అమరావతి: స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా పడినప్పటికి తెలుగుదేశం పార్టీ నుండి అధికార పార్టీలోకి వలసలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవగానే ఈ వలసల పర్వం కూడా మొదలైన విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే టిడిపి పార్టీని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  మాజీ మంత్రులతో  పాటు మరికొందరు  కీలక నాయకులు వైసిపిలో చేరారు. తాజాగా మరో మాజీ మంత్రి తన కుమారుడితో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి టిడిపికి పెద్ద షాకిచ్చారు. 

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఆయన  తనయుడు మధుసూదన్ రెడ్డిలు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరికి స్వయంగా ముఖ్యమంత్రి జగనే వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. 

read more  అసెంబ్లీకి చెప్పులు, బూట్లతో రాకుండా...ప్రభుత్వం రూల్స్ తెచ్చినా... : టిడిపి ఎమ్మెల్సీ ఆగ్రహం

ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు గాదె. వరుసగా మూడుసార్లు అక్కడినుండి  గెలిచి ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామల నేపథ్యంలో బాపట్ల కుమారారు. ఆ నియోజకవర్గం నుండి కూడా 2004, 2009 లో పోటీచేసి గెలుపొందారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో మంత్రి పదవులు పొందారు. 

ఇక 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినడంతో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటినుండి టిడిపిలోనే  కొనసాగుతూ వస్తేన్న గాదె తాజాగా జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకుని అందరనీ ఆశ్చర్యపర్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వున్న అనుబంధమే ఆయనను వైఎస్ జగన్ చెంతకు చేర్చిందని వైసిపి శ్రేణులు చెబుతున్నాయి. 

read more  జగన్ కే నా సపోర్ట్... ఈసీ చేస్తున్నదే కరెక్ట్ కాదు: జెసి సంచలనం

స్థానికసంస్థల ఎన్నికల వాయిదా పడటంతో వలసలు కూడా ఆగుతాయని భావించిన టిడిపికి ఈ చేరిక ద్వారా షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీని ఏమాత్రం కోలుకోనివ్వకుండా దెబ్బతీసి స్థానికసంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించాలన్న ముఖ్యమంత్రి జగన్ వ్యూహం ఇంకా కొనసాగుతూనే వుంది. ఎన్నికలు   ముగిసే వరకు ఈ చేరికలు ఆగవన్న సంకేతాలను గాదె వెంకటరెడ్డి ని చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు పంపించారు జగన్.