గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా అదే మద్యాన్ని  సేవించి మరో వ్యక్తి మృతిచెందాడు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన పులి హరిబాబు(35) మద్యానికి బానిసయ్యాడు. అతడు గురువారం ఉదయం మద్యం కొనుక్కోడానికి డబ్బులివ్వాలంటూ కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. అయితే కుటుంబసభ్యులు అతడికి డబ్బులు ఇవ్వలేదు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు ఎలాగో మద్యం కొనుగోలు చేశారు. దాంట్లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యం చేసుకున్నాడు. అయితే అతడు మద్యం తాగడాన్ని గమనించిన దాసరి వందనం(65) తనకు కూడా కావాలని కోరాడు. ఇందులో విషం కలిపానని హరిబాబు చెప్పినా వినిపించుకోలేదు.

read more  పొలంనుండి వెడుతుంటే వరిగడ్డిలో మంటలు...ఒకరు సజీవదహనం

హరిబాబు చేతిలో నుండి బలవంతంగా మద్యం సీసాను లాక్కుని తాగాడు. తనకి మద్యం ఇవ్వాల్సి వస్తుందని పురుగుల మందు కలిపానట్లు అబద్ధం చెప్తున్నాడని భావించినట్లున్నాడు...చెప్పినా వినకుండా మొత్తం మద్యం సేవించాడు. దీంతో అతడు కూడా విష ప్రభావానికి లోనయ్యాడు. 

ఈ ఘటనలో మొదట మద్యం సేవించిన హరిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. వందనం పరిస్థితి విషమంగా వుండటంతో విజయవాడకు తరలించినా ఫలితం లేకుండా పోయింది. అతడు కూడా మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.