గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏ విషయంపై చర్చించారన్నది రహస్యంగా ఉంచడంలోని ఆంతర్యమేమిటో చెప్పాలని టీడీపీనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రాష్ర్ట నాయకుడు ఢిల్లీ వెళ్లింది తన వ్యక్తిగత ప్రయోజనాలకోసమేననే అభిప్రాయం ప్రజలందరిలోనూ ఉందని అన్నారు. 

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అయిన నేపథ్యంలో రస్ అల్ ఖైమా భారతదేశ ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలోనే జగన్ ఢిల్లీబాట పట్టాడని అందరూ భావిస్తున్నారని ఆరోపించారు. రస్ అల్ ఖైమా తమ దేశంలో ఉండి స్విచ్ ఆన్ చేయడంతో ఇక్కడ జగన్ నెట్ వర్క్ మొత్తం క్రాష్ అయిందని నిమ్మల ఎద్దేవాచేశారు. 

మ్యాట్రిక్స్ ప్రసాద్ గా పిలువబడే నిమ్మగడ్డ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రస్ అల్ ఖైమా కంపెనీ ఏపీలోని వాన్ పిక్ లో పెట్టుబడులు పెట్టిందని... సదరు కంపెనీ 51శాతం పెట్టుబడి పెట్టగా నిమ్మగడ్డ ప్రసాద్ 49శాతం పెట్టుబడిగా పెట్టడం జరిగిందన్నారు. రస్ అల్ ఖైమా, నిమ్మగడ్డల ఉమ్మడి వెంచర్ అయిన వాన్ పిక్ కు ఆనాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 16వేల ఎకరాలు కేటాయించారని... ఆ తరువాత రూ. 854కోట్లను నిమ్మగడ్డ ప్రసాద్, జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ లో పెట్టుబడిగా పెట్టడం జరిగిందన్నారు.  

వాన్ పిక్ లో తాము పెట్టిన పెట్టుబడుల సంగతేంటని ప్రశ్నిస్తూ రస్ అల్ ఖైమా సంస్థ నిమ్మగడ్డను సెర్బియాలో అరెస్ట్ చేయించిందన్నారు. అక్కడజరిగిన విచారణలో భాగంగా నిమ్మగడ్డ అసలు వాస్తవాలు వెల్లడించాడని, రస్ అల్ ఖైమా పెట్టిన పెట్టుబడులను, గొలుసుకట్టు కంపెనీలద్వారా జగన్ కంపెనీల్లోకి తరలించామని చెప్పాడన్నారు. దీంతో వాన్ పిక్ కుంభకోణానికి మూలసూత్రధారి అయిన జగన్ ను తమకు అప్పగించాలని కోరుతూ రస్ అల్ ఖైమా కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. 

గల్ఫ్ దేశాల్లో చట్టాలు కఠినంగా ఉండటం, నేరం రుజువైతే శిక్షలు పడతాయనే భయంతోనే జగన్ హుటాహుటిన ఢిల్లీ బాట పట్టాడన్నారు. గల్ఫ్ దేశానికి చిక్కకుండా ఉండటం కోసం ఢిల్లీ పెద్దలతో బేరసారాలు జరిపాడని, తనను శిక్షల నుంచి తప్పిస్తే భవిష్యత్ లో రాజ్యసభలో తమపార్టీకి వచ్చే 5, 6 రాజ్యసభ స్థానాల్లో రెండు, లేదా మూడు స్థానాలను కేంద్రంలోని పార్టీకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడని... అవసరమైతే తనపార్టీని పువ్వు నీడకు చేర్చడానికి కూడా ముఖ్యమంత్రి  సిద్ధమైనట్లు  ఢిల్లీ వర్గాల నుంచి ఇప్పటికే సమాచారం వచ్చిందన్నారు. 

read more  దిశ చట్టం ఎఫెక్ట్... ఏపిలో మహారాష్ట్ర హోంమంత్రి, డిజిపి పర్యటన

నిమ్మగడ్డ ప్రసాద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా, జగన్ ను తమకు అప్పగించాలని రస్ అల్ ఖైమా కంపెనీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆఘమేఘాలపై ఢిల్లీకి పరుగులు పెట్టాడని నిమ్మల స్పష్టంచేశారు. 

ఢిల్లీ పర్యటనలో ప్రధాని, హోంమంత్రిని కలిసిన జగన్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జైశంకర్ ను కలవకుండా వెనక్కు ఎందుకు వచ్చాడో చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు. రూ.43వేల కోట్లు జప్తు చేయబడి, సీబీఐ, ఈడీ ఛార్జ్ షీట్లలో ప్రథమ ముద్దాయిగా ఉన్న వ్యక్తి నీడలో బతుకుతున్న వైసీపీనేతలు, మంత్రులు మచ్చలేని చంద్రబాబునాయుడిపై నిందారోపణలు చేయడం, అవినీతి పరుడని చెప్పడం ఎంతటి సిగ్గుమాలిన తనమో వారే ఆలోచించుకోవాలన్నారు. 

గడిచిన 8ఏళ్ల నుంచి తన ఆస్తులు, తన కుటుంబసభ్యుల ఆస్తులను వెల్లడిస్తున్న చంద్రబాబునాయుడిని, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని  తనకంటిన అవినీతి బురదను వారికి అంటించాలని జగన్ చూస్తున్నాడన్నారు. జగన్ తండ్రి వైఎస్ కూడా చంద్రబాబుని అవినీతిపరుడిగా చిత్రీకరించడం కోసం 26 విచారణ కమిటీలువేసి చివరకు తోకముడిచాడని, జగన్ తల్లి విజయమ్మ చంద్రబాబు అవినీతిపై విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించి సరైన ఆధారాలు చూపలేక భంగపడిందని, ఇప్పుడు జగన్ కు కూడా అదేగతి పట్టబోతోందని నిమ్మల స్పష్టంచేశారు. 

గడచిన ఎన్నికల్లో వైసీపీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసిందని, అలా ఖర్చు చేసిన వేలకోట్లు జగన్ కు ఎక్కడినుంచి వచ్చాయో ఆయనే బయటపెట్టాలని టీడీపీనేత డిమాండ్ చేశారు.

ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబుకు ప్రజలంతా నీరాజనాలు పడుతుండటంతో ఓర్వలేని రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు ఆయనపై నోరుపారేసుకుంటున్నారని...  ప్రజలకు అండగా ఉండటానికి చంద్రబాబు రోడ్డు మీదకు రావడంతో వైసీపీకి దుగ్ధ మొదలైందన్నారు. గతంలో రావాలి జగన్ అన్న ప్రజలే, ఇప్పుడు పోవాలి జగన్ అంటూ చంద్రబాబు వెంట నడుస్తుండటంతో వైసీపీ వెన్నులో వణుకు మొదలైందన్నారు. 

read more  వైసిపి ప్రభుత్వం ఆ మూడు పథకాలను పక్కాగా అమలుచేస్తోంది...: నారా లోకేష్

ప్రజలకు సుపరిపాలన అందించడం చేతగాక చంద్రబాబుపై, టీడీపీపై విమర్శలు చేస్తున్న వైసీపీ  పాలనను చూసి ప్రజలు విరక్తి చెందారన్నారు. పేదలపై భారం మోపనని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇసుక, మద్యం, విద్యుత్, ఆర్టీసీ, ఛార్జీలు, సిమెంట్ బస్తా ధరలు పెంచాడని, జే-ట్యాక్స్ వసూళ్లకోసం పేదవాడిపై భారం మోపారన్నారు. 

మద్యం ధరలు పెంచితే తాగేవారి సంఖ్య తగ్గుతుందన్న ఆలోచన చేసిన ప్రభుత్వం, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రయాణికుల సంఖ్యను కూడా తగ్గించాలని భావించిందా అని నిమ్మల దెప్పి పొడిచారు.  తాము ఎన్డీఏ లో చేరతామని మంత్రి బొత్స చెప్పాడని, ఆయన వ్యాఖ్యల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో రాష్ట్ర ప్రజలందరిలోనూ అనేక అనుమానాలు ఏర్పడ్డాయన్నారు. గతంలో రాజధాని తరలింపు అంశంపైకూడా ముందు బొత్సతో ప్రకటన చేయించారని, అదే విధంగా ఇప్పుడు జగన్ తన భవిష్యత్ ను కాపాడుకోవడానికి ఎన్డీఏ వైపు చూస్తున్నాడనడటంలో ఎటువంటి సందేహం లేదని నిమ్మల తేల్చిచెప్పారు.