్-ఏ కింద  ముఖ్యమంత్రిపై కేసు నమోదుచేయాలి. ఎన్నికల కమిషనర్ ని బెదిరించేలా మాట్లాడిన విజయసాయిపై క్రిమినల్ కేసు నమోదుచేయాలి. పునేఠాను పక్కనపెట్టి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు ఏమైనా మాట్లాడాడా? గత ఎన్నికల్లో ఎస్పీలు, కలెక్టర్లను తనకు కూడా తెలియకుండా మార్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నోరెత్తాడా? జగన్ ప్రవర్తన చిన్నాపిల్లాడిలా ఉందని, అవగాహనలేకుండా ఆయన వ్యవహరిస్తున్నాడు'' అని అన్నారు. 

read more   టిడిపికి మరో బిగ్ షాక్... వైసిపిలో చేరిన మాజీ మంత్రి

''తనకు150మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కొన్నాళ్లు పోతే జగన్ కోర్టులను కూడా లెక్కచేయనంటాడని, మీరెవరు నన్ను పిలవడానికి అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వ్యవస్థలను ప్రశ్నించకూడదు... అవే శాశ్వతం తప్ప, రాజకీయ నాయకులు కాదనే విషయం జగన్ గ్రహించాలి. ప్రజలు అరాచకాన్ని, అక్రమ పాలనను భరించరు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాష్ట్రంతో  పాటు ఇతర రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. వ్యవస్థలపట్ల ఇంత చిన్నచూపేంటని అందరూ అనుకుంటున్నారు.  ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సుమోటాగా తీసుకొని, సీబీఐ కోర్టు ఏ1-ఏ2 లను వెంటనే అరెస్ట్ చేసి, విచారణ పూర్తయ్యేవరకు వదలకూడదు'' అని వర్ల డిమాండ్ చేశారు.