దిశ చట్టం ఎఫెక్ట్... ఏపిలో మహారాష్ట్ర హోంమంత్రి, డిజిపి పర్యటన
జగన్ ప్రభుత్వం మహిళా భద్రత కోసం తీసుకువచ్చిన దిశ చట్టం అమలుతీరును పరిశీలించేందుకు మహారాష్ట్ర హోంమంత్రి నేతృత్వంలోని అధికారుల బృందం ఏపిలో పర్యటిస్తోంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా రక్షణ కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ చట్టం దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతోంది. మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన ఈ చట్టం సక్సెస్‌ఫుల్ గా అమలవుతుండటంతో ఇతర రాష్ట్రాలు కూడా ఈ చట్టంపై అద్యయనం మొదలెట్టాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టంపై ఆసక్తి చూపుతోంది.
రాష్ట్రంలో దిశ చట్టాన్ని అమలుపరుస్తున్న విధానం, దీని వల్ల మహిళలకు ఎలాంటి భద్రత లభిస్తుందన్న విషయాలు తెలుసుకునేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ బృందం ఏపిలో పర్యటిస్తోంది. ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్, మహరాష్ట్ర డీజీపీ సుబోత్ కుమార్ జైస్వాల్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఫర్ హోంతో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపిఎస్ అధికారుల బృందం దిశ చట్టం అమలుతీరును పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా దిశచట్టం అందరి మన్నలను పొందుతుంది. మరికాసేపట్లో మహారాష్ట్ర బృందం ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రి తానేటి వనిత, సిఎస్ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, దిశ స్పెషల్ ఆఫీసర్లతో భేటీ కానున్నారు. ఈ చట్టం అమలుతీరు, ఇప్పటివరకు సాధించిన ఫలితాల గురించి తెలుసుకోనున్నారు.
యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన దిశా హత్యాచారం ఘటన భవిష్యత్తులో ఆడపిల్లలకు, మహిళలకు మరింత రక్షణ కల్పించే విధంగా నూతన చట్టాలు రూపొందిస్తూనే... వాటి అమలుకు మరింత పటిష్టమైన చర్యలను చేపడుతున్నాయి ప్రభుత్వాలు. ఇలా ముందడుగు వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి దిశా చట్టాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ... దాని అమలుకు అవసరమైన మౌలిక అంశాల ఏర్పాటును కూడా ప్రారంభించారు.
ఇటీవలే ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమండ్రిలో తొలి ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను. దిశ యాప్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. మహిళలకోసం ప్రత్యేకమైన స్టేషన్ కాబట్టి మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది జగన్ వెంట ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్టేషన్‌లో ఇద్దరేసి డీఎస్పీలు, సీఐలు , ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉండనున్నారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయ పరచడం, ప్రజల్లో ఈ చట్టంపై మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా ఇప్పటికే నియమించింది.