పతనం ఖాయం... కాంగ్రెస్ కు పట్టిన గతే వైఎస్సార్ కాంగ్రెస్ కు: టిడిపి ఎమ్మెల్యేలు
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపించారు. రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు విమర్శలు ఎక్కుపెట్టారు.
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థంతో రాష్ట్రాన్ని ముక్కచెక్కలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఏడు నెలల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రాంతీయ, కుల, మత, భాష తత్వాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందన్నారు. దాంతో ఆ పార్టీ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్ లేకుండా చేసుకుందన్నారు. వైసీపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
గతంలో తల్లినిబచంపి రాష్ట్రాన్ని విడగొట్టారని నేడు ఎదిగే బిడ్డ తల పగులగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థితిలో పెట్టుబడులు ఎవరూ పెట్టే పరిస్థితి లేదన్నారు. విశాఖలో భూకబ్జాలకు, బాక్సైట్, బీచ్‌సాండ్, పరిశ్రమల్లో వాటా కొట్టేయడానికి జగన్మోహన రెడ్డి, విజయసాయి రెడ్డి విశాఖకు చేరుతున్నారని ఆరోపించారు.
ముక్కచక్కలవుతున్న రాజధానిని చూసి పక్క రాష్ట్రాలు పండుగ చేసుకుంటున్నాయన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమకు పెద్దగా చేకూరే ప్రయోజనంలేదన్నారు. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (సిబిఐసి)లో కర్నూలు నోడ్ గా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని... రాయలసీమలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయాలని సూచించారు.
read more రాజధాని ఉద్యమం ఉదృతం... అమరావతి పరిరక్షణ సమితి జెఏసి ఏర్పాటు
ఖనిజాలకు కణాచి అయిన రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధిపరచడానికి అనువైన ప్రాంతమన్నారు. అక్కడ పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పనులు చేయకుండా మూడు ముక్కలు చేసిన హైకోర్టు వల్ల రాయలసీమకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఇది అభివృద్ధి వికేంద్రీకరణా? లేక రాజకీయ కుట్రా? అని ప్రశ్నించారు.
ఆదాని డేటా సెంటర్, దుబాయ్ కి చెందిన లుల్లూ గ్రూప్ వంటి వాటితోపాటు అనేక అంకుర పరిశ్రమలను తరిమివేసి విశాఖలో ఏం అభివృద్ధి చేస్తారు? అని ప్రశ్నించారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి)ని అభివృద్ధి చేయాలని... ఇందులో విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాళహస్తిలను పారిశ్రామిక హబ్ లుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కారిడార్ లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి, లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇచ్చాపురం-విశాఖ బీచ్ రోడ్డు పూర్తి చేయడంతో పాటు విశాఖ-కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ని కూడా అభివృద్ధి చేయాలన్నారు. వాల్తేర్ రైల్వే డివిజన్ ని విశాఖ రైల్వే జోన్‌లో కలపాలని... భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అభివృద్ధికి అవకాశం ఉన్న ఈ పనులు ఏం చేయకుండా జగన్ ప్రభుత్వం ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
read more ఆయన వల్లే జగన్ కు ఇంతటి పరిణతి... పుట్టినరోజు వేడుకల్లో ఉమ్మారెడ్డి ప్రశంసలు
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. ఇందుకోసం శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తుచేశారు.గతంలో జగన్ కూడా అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా బలపరిచారని ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, బాలవీరాంజనేయస్వామి, మద్దాల గిరిధర్ గుర్తుచేశారు.