గుంటూరు: భావితరాల భవిష్యత్‌ తలచుకొని రాష్ట్ర పౌరుడిగా తీవ్రమైన ఆందోళనకు లోనవుతున్నానని... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధకలుగుతోందని టీడీపీ శాసనసభాపక్షనేత, మాజీమంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. మున్ముందు ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితులు ఉంటాయా అన్న అనుమానం తనను కలచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 151స్థానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తాడని భావించానని... కానీ రాష్ట్రాన్ని భూస్థాపితం చేయాలన్నవిధంగా 8మాసాలనుంచి ఏపీని గొడ్డలితో నరికినట్లుగా వ్యవహరిస్తున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

భవిష్యత్‌లో ఎవరువచ్చినా బాగుచేయలేని విధంగా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముక్కలు  చేశాడన్నారు. రాష్ట్ర శాసనసభ జరిగిన తీరుచూస్తుంటే వైసీపీ కార్యాలయాన్ని తలపిస్తోందని, బీఏసీ సమావేశం నిర్వహించకుండా సభను నిర్వహించారన్నారు. తొలుత బీఏసీ సమావేశంలో  మూడురోజులు నిర్వహిస్తామని చెప్పినప్పుడు సభలో చర్చించేది అతిముఖ్యమైన బిల్లుల గురించి కాబట్టి, సమయం సరిపోదని టీడీపీ పక్షాన చెప్పడం జరిగిందన్నారు.  అవేమీ లెక్కచేయకుండా ఒకగంటలోనే మూడురాజధానుల బిల్లుని ఆమోదించి మండలికి పంపారన్నారు. 

read more  జగన్ మనస్తత్వమదే... అందువల్లే కఠిన నిర్ణయాలు: మోపిదేవి వెంకటరమణ

మొట్టమొదటిసారి మండలిలో జరిగిన నిర్ణయంపై అసెంబ్లీలో చర్చించారని... చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మండలిరద్దుపై అజెండా ఇవ్వడం జరిగిందన్నారు. నేడు శాసనసభ ఆరంభమయ్యే ముందు బీఏసీ సమావేశం ఉంది రావాలంటూ తనకు ఫోన్‌ చేశారని, ఒకహెలికాఫ్టర్‌ పంపితే మీరుకోరి నట్లుగా వెంటనే హాజరవు తానని తాను చెప్పడం జరిగిందని మాజీమంత్రి తెలిపారు. 

ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మండలిరద్దుకు పూనుకున్న ప్రభుత్వం ఆఘమేఘాలపై అసెంబ్లీని నిర్వహించిందన్నారు. సర్వాధికారాలున్నాయన్న అహంకారంతో మండలిపై వైసీపీ ప్రభుత్వం మూకుమ్మడి దాడికి పాల్పడిందన్నారు. శాసనమండలి ఈ 8నెలల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలాంటి ప్రజోపయోగ నిర్ణయాలను అడ్డుకుందోచెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. 

6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలులు ఉన్నాయంటున్న జగన్‌ దేశంలో ఎన్ని రాష్ట్రాలకు మూడు రాజధానులున్నాయో చెప్పాలన్నారు. 7 మాసాల్లో 32బిల్లులు మండలికి వస్తే దేన్ని తిరస్కరించలేదని కేవలం మూడు రాజధానులపేరుతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్న ప్రభుత్వఏకపక్ష చర్యనే పెద్దలసభ అడ్డుకుందన్నారు.

జగన్‌ రద్దుచేసింది మండలిని కాదు... బడుగు, బలహీనవర్గాల వేదికను..

తను తీసుకున్న నిర్ణయాలను మండలి వ్యతిరేకిస్తుందన్న అక్కసుతోనే జగన్‌ మండలి రద్దుకు పూనుకున్నాడని...తద్వారా ఆయన బడుగు, బలహీనవర్గాలవారి వేదిక లేకుండా చేశాడన్నారు. తొలిశాసనసభ సమావేశాల్లో దేశానికి ఆదర్శంగా ఉంటానని ఏపీ శాసనసభ దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పిన జగన్‌, టీడీపీకి చెందిన సభ్యుల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి సిగ్గులేకుండా తనపార్టీలోకి తీసుకున్నాడని మాజీమంత్రి మండిపడ్డారు. 

ఓడిపోయినవారికి రాజకీయవేదికగా మండలి మారుతుందని చెబుతున్న స్పీకర్‌, ఇతరసభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి బడుగు, బలహీనవర్గాల వారు పనికిరారన్న జగన్మోహన్‌రెడ్డి సలహాదారులు గా తన సామాజికవర్గం వారికే ప్రాధాన్యత ఇచ్చాడన్నారు. మొత్తం సభ్యుల్లో 50శాతానికి పైగా బడుగు, బలహీనవర్గాల సభ్యులున్న మండలిని రద్దుచేయాలనుకుంటున్న జగన్‌, ఆయా సామాజిక  వర్గాలను తన అధికారంతో తొక్కేశాడన్నారు. 

read more  గొంతు నొక్కడం కాదు జగన్ ఏకంగా మర్డర్ చేశారు...: నిమ్మల రామానాయుడు

ప్రజా సమస్యలపై తమగొంతు వినిపిస్తారని తమ  సామాజికవర్గం సమస్యలు చెప్పుకుంటారనే చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలవారికి మండలిలో అవకాశం కల్పించారన్నారు. హైకోర్టులో 3రాజధానల  అంశంపై వాదనలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుని, మండలి సెలెక్ట్‌కమిటీకి  పంపిందని ప్రభుత్వ న్యాయవాదే చెప్పాడన్నారు. జగన్‌ ఏ అధికారంతో మండలిని రద్దుచేశాడో ప్రజలకు, న్యాయస్థానాలకు సమాధానం చెప్పాలన్నారు. 

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడుతున్న తమ్మినేని, ధర్మాన ప్రసాదరావులు 40ఏళ్లపాటు మంత్రులుగా ఉన్నప్పుడు జిల్లాకు ఏంచేశారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

టీడీపీ ఎమ్మెల్సీల కాళ్లకు నమస్కరిస్తున్నాం...

పదవులు పోతాయని తెలిసినా లెక్కచేయకుండా, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ప్రజల పక్షాననిలిచి, రాష్ట్రంకోసం పోరాటం చేసిన తెలుగుదేశం, ఇతర అనుబంధ విభాగాల మండలి సభ్యులందరి కాళ్లకు నమస్కారం చేస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు రాష్ట్రాభివృద్ధిని, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు.

గడచిని 5ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం, జిల్లాలవారీగా అభివృద్ధి వికేంద్రీకరణను చేపట్టిందని, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు సాగునీటి ప్రాజెక్టులతోపాటు, పరిశ్రమల్ని తీసుకొచ్చిన విషయాన్ని వైసీపీ సభ్యులు, మంత్రులకు తెలియకపోవడం వారిఅజ్ఞానానికి చిహ్నమన్నారు. 

టీడీపీ హాయాంలో ప్రారంభమైన అనేక పనుల్ని, డబ్బుపిచ్చితో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నా రు. 7నెలల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక పశ్చిమగోదావరి జిల్లాకు ఏంచేసిందో మంత్రి ఆళ్లనాని చెప్పాలని, టీడీపీసభ్యులను ఆయనే స్వయంగా తీసుకెళ్లి, తమ ప్రభుత్వం ఆ జిల్లాకు ఏంచేసిందో చూపి, దాన్ని నిరూపించగలిగితే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.