Asianet News TeluguAsianet News Telugu

జగన్ పతనం ఆరంభం... వైసిపి ఎమ్మెల్యేల తిరుగుబాటుతో...: టిడిపి ఎమ్మెల్సీలు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మార్పు, శాసనమండలి రద్దు నిర్ణయాలతో జగన్ పతనం ఆరంభమైందని టిడిపి ఎమ్మెల్సీలు ఆరోపించారు. 

TDP MLCs shocking comments on  AP CM YS Jagan
Author
Guntur, First Published Jan 27, 2020, 9:45 PM IST

అమరావతి: జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలను, గతంలో ఒప్పుకొని ఇప్పుడు మాటతప్పిన ఆయన తీరుని ప్రశ్నించామన్న అక్కసుతోనే టీడీపీ ఎమ్మెల్సీలపై కక్షగట్టి మండలిని రద్దు చేశాడని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఆక్షేపించారు.  సోమవారం ఆయన మరో ఎమ్మెల్సీ సత్యనారాయణరాజుతో కలిసి మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

151మంది వైసీపీ ఎమ్మెల్యేలుంటే వారిలో 84మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని అలాంటివారు పెద్దల సభను రద్దు చేయడం దురదృష్టకరమని దీపక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా మేలుకోకుంటే భవిష్యత్‌లో అధికార పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని అనర్థాలు చోటుచేసుకుంటాయన్నారు. మండలి రద్దు తీర్మానం ఓటింగ్‌పై 18మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదని... తమ అధినేత నిర్ణయం తప్పన్న ఆలోచన వారిలో కొందరికి ఉందని దీంతో  రుజువయ్యిందన్నారు. 

దేశంలో 10రాష్ట్రాలు తమకు కౌన్సిల్‌(మండలి) కావాలని కేంద్రానికి అభ్యర్థించుకున్నాయన్నారు. తన పుట్టినరోజు కానుకగా రాష్ట్రానికి మండలిని కానుకగా ఇచ్చిన వైఎస్‌ నిర్ణయాన్ని కూడా ధిక్కరించేలా జగన్‌ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రప్రజలే ఆలోచించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల పక్షాన మండలి ఉండాలన్న సదుద్దేశంతోనే నాటిపాలకులు మండలిని పునరుద్ధరించారన్నారు. 

read more  హెలికాప్టర్ పంపిస్తే అసెంబ్లీకి వస్తానన్నా... కానీ...: అచ్చెన్నాయుడు

జగన్‌ తనసొంత ఇంటికి రూ.43కోట్లు ఖర్చుచేశాడని... అలాంటి వ్యక్తి మండలికి రూ.60కోట్లు ఖర్చుచేయలేడా అని దీపక్‌రెడ్డి ప్రశ్నించారు. 38బిల్లులు మండలికి వస్తే రెండు బిల్లులకు మాత్రమే సలహాలు, సూచనలు చేశామని, ప్రజల అభిప్రాయం తెలుసుకోమని చెప్పడమే తప్పన్నట్లుగా జగన్‌ నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. 

నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నిరకాలుగా చేయాలో అన్నిరకాలుగా మండలి సభ్యుల్ని ఇబ్బందులకు గురిచేశారని... తన నిర్ణయాన్ని కాదన్నారన్న అక్కసుతోనే ఇదంతా జరిగిందని, భవిష్యత్‌లో తనకు ఎదురుచెబితే అసెంబ్లీసభ్యులపై కూడా జగన్‌ ఇలానే ప్రవర్తిస్తాడన్నారు. బీజేపీ వాళ్లు కూడా ప్రజలపక్షాన ఢిల్లీలో పోరాడి, మండలిరద్దుని ఆపాలని దీపక్‌రెడ్డి సూచించారు.  

జగన్‌ పతనం ఆరంభమైంది: సత్యనారాయణరాజు  

అన్ని వ్యవస్థలను తనకింద ఉంచుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే ముఖ్యమంత్రి కౌన్సిల్‌ను రద్దుచేశాడని, మండలి నిర్వహణకు రూ.60కోట్లు వృథా అవుతున్నాయంటున్న ముఖ్యమంత్రికి తమసభ్యులను నామినేట్‌చేసినప్పుడు ఆ విషయం తెలీదా అని సత్యనారాయణరాజు ప్రశ్నించారు. 

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయాన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపడమే నేరమైనట్లుగా భావించిన ముఖ్యమంత్రి తనపతనాన్ని తానే  కొనితెచ్చుకుంటున్నాడన్నారు. తనకు విధేయుడిగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆర్డీవోస్థాయికి పంపినప్పుడే జగన్‌ పతనం ఆరంభమైందన్నారు.  దేశంలో ఎవరూ చేయనివిధంగా జగన్‌ ప్రవర్తిస్తున్నాడని, 5కోట్ల మందికి ముఖ్యమంత్రినన్న భావన ఆయనలో ఏమాత్రం కనిపించడంలేదన్నారు.

ఓటింగ్‌లో సభ్యుల్నే లెక్కించలేనివారు, పరిపాలనేం చేస్తారు : అశోక్‌బాబు 

మండలిరద్దు తీర్మానం బిల్లుపై ఓటింగ్‌ జరిగేటప్పుడు నాన్‌మెంబర్స్‌ను బయటకు పంపారని, అలానే మండలిలో కూడా సభ్యులుకాని వారిని బయటకు పంపమంటే దాన్ని తప్పుపట్టారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడటం, ఏవో కాగితాలు ఆయనకు చూపించడం జరిగిందని, తరువాతే 133మంది సభ్యులు  మండలిరద్దు బిల్లుకి ఆమోదం తెలిపినట్లుగా స్పీకర్‌ చెప్పారన్నారు. 

read more  జగన్ మనస్తత్వమదే... అందువల్లే కఠిన నిర్ణయాలు: మోపిదేవి వెంకటరమణ

121మంది సభ్యులున్నారని తొలుతచెప్పి తరువాత 133అనడం జరిగిందన్నారు. సభలోని సభ్యుల్ని కూడా లెక్కించలేని ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం పరిపాలన ఇస్తుందని అశోక్‌బాబు ప్రశ్నించారు. వైసీపీకి ఉన్న151మందిలో 133మంది మద్ధతు పలికితే మిగిలిన సభ్యులు ఏమయ్యారని, వారి పరిస్థితి ఏమిటని ఆయన నిలదీశారు. నేటితో వైసీపీ పని అయిపోయిందని, రేపటినుంచి (28వతేదీ) టీడీపీ పోరాటం ఆరంభమవుతుందన్నారు. తీర్మానాలు చేసినంత మాత్రాన రాజధాని మార్పు, మండలి రద్దు అనేవి సాధ్యంకావన్నారు.

చంద్రబాబుకి పేరొస్తుందనే : బుద్దా నాగ జగదీశ్‌

చంద్రబాబుకి పేరొస్తుందనే జగన్‌ రాజధానిని తరలిస్తున్నాడని, మండలిని రద్దుచేశారని,  మేమంతా మావ్యక్తిగతంకోసం పనిచేయడంలేదని, రాష్ట్రప్రజలకోసమే పనిచేస్తున్నామని, భవిష్యత్‌లోనూ చేస్తామని ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు తెలిపారు.

మండలిరద్దుపై పెట్టినశ్రద్ధ, ప్రజాసమస్యలపై పెట్టలేదు: బచ్చుల

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్‌రెడ్డి ఖూనీచేశాడని, మండలిపై ఆయనకు ఇష్టంలేకుంటే అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పి ఉండాల్సి ఉందని, టీడీపీఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై ఒక్కరోజుకూడా జగన్‌, ఆయన పార్టీ సభ్యులు చర్చించలేదని,  రాజధాని తరలింపు, మండలిరద్దుపై పెట్టినశ్రద్ధను ప్రజాసమస్యల పరిష్కారంపై పెట్టి ఉంటేబాగుండేదని అర్జునుడు హితవుపలికారు. 

విశాఖపట్నంలో తనకు, తనవారికి ఉన్న భూముల్ని అమ్ముకొని, లక్షలకోట్లు పోగేసుకోవడానికే జగన్‌ రాజధాని తరలింపు చేపట్టాడన్నారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌పై చంద్రబాబునాయుడు, ఇతర టీడీపీసభ్యులు బహిరంగంగా సవాల్‌ విసిరినా జగన్‌ ఇప్పటివరకు దానిపై చర్యలు తీసుకోలేదన్నారు.

 
  
 

Follow Us:
Download App:
  • android
  • ios